ఒక్క ఓటు బలం ఎంతో తెలుసా? : చిట్టెట్టి కృష్టారెడ్డి

పార్లమెంటరీ  ప్రజాస్వామ్యంలో  ఓటు  వెన్నెముకలాంటిది.  ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి,  ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియలో పాల్గొనడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన తరువాత భారతదేశ ప్రజాస్వామ్య ప్రయాణానికి నాంది పలికిన మొదటి లోక్​సభ ఎన్నికలు అక్టోబర్ 25, 1951 నుంచి ఫిబ్రవరి 21, 1952 వరకు నాలుగు నెలల పాటు జరిగాయి. 1951-52లో  మొత్తం 17.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.  ప్రపంచంలోనే  అతిపెద్ద  ప్రజాస్వామ్య దేశమైన  భారత్​లో 2024 లోక్​సభ ఎన్నికల్లో  96.8 కోట్ల మంది ఓటుహక్కు  వినియోగించుకోనున్నారు.

భారత ఓటర్లు అమెరికా కంటే దాదాపు నాలుగు రెట్లు,  యునైటెడ్ కింగ్​డమ్​ కంటే దాదాపు 20 రెట్లు, పాకిస్థాన్ కంటే ఏడు రెట్లు ఎక్కువ.  మొదటిసారి  ఓటర్లు 18 మిలియన్ల మంది ఉంటారు.  భారత్ 17వ లోక్​సభ  ఎన్నికలను  దిగ్విజయంగా పూర్తి చేసింది.  ప్రజాస్వామ్య స్ఫూర్తి రోజు రోజుకూ పెరుగుతోంది. 1951లో  44 శాతంగా ఉన్న ఓటింగ్ శాతం 2019ల జరిగిన 17వ లోక్​సభ ఎన్నికల్లో  సగటు పోలింగ్ 67శాతంగా నమోదైంది.  పెరిగిన ఓటింగ్​ శాతం  ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని పెంపొందించింది. 

ప్రతి ఓటు ప్రజల జీవితాలని మెరుగుపరచడానికి ఉపయోగపడే అమూల్యమైన సాధనం.  నేడు మారుతున్న జీవన పరిస్థితుల దృష్ట్యా ప్రజలు వివిధ రంగాలలో తలమునకలై ఉంటున్నారు.  ఓటింగ్ రోజు తమ ఓటు హక్కు వినియోగించుకోకపోవడంతో ఓటింగ్ శాతం మెరుగైన స్థాయిలో నమోదు కావడం లేదు. ముఖ్యంగా పట్టణాలలో ఉన్నటువంటి ప్రజల్లో పోలింగ్ స్టేషన్లకు వెళ్లడానికి కొంత అనాసక్తి కనపడుతోంది. దీనికి ముఖ్య కారణాలలో ఒకటి రాజకీయ నాయకులపై విరక్తి.  ప్రజాసమస్యలను పరిష్కరించడంలో నాయకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ధోరణి వ్యక్తమౌతోంది.  

తన ఒక్క ఓటు వేయకపోవడం వల్ల దేశ భవిష్యత్తుకు గాని, నాయకుడికి గాని ఎటువంటి నష్టం ఉండదు అనే భావనలో కొంతమంది  ప్రజానీకం ఉన్నట్టుగా అధ్యయనాల ద్వారా వెల్లడైంది.  కానీ, ఒకసారి గత ఎన్నికల ఫలితాలను పరిశీలించినట్లయితే ఒక్క ఓటుతో  వివిధ పార్టీల అభ్యర్థులు ఎంపీ,  ఎమ్మెల్యేగా  ఓడిపోయిన సంఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా అవిశ్వాస తీర్మాన సమయంలో ఒక్క ఎంపీ ఓటు తేడాతో  ప్రభుత్వాలు కుప్పకూలిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. 

ఒక్క ఓటుతో ఓడిన అభ్యర్థులు

2004 కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో,  జనతాదళ్ (సెక్యులర్)కి చెందిన ఏఆర్​ కృష్ణమూర్తి  కేవలం ఒక ఓటు తేడాతో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆర్ ధృవనారాయణ చేతిలో ఓడిపోయారు.  సంతేమరహళ్లి (ఎస్సీ) అసెంబ్లీ స్థానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

కృష్ణమూర్తికి 40,751 ఓట్లు రాగా, ధృవనారాయణ కేవలం ఒక  ఓటు అదనంగా  రావడం వల్ల 40,752 ఓట్లతో విజయం సాధించారు. రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్వారా అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సీపీ జోషి ,  బీజేపీకి చెందిన కల్యాణ్ సింగ్ చౌహాన్  పోటీ పడ్డారు. ఫలితాలు వెల్లడైనప్పుడు చౌహాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 62,216 ఓట్లు రాగా, జోషికి 62,215 ఓట్లు వచ్చాయి.  కేవలం ఒక్క ఓటు తేడాతో చౌహాన్ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది.  ఆ ఎన్నికల్లో రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగానే కాకుండా ముఖ్యమంత్రి పదవికి కూడా ముందంజలో ఉన్న జోషికి ఇది షాక్​ ఇచ్చింది. ఆయన తన పార్టీని విజయపథంలో నడిపించినా, కేవలం ఒక్క ఓటు తేడాతో తన సొంత సీటును కోల్పోయారు.

