సెక్షన్ 77 ప్రకారం ప్రతి అభ్యర్థి వివరాలు ఇవ్వాలి

ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 77 ప్రకారం ప్రతి అభ్యర్థి ఎన్నికల్లో జరిపిన ఖర్చు వివరాలు, ఫలితాలు వెలువడిన 30 రోజుల్లో జిల్లా ఎన్నికల అధికారికి అందజేయాలి. లేదంటే వాళ్లపై చర్యలు తీసుకుంటారు. అలాగే ఎన్నికలప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు, ఎన్నికల ఎక్స్పెండిచర్​ అబ్జర్వర్ వచ్చి అభ్యర్థుల ఖర్చులపై గట్టి నిఘా పెడుతున్నారు. రాజకీయ పార్టీలు తెలంగాణలో ఎన్నికల చట్టాలను ఉల్లంఘించి ఓటర్లను ప్రలోభపెట్టడానికి రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా ఓటర్లకు డబ్బు, మద్యం పంచడం, కులం, మతం పేరుతో ఓట్లు అడగడం వంటివి ఉంటున్నాయి. దీనికి తోడు అధికారంలో ఉన్న పార్టీ ప్రజల డబ్బును ఉచితాల రూపంలో పంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోంది.

ఎన్నో కేసులు 

2018లో జరిగిన ఎన్నికలలో అధికార యంత్రాంగం డబ్బు, మద్యం పంచుతున్నప్పుడు ఎన్నో కేసులు వేసినా ఎన్నికల తరువాత వాటిపై సరైన విచారణ జరపకపోవడంతో ఏ కేసులోను దోషులకు శిక్ష పడలేదు. అదీకాక గెలుపు గుర్రాల వేటలో రాజకీయ పార్టీలు నేరచరిత్రులకు టికెట్లు ఇవ్వడంతో పరిస్థితి తీవ్రత ఇంకా పెరిగింది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ 56 మంది నేర చరిత్రులకు టికెట్లు ఇవ్వడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇతర పార్టీలు కూడా నేర చరిత్రులకు టికెట్లు ఇస్తున్నాయి.

వారసుల కోసం...

మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే విధమైన పద్ధతిలో నడుచుకుంటాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు ఒక గట్టి నాయకుడు ఉంటాడు. ఆయన తన సంతానాన్ని రాజకీయాల్లోకి దింపి వారసుడ్ని తయారుచేసుకుంటాడు. అలాగే దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక లేక కేవలం ప్రజలకు డబ్బు పంచి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తారు. అయితే బెంగాల్‌‌‌‌లో మమతాబెనర్జీ, యు.పి.లో మాయావతి, తమిళనాడులో జయలలితకు వారసులు లేనందున పరిస్థితి వేరుగా ఉంది.