ప్రాణాలకు తెగించి.. ఆరుగురిని కాపాడిన్రు

  • దట్టమైన అడవి.. ఎత్తయిన కొండలు.. విడువకుండా పట్టిన ముసురు.. 

వయనాడ్ అడవిలోని ఓ కొండ గుహలో చిక్కుకున్న ఆదివాసీ కుటుంబాన్ని రెస్క్యూ టీంకు చెందిన నలుగురు ఆఫీసర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడారు. కేరళ రాష్ట్రం వయనాడ్​లో గత మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మెప్పాడి, చూరల్ మల ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి అటువైపు వెళ్లే దారులు మూసుకుపోయాయి. అయితే అడవిలో నివసించే పనియా తెగకు చెందిన భార్యాభర్తలు, వారి నలుగురు పిల్లలు అక్కడే చిక్కుకుపోయారు. గురువారం వారిని గుర్తించిన రెస్క్యూ టీమ్​.. ఎనిమిది గంటలపాటు శ్రమించి కొండలను ఎక్కుతూ దిగుతూ ఆరుగురిని క్షేమంగా తీసుకొచ్చారు.

ఇలాంటి పరిస్థితుల్లో బండరాళ్లు, చెట్లు ఎక్కుతూ, పొదలు దాటుకుంటూ కొండపైనున్న గుహలోకి చేరుకోవడం అంటే ఎంతో కష్టం. అలాగే అక్కడి నుంచి నలుగురు పిల్లలను, వారి తండ్రిని జాగ్రత్తగా కిందకు తీసుకురావడం అంటే కూడా మామూలు విషయం కాదు. కానీ వయనాడ్ అడవిలోని ఓ కొండ గుహలో చిక్కుకున్న ఆదివాసీ కుటుంబాన్ని రెస్క్యూ టీంకు చెందిన నలుగురు ఆఫీసర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడారు. విలువైన ఆరు ప్రాణాలను కాపాడిన రెస్క్యూ టీం సభ్యులపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఏం జరిగిందంటే.. 

వయనాడ్ లో గత మంగళవారం భారీ వర్షం మొదలైంది. మరుసటి రోజు తెల్లారేసరికల్లా వరదలు పోటెత్తాయి. మెప్పాడి, చూరల్​మల ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. బయటి వ్యక్తులతో పెద్దగా సంబంధాలు లేకుండా అడవిలో నివసించే పనియా తెగకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు, వారి నలుగురు పిల్లలు అడవిలో చిక్కుకుపోయారు. అటవీ ఉత్పత్తులను సంతల్లో అమ్ముకుని, అక్కడి నుంచి సరుకులు తెచ్చుకుని తింటూ వారు జీవిస్తుంటారు. 

కానీ ఎడతెగని వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో ఏడాది నుంచి నాలుగేండ్ల వయసున్న నలుగురు పిల్లలతో కొండపైనున్న ఓ గుహలో తలదాచుకున్నారు. పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే చూడలేక ఆ తల్లి కొండ దిగి ఏమైనా తినడానికి దొరుకుతుందేమోనని వెతుకుతుండగా.. గురువారం ఫారెస్ట్ ఆఫీసర్ కె. హశీస్ కంటపడింది. ఆరా తీయగా.. తమ పరిస్థితి గురించి చెప్పింది. 

దీంతో వారిని కాపాడేందుకు సెక్షన్ ఫారెస్ట్ ఆఫీసర్ జయచంద్రన్, బీట్ ఫారెస్ట్ ఆఫీసర్ కె. అనిల్ కుమార్, ర్యాపిడ్ రెస్పాన్స్ టీం సభ్యుడు అనూప్ థామస్ తో ఆపరేషన్ మొదలుపెట్టారు. ఎంతో కష్టం మీద కొండను ఎక్కుతూ గుహ వద్దకు చేరుకున్నారు. ఎనిమిది గంటలపాటు సాగిన ఆపరేషన్ లో నలుగురు పిల్లలను, వారి తండ్రిని క్షేమంగా కిందకు తీసుకొచ్చారు.