అమెరికాలో అరాచకం : న్యూఇయర్ వేడుకల్లోకి దూసుకొచ్చిన ట్రక్.. ఆ తర్వాత తుపాకీతో కాల్పులు

న్యూ ఓర్లియన్స్: అమెరికాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో విషాదం చోటు చేసుకుంది. అమెరికాలోని న్యూ ఓర్లియన్స్లో సెలబ్రేషన్స్ చేసుకుంటున్న జనంపైకి వేగంగా వచ్చిన ఓ మినీ ట్రక్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మంది గాయపడ్డారు. వేకువజామున 3.15 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. న్యూ ఓర్లియన్స్లోని బోర్బన్ స్ట్రీట్, ఇబర్ విల్లీ నైట్ లైఫ్ కల్చర్కు ఫేమస్. న్యూ ఇయర్ కావడంతో ఈ ఏరియాలో క్రౌడ్ మరింత పెరిగింది. హై స్పీడ్తో దూసుకొచ్చిన మినీ ట్రక్ ఆ జనంపైకి దూసుకెళ్లడంతో ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో శోకసంద్రంలో మునిగిపోయింది.

అంతేకాదు.. ఈ ప్రమాదానికి కారణమైన ఆ ట్రక్ డ్రైవర్ కాల్పులు జరిపినట్టు కూడా తెలిసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వాహనం కారు కాదని ట్రక్ అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసు కార్లు, అంబులెన్స్లతో ఆ ప్రాంతం కనిపించింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో వందలాది మంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లు అక్కడున్న వారు తెలిపారు. ఎమర్జెన్సీ టీమ్స్ తక్షణమే స్పందించి ట్రాఫిక్ క్లియర్ చేశాయి.