ఆయుర్వేదంలో మనకు తెలియని మొక్కలు, చెట్లు మరియు మూలికలు చాలా ఉన్నాయి. అందులో అశోక చెట్టు ఒకటి. దీనిని మనం ఇంటి గార్డెన్స్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం కానీ దీని వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. ఆయుర్వేదంలో, అశోక చెట్టు దాని ఆధ్యాత్మిక లక్షణాలతో పాటు శరీరానికి కలుగజేసే అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. ఈ మొక్కలో చాలా ఔషద గుణాలున్నాయని, ఇది చాలా రోగాలకు మందుగా పనిచేస్తుందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే ఈ మొక్క గురించి మరింత సమాచారం తెలుసుకుందాం...
ఔషధాలు కలిగిన మొక్క
అశోక చెట్టు ఆయుర్వేద దృక్కోణంలో ఒక ఔషధ మొక్క, దాని ఆకులను పేస్ట్ చేసి రాయడం వల్ల కీళ్ల నొప్పులు, ముఖ ముడతలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.ప్రకృతిలో లభించే చాలా మొక్కల్లో బోలెడు ఔషద గుణాలున్నాయి. వీటిని గురించి తెలిసేది చాలా తక్కువమందికే. సరిగ్గా ఉపయోగించుకుంటే ప్రకృతి కన్నా మంచి వైద్యుడు మరొకరు లేరు. పాతకాలంలో ప్రతి ఇంటి గుమ్మం, వాకిలి ముందు పెద్దగా నిటారుగా పెరిగి గాలికి వచ్చినపుడు తలలూపే చెట్లను మనలో చాలా మంది చూసే ఉంటారు. వాటిని సరిగ్గా గమనించి ఇంట్లో పెద్దవాళ్లని అడిగితే అశోక చెట్లని చెప్పే ఉంటారు. వీటిని గురించి ఇంతకు మించి మనకు తెలిసింది చాలా తక్కువే.
హిందూ గ్రంథాలలో అశోక చెట్టుకు చాలా ప్రాధాన్యత
మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ప్రజలు ఇప్పటికీ పాత సంప్రదాయాలు, ఆచారాలకు కట్టుబడి ఉన్నారు. దామోహ్ జిల్లాలోని చాలా ఇళ్ల వెలుపల అశోక చెట్టు కనిపించడానికి కారణం ఇదే. హిందూ గ్రంథాలలో అశోక వృక్షానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. అశోక వృక్షాన్ని నాటడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అశోక వృక్షం ఉన్న ఇంట్లో శాంతి, సంతోషం, ఐశ్వర్యం ఉంటాయి. ఈ చెట్టు ఆకుల నివారణ భార్యాభర్తల మధ్య ప్రేమను కూడా పెంచుతుందని ఇక్కడి వారు చాలా ఎక్కువుగా విశ్వశిస్తారు.
మధుమేహానికి మంచి ఔషధం
అశోక చెట్టు ఆయుర్వేద దృక్కోణంలో ఒక ఔషధ మొక్క, దాని ఆకులను పేస్ట్ చేసి రాయడం వల్ల కీళ్ల నొప్పులు, ముఖ ముడతలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఔషధ మొక్క మొటిమలను నయం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాదు మధుమేహ వ్యాధిగ్రస్తులు దీని ఆకులను తీసుకుంటే ప్రయోజనం కూడా లభిస్తుంది.ఆయుర్వేద నిపుణుల వివరాల ప్రకారం.. అశోక మొక్క ఆకులను తీసుకోవడం వల్ల మధుమేహం నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా స్త్రీలకు ముఖ సౌందర్యం, మోకాలి కీళ్ల నొప్పులు మొదలైన చర్మ సంబంధిత చికిత్సకు అశోక వృక్షం బాగా పనిచేస్తుంది.
అశోక బెరడు కషాయంతో...
రక్తస్రావాన్ని ఆపటం, రక్తహీనతను తగ్గించడం, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను తగ్గించడం ఇలా అనేక రకాల సమస్యలను తగ్గించడంలో అశోక చెట్టు మనకు దోహదపడుతుంది. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం సమస్యతో చాలా మంది స్త్రీలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్యను తగ్గించండంలో అశోక చెట్టు బెరడు మనకు సహాయపడుతుంది. 10 గ్రాముల అశోక చెట్టు బెరడును కచ్చా పచ్చాగా దంచి 4 గ్లాసుల నీటిలో వేసి మరిగించాలి. దీనిని ఒక గ్లాస్ కషాయం అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజుకు రెండు పూటలా అర గ్లాస్ మోతాదులో గోరు వెచ్చగా తీసుకోవాలి. గర్భాశయాన్ని శాంత పరిచే గుణం అశోక చెట్టుకు ఉంది.
అశోక చెట్టు బెరడు 90 గ్రాములు, 30 మిల్లీ లీటర్ల పాలు, 360 మిల్లీ లీటర్ల నీటిని ఒక గిన్నెలో తీసుకుని 90 మిల్లీ లీటర్లు అయ్యే వరకు మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని పూటకు 45 మిల్లీ లీటర్ల మోతాదులో రెండు పూటలా రోజూ తీసుకోవడం వల్ల నెలసరి సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయి. ఈ కషాయాన్ని ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకుని తాగడం మంచిది. ఈ కషాయాన్ని రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల మొలల సమస్య కూడా తగ్గుతుంది.
రక్తవిరోచనాలను తగ్గించడంలో అశోక చెట్టు పూలు మనకు సహాయపడతాయి. అశోక చెట్టు పూలను నీటిలో వేసి కషాయంలా చేసుకోవాలి. తరువాత ఈ కషాయాన్ని వడకట్టి గోరు వెచ్చగా తీసుకోవడం వల్ల రక్తవిరోచనాలు తగ్గుతాయి. అశోక చెట్టు బెరడును నీటితో అరగదీసి తేలు కుట్టిన చోట లేపనంగా రాయాలి. ఇలా చేయడం వల్ల తేలు కాటు ప్రభావం తగ్గుతుంది. ఇలా చేసిన తరువాత వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఈ విధంగా అనేక రకాలుగా అశోక చెట్టు మనకు ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.