బీసీలకు బడ్జెట్​లో సగం నిధులైనా కేటాయించాలి: తీన్మార్ మల్లన్న

  • సెక్రటేరియెట్​కు రాని సీఎంగా కేసీఆర్ రికార్డు 
  • మండలిలో తీన్మార్ మల్లన్న 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్ రూ.2.91 లక్షల కోట్లలో సగమైనా బీసీలకు కేటాయించాలని ప్రభుత్వానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విజ్ఞప్తి చేశారు. కేవలం రూ.9,200 కోట్లు సరిపోవన్నారు. దేశంలో ఎక్కువ కాలం సెక్రటేరియెట్ కు రాని సీఎంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రికార్డు నెలకొల్పారని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన శాసనమండలిలో మాట్లాడారు. గెస్ట్ లెక్చరర్లకు12 నెలల జీతం ఇవ్వాలని కోరారు.

 ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల వ్యవస్థను రద్దు చేయాలని, తద్వారా రూపాయి భారం లేకుండా ప్రతి ఎంప్లాయీకి రూ.20వేల జీతం ఇవ్వొచ్చని చెప్పారు. ఏజెన్సీల ద్వారా శ్రమదోపిడీ జరుగుతోందని ఆరోపించారు. దేశంలో పలు రాష్ర్టాలు విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ చట్టం ద్వారా పేదలకు 25శాతం సీట్లు ఇవ్వాల్సి ఉందని, కానీ గత బీఆర్ఎస్ సర్కారు కార్పొరేట్ విద్యాసంస్థలైన శ్రీచైతన్య, నారాయణతో అంటకాగిందని విమర్శించారు. 

నిత్యం రైతు సంక్షేమమని చెప్పే కేసీఆర్ హయాంలో7800 మంది రైతులు ఎందుకు చనిపోయారని ప్రశ్నించారు. గత సర్కారు హయంలో భారీగా రైతు ఆత్మహత్యలు జరిగాయని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బడ్జెట్ లో రైతు సంక్షేమానికి రూ.70వేల కోట్లు కేటాయించిందని వెల్లడించారు.