ఎమ్మెల్సీ బరిలో నిలిచేదెవరో ?

  • వచ్చే మార్చిలో జీవన్ రెడ్డి పదవీకాలం పూర్తి
  • మరోసారి ఆయన అభ్యర్థిత్వంపై సస్పెన్స్
  • కాంగ్రెస్ పార్టీ టికెట్ కు ఫుల్ డిమాండ్ 
  • ఆశావహుల్లో ఆల్ఫోర్స్నరేందర్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు 
  • ఈసారి దూరంగానే బీఆర్ఎస్ ?  
  • బలమైన అభ్యర్థిని నిలిపే వేటలో బీజేపీ 


కరీంనగర్, వెలుగు:  కరీంనగర్– నిజామాబాద్– ఆదిలాబాద్– మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇప్పటినుంచే ఆశావహులు ఫోకస్ పెంచారు. పెద్దల సభలో అడుగు పెట్టాలనే ఆసక్తితో ఉన్న లీడర్లు, ప్రముఖులు టికెట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వచ్చే ఏడాది మార్చిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి  పదవీకాలం పూర్తి కానుంది. దీంతో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించి ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ లోగా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని గడువు విధించింది. ఇక అక్టోబర్ 1 నుంచి గ్రాడ్యుయేట్ ఓటర్ ఎన్ రోల్ మెంట్ మొదలుకానుండగా ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. అప్పట్లో పవర్ లో ఉన్నప్పుడే  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీచేసేందుకు బీఆర్ఎస్ వెనకంజ వేసింది. అధికారం కోల్పోయి వరుస ఓటములతో చతికిలపడింది.  ఈసారి పోటీచేసే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ మాత్రం బలమైన అభ్యర్థి కోసం వేట మొదలు పెట్టింది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ టికెట్ కోసం ప్రముఖ విద్యావేత్త ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. 

బలమైన అభ్యర్థి వేటలో  బీజేపీ

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలమైన అభ్యర్థిని నిలపబోతున్నట్లు తెలిసింది. గతంలో పోటీ చేసిన బీజేపీ సీనియర్ లీడర్ సుగుణాకర్ రావు  మరోసారి బరిలో నిలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయనతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రాణిరుద్రమ కూడా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. 

జీవన్‌రెడ్డి పోటీ చేస్తారా.. వైదొలుగుతారా ? 

 ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మళ్లీ  పోటీలో చేస్తారనే దానిపై క్లారిటీ లేదు.  జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంతో జీవన్ రెడ్డి పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అలిగారు.  పార్టీలో ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం తగ్గదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హామీ ఇవ్వడంతో ఆయన శాంతించారు. ఎమ్మెల్సీ పదవీకాలం ముగిశాక ఎలాంటి ప్రాధాన్యమిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వయస్సుపైబడినందున ఈసారి జీవన్ రెడ్డి పోటీ చేయకపోవచ్చనే చర్చ నడుస్తోంది.  

తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని వెలిచాల ? 

ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి పోటీచేసి ఓడిపోయిన వెలిచాల రాజేందర్‌రావు పేరు బలంగా వినిపిస్తోంది. 1978లో  తెలంగాణలోని 9 ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తన తండ్రి జగపతిరావు ఎన్నిక య్యారు. తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని ఎమ్మెల్సీగా పోటీ చేయాలని వెలిచాల భావిస్తున్నట్లు తెలిసింది.  లోక్ సభ ఎన్నికల్లో టికెట్ లేటుగా ఇవ్వగా ఓటమిచెందినా.. 3.50 లక్షల ఓట్లు సాధించారు. ప్రస్తుతం ఆయన ఫుల్ టైం పాలిటిక్స్ లో ఉంటున్నారు. ఆయనకు కరీంనగర్ డీసీసీ బాధ్యతలు అప్పగిం చే యోచనలో పార్టీ అధిష్టానం ఉందనే ప్రచారం కూడా ఉంది.  టికెట్ కన్ఫ మ్ చేస్తే గ్రాడ్యుయేట్స్ ఎన్ రోల్ చేసుకునేందుకు  ఆయన రెడీ అవుతున్నారు. 


పాలిటిక్స్ లోకి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి 

ప్రముఖ విద్యావేత్త, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు.  కరీంనగర్ లో సామాజిక సేవా కార్యక్రమాలకు ఆయన సాయం చేస్తారనే పేరుంది. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థ గత 34 ఏండ్లుగా సేవలు అందిస్తుండగా.. లక్షలాది మంది విద్యార్థులు చదివారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే పూర్వ విద్యార్థులు, స్టాఫ్ తోపాటు ఇతర విద్యాసంస్థల మేనేజ్ మెంట్స్, స్టాఫ్ తనకు పెద్ద ఓటు బ్యాంకు కానునందని భావిస్తున్నట్లు తెలిసింది. ఆయన కాంగ్రెస్ లేదంటే ఇండింపెండెంట్ గా బరిలో నిలుస్తానని ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో చెప్పారు. గతంలో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి  పోటీ చేయాలని భావించి  2018లో ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ పోటీ చేయడంతో  తనకు టికెట్ రాకపోవడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లోనూ పోటీచేస్తారనే ప్రచారం జరిగినా.. కొట్టిపారేశారు. మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఆయన ఇప్పటికే తన మనసులో మాట చెప్పారు. కాంగ్రెస్ మద్దతిస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా తన గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు.