బీజేపీ లీడర్‌‌పై హత్యాయత్నం ?

  • వాకింగ్‌‌ చేస్తున్న టైంలో రాడ్లతో దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తులు
  • తీవ్రంగా గాయపడ్డ బీజేపీ నాయకులు రమేశ్‌‌

జగిత్యాల రూరల్, వెలుగు : వాకింగ్‌‌ చేస్తున్న బీజేపీ నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా తిమ్మాపూర్‌‌లో బుధవారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... తిమ్మాపూర్‌‌ గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త, దళిత నాయకుడు దుబ్బాక రమేశ్‌‌ బుధవారం మోతె బైపాస్‌‌ రోడ్డుపై వాకింగ్‌‌ చేస్తున్నారు. ఈ టైంలో మంకీ క్యాప్‌‌ ధరించిన నలుగురు వ్యక్తులు కారులో వచ్చి ఇనుప రాడ్లతో రమేశ్‌‌పై దాడి చేశారు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించినా సమాధానం ఇవ్వకుండా విచక్షణారహితంగా దాడి చేయడంతో రమేశ్‌‌ స్పృహ కోల్పోయాడు. 

దీంతో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. రమేశ్‌‌ను గమనించిన స్థానికులు జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్‌‌కు తరలించారు. మెరుగైన ట్రీట్‌‌మెంట్‌‌ కోసం ఓ ప్రైవేట్‌‌ హాస్పిటల్‌‌లో చేరారు. రియల్ వ్యాపారానికి చెందిన వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే తనపై దాడి చేసినట్లు రమేశ్‌‌ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసినట్లు రూరల్‌‌ పోలీసులు తెలిపారు. సీఐ కృష్ణారెడ్డి బాధితుడు రమేశ్‌‌ను కలిసి వివరాలు సేకరించారు.