2018లో జరిగిన మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో తుయివాల్ (ST) అసెంబ్లీ స్థానంలో,  మిజోరాం నేషనల్ ఫ్రంట్ (MNF)కి  చెందిన లాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చందమా రాల్టే  కేవలం మూడు ఓట్ల తేడాతో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే RL పియాన్మావియాను ఓడించారు. 1989లో  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన కొణతాల రామకృష్ణ  కేవలం తొమ్మిది అదనపు ఓట్లతో ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అనకాపల్లి స్థానం నుంచి లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఏడుగురు విజేతలు 2000 కంటే తక్కువ ఓట్ల తేడాతో గెలుపొందారు. కాబట్టి,  ప్రతి ఓటు చాలా విలువైనది.  కేవలం ఒక్క ఓటు ప్రజల భవిష్యత్తును మార్చటంలో కీలకపాత్ర పోషిస్తుంది అనటానికి ఇవే ఉదాహరణలు.

ఒక్క ఓటుతో పడిపోయిన  వాజ్​పేయి సర్కారు

1999వ  సంవత్సరంలో  అప్పటి ప్రత్యేక పరిస్థితులలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో  ప్రధాని వాజ్​పేయి సర్కారు అవిశ్వాస తీర్మానంలో ఒక్క ఓటు తేడాతో పడిపోయింది. ఒక్క ఓటు తేడాతో పార్లమెంట్ అభ్యర్థి ఓడిపోవడం, ఒక్క అభ్యర్థి మద్దతు లేకపోవడంతో అలనాటి ప్రభుత్వం రద్దు కావడం, మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రతి పౌరుడు బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.  కాగా, ప్రజాస్వామ్య పెద్ద పండుగ 18వ లోక్​సభ ఎన్నికలు ఏడు దశల్లో  ప్రశాంతంగా జరుగుతుండటం శుభ పరిణామం.  

ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం.  దేశవ్యాప్తంగా2024 లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో  భారత ఎన్నికల సంఘం ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలను వీక్షించడానికి 23 దేశాలు (భూటాన్, మంగోలియా, ఆస్ట్రేలియా, మడగాస్కర్, ఫిజీ, కిర్గిజ్ రిపబ్లిక్, రష్యా, మోల్డోవా, ట్యునీషియా, సీషెల్స్, కంబోడియా, నేపాల్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్, కజకిస్తాన్, జార్జియా, చిలీ, ఉజ్బెకిస్తాన్, మాల్దీవులు,  పపువా న్యూ గినియా, నమీబియా) ఎన్నికల నిర్వహణ సంస్థల (ఇఎంబి) నుంచి 75 మంది అంతర్జాతీయ సందర్శకులను ఆహ్వానించింది.  

ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్స్ (IFES) సభ్యులు, భూటాన్, ఇజ్రాయెల్ నుంచి మీడియా బృందాలు కూడా పాల్గొంటున్నాయి. అనేక రకాల సాంస్కృతిక, సంప్రదాయ, ఆచార వ్యవహారాలు,  వైవిధ్యభరితమైన కట్టుబాట్లు కలిగివున్న ప్రజా సమూహం ఉన్నదేశం భారతదేశం.  భిన్నత్వంలో ఏకత్వంలా ఐకమత్యంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలను నిర్వహించుకోవడం భారతదేశం గొప్పతనం. ఈ గొప్పతనాన్ని మరింత ఇనుమడింప చేయాలంటే ప్రతి భారత పౌరుడు తమకు లభించిన ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.

పెరుగుతున్న  ప్రజల భాగస్వామ్యం

 ప్రజలను చైతన్యపరచడానికి రాజకీయ ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీల ద్వారా ప్రజాసేవకు ముందుకువస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటం గమనించవచ్చు.  స్వాతంత్ర్య భారతావని.. ఓటు హక్కుతో పాటు రాజకీయ పార్టీల స్థాపన, వాటి ద్వారా ప్రజలకు సేవ చేయడానికి  అవకాశం కల్పించింది. 1951లో  జరిగిన తొలి లోక్ సభ ఎన్నికల్లో 53 పార్టీలు పోటీ చేశాయి. అయితే, ఏడు దశాబ్దాల్లో జాతీయ పార్టీల సంఖ్య 14 నుంచి 6కు పడిపోయింది.  ఈ 2024 ఎన్నికల్లో 2,600కు పైగా వివిధ రాజకీయ పార్టీలు నమోదయ్యాయి.

పోటీచేసే రాజకీయ పార్టీల సంఖ్య తొమ్మిది రెట్లు పెరిగింది.  ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం, ప్రజల సౌకర్యాలను మెరుగుపరచుకోవడం కోసం ప్రతి పౌరుడు విధిగా ఎన్నికల రోజు తమ ఓటు హక్కును వినియోగించుకొని తమ కర్తవ్యాన్ని బాధ్యతగా నిర్వర్తించాలి.  నా ఓటు వేయకపోతే ఏమవుతుంది అనే ఆలోచన నుంచి, నా ఒక్క ఓటుతోనే అభ్యర్థులు గెలుస్తారు,  ప్రభుత్వాలు నిలబడతాయన్న విశ్వాసంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.

చిట్టెట్టి కృష్టారెడ్డి

అసిస్టెంట్ ప్రోఫెసర్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