ఎంబీబీఎస్ కౌన్సెలింగ్​కు లైన్ క్లియర్

  •     ఒకట్రెండు రోజుల్లో ప్రారంభించేందుకు కాళోజీ వర్సిటీ ఏర్పాట్లు 
  •     నేడు లేదా రేపు వెబ్‌‌ ఆప్షన్లకు నోటిఫికేషన్ 
  •     ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తి..17 వేల మంది దరఖాస్తు 

హైదరాబాద్, వెలుగు :  ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌‌కు లైన్‌‌ క్లియర్ అయింది. జీవో 33 ప్రకారమే నిర్వహించుకోవచ్చునని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో  కౌన్సెలింగ్‌‌ను ప్రారంభించేందుకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే కన్వీనర్ కోటా కౌన్సెలింగ్‌‌కు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసింది. సుమారు 17 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తయిందని, శనివారం లేదా ఆదివారం మెరిట్ లిస్ట్‌‌ విడుదల చేసి, వెబ్‌‌ ఆప్షన్ల ప్రక్రియకు నోటిఫికేషన్ ఇస్తామని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. 

వారం రోజుల్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ చివరి వరకు కౌన్సెలింగ్ చేసుకోవచ్చునని నెల కిందనే మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఎంసీసీ ఇచ్చిన గడువులోగా కౌన్సెలింగ్ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. 

వచ్చే నెల 15 నాటికి రెండో రౌండ్ పూర్తి.. 

నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్‌‌తో ఈసారి ఎంబీబీఎస్ ఆలిండియా కోటా కౌన్సెలింగ్ కూడా ఆలస్యంగానే ప్రారంభమైంది. ఎయిమ్స్, ఈఎస్‌‌ఐ వంటి సెంట్రల్ ఇనిస్టిట్యూట్స్​, రాష్ట్రాల్లోని ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న 15% సీట్లు, డీమ్డ్‌‌ వర్సిటీల్లోని సీట్లను ఆలిండియా కోటా కౌన్సెలింగ్‌‌లో భర్తీ చేస్తారు. ఏటా ఆలిండియా కోటా, స్టేట్ కోటా కౌన్సెలింగ్ దాదాపు ఒకేసారి జరుగుతాయి. ఈసారి స్థానిక కోటా సమస్య వల్ల మన స్టేట్‌‌లో కౌన్సెలింగ్‌‌ ఆలస్యమైంది. 

ఆలిండియా కోటా కౌన్సెలింగ్ రెండో రౌండ్ శుక్రవారమే పూర్తయింది. అక్టోబర్ 15 నాటికి చివరి రౌండ్ పూర్తయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు మన స్టేట్‌‌లో రెండో రౌండ్ కౌన్సెలింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆలిండియా కోటాలో సీటు రాని విద్యార్థులు, స్టేట్ కోటా మూడో రౌండ్ కౌన్సెలింగ్‌‌లో పాల్గొని సీటు పొందేందుకు అవకాశం ఉంటుందని, కౌన్సెలింగ్ ఆలస్యం కావడం వల్ల విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగలేదని కాళోజీ వర్సిటీ అధికారులు చెబుతున్నారు.