ఉద్యమకారుల ఆకాంక్షలు ఇప్పటికైనా నెరవేరేనా?

స్వరాష్ట్రం, స్వపరిపాలన, నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ నినాదాలతో  సాధించుకున్న  ప్రత్యేక  తెలంగాణ రాష్ట్రం  దశాబ్ది  ఉత్సవాలకు  సిద్ధమైంది. ఉద్యమ పార్టీగా అధికార పీఠమెక్కిన నిన్నటి టీఆర్ఎస్​ (నేటి బీఆర్ఎస్) ఆధ్వర్యంలో ఇష్టంగానో, కష్టంగానో, నష్టంగానో  తెలంగాణ  పదేండ్లు పూర్తి చేసుకుంది. ఉద్యమ కాలం నాటి ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైంది. ఆ పార్టీని ఓడిస్తేనే తెలంగాణ రాష్ట్రానికి విముక్తి అనే నినాదంతో  అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, గత పదేండ్ల పాలనకు భిన్నంగా తెలంగాణను పునర్ నిర్మిస్తామని పునరుద్ఘాటిస్తోంది. 

తాము చేస్తా మన్న మార్పుకు శ్రీకారం చుట్టేందుకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఒక వేదికగా సీఎం రేవంత్ సర్కారు ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది.  కాంగ్రెస్  ప్రభుత్వం కొలువుదీరిన మరుక్షణం నుంచీ గత పాలకుల లోపాలను బయటపెట్టి ప్రజాభిమానాన్ని చూరగొనాలనే ప్రయత్నం కనిపిస్తోంది. అందుకు అనుగుణంగానే మొట్టమొదటి చర్యగా ప్రగతి భవన్ కంచెలు కూల్చేయటం, దానికి ‘’జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్’’ అని నామకరణం చేయడం మనం చూశాం.

రాచరిక పోకడలకు తెలంగాణ వ్యతిరేకం

 ప్రజాస్వామ్యంలో రాచరికపు పోకడలను వ్యతిరేకించే తెలంగాణ సమాజం ప్రభుత్వ చర్యను స్వాగతించిందనే  చెప్పాలి. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులతో పాటు ప్రజా యుద్ధనౌక గద్దర్ లాంటి వారిని ఎందరినో  గేటు బయట నిలబెట్టిన ఆ అహంకార కంచెలను కూల్చేయడంతో  ప్రభుత్వానికి పెద్దఎత్తున మద్ధతు కూడా లభించింది. అదేవిధంగా ప్రజాభవన్​లోకి ప్రజలకు ప్రవేశం కల్పించి తమ గోడును  నేరుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లేదా మంత్రులకు చెప్పుకునే అవకాశం కల్పించడంతో ఏదో మార్పు మొదలైందనే భావన ప్రజలలో కలిగింది. 

అదేవిధంగా ప్రజాయుద్ధనౌక గద్దర్ పేరున అవార్డు తీసుకురావడం కూడా ప్రజల మద్దతును పొందింది. దీంతో పాటు రైతుల భూహక్కులకు విఘాతం కలిగిస్తుందన్న విమర్శలు ఎదుర్కొన్న ‘ధరణి  పోర్టల్’ను రద్దు చేయడం, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తులు తీసుకోవడం ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న ఆశాభావం కోల్పోకుండా చేసిందనే చెప్పాలి.  

తెలంగాణ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ‘టీఎస్’ స్థానంలో టీజీ’ని తీసుకురావడం, అదేవిధంగా అధికారిక చిహ్నాలను మార్చడం, రాష్ట్ర గీతాన్ని తయారు చేయించడం మొదలైన చర్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇందులో తెలంగాణ ఉద్యమకాలం నాటి ఆనవాళ్లైన టీజీ అని రాయడం, అందెశ్రీ రాసిన ‘‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం’’ అనే పాటను రాష్ట్ర గీతంగా తీసుకురావడం తెలంగాణ ప్రజలు ఆమోదిస్తున్న అంశాలే.  

అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలి

తెలంగాణ ఉద్యమం ఒక చరిత్ర.  హైదరాబాద్​ రాష్ట్రాన్ని ఆంధ్రలో విలీనం చేసినప్పటి నుంచి నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు ఉద్యమం విస్ఫోటనం చెందిన అగ్నిపర్వతంలా నిరంతరం కొనసాగుతూనే వచ్చింది. ఈ ఉద్యమంలో 1969లో 369 మంది ఉద్యమకారులు అమరులైన మాట చరిత్ర. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ వాదం ప్రజాసంఘాల ద్వారా, విద్యార్థుల ద్వారా, నాయకుల ద్వారా నడుస్తూనే వస్తున్నది. మలిదశ ఉద్యమంలో సుమారు 1300 మందికి పైగా ఉద్యమకారులు అమరులయ్యారు.  వేల సంఖ్యలో ఉద్యమకారులు జైళ్లపాలయ్యారు.  కేసులు ఎదుర్కొన్నారు.   

అమరుల కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిరాదరణకు గురయ్యారు. తూతూ మంత్రంగా ఆ కుటుంబాలను గత ప్రభుత్వం ఆదుకోగా కొంతమేరకు లబ్ధి చేకూర్చింది. కానీ, పూర్తిస్థాయిలో అమరుల కుటుంబాలకు న్యాయం చేయలేదనేది కాదనలేని వాస్తవం.  ఉద్యమకారులను స్వాతంత్ర్య సమర యోధులువలె గుర్తించి వారికి రాజకీయ, ఆర్థిక అండదండలు అందిస్తామని చెప్పిన అప్పటి ప్రభుత్వం  ఉద్యమకారుల ఆకాంక్షలను పక్కన పడేసింది. కనీసం ఉద్యమకారుల కేసులను కూడా పూర్తిస్థాయిలో ఎత్తేసే ప్రయత్నం చేయలేకపోయింది. మరి ఇలాంటి పరిస్థితులలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల ఆశలు, ఆకాంక్షలకు ఊపిరి పోస్తూ ప్రకటనలు, హామీలను ఇవ్వడం హర్షణీయం. గత ప్రభుత్వంలా కాకుండా హామీలు అమలు చేసి తీరాలని  తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ సర్కారును కోరుతున్నారు. 

జెంజర్ల రమేష్, హరీష్ పూదరి, మహదేవ్ నారుమళ్ల, 
(తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు, ఓయూ పరిశోధక విద్యార్థులు)