రెండో విడతలో  రూ.580 కోట్లు మాఫీ

  • ఉమ్మడి జిల్లాలో రూ.లక్షన్నర వరకు పూర్తైన రుణమాఫీ
  • రెండో విడతలో  63,286మంది రైతులకు లబ్ధి
  • ఇప్పటికే మొదటి విడతలో 1,24,167  రైతు కుటుంబాలకు మాఫీ

జగిత్యాల, వెలుగు: కాంగ్రెస్‌ సర్కార్‌‌ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండో విడత రుణమాఫీ పూర్తిచేసింది. రెండో విడతలో భాగంగా రూ.లక్షన్నర వరకు వివిధ బ్యాంకు అకౌంట్లలో మంగళవారం రుణమాఫీ నిధులు జమ చేసింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే రూ.లక్ష వరకు లోన్లు ఉన్న మరో 1,24,167 కుటుంబాలకు చెందిన లోన్లను మాఫీ చేయగా మంగళవారం మరో 63,286 మంది రైతులకు అమలు 
చేసింది. 

ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్న సర్కార్‌‌ 


ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర సర్కార్ మూడు విడతలుగా నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జులై 18న రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేయగా.. మంగళవారం రూ.లక్షన్నర వరకు లోన్ తీసుకున్న రైతులకు మాఫీ అమలుచేసింది. రుణమాఫీపై ఉమ్మడి జిల్లా రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు లబ్ధిదారుల జాబితాలను ఆయా జిల్లాల కలెక్టర్లు విడుదల 
చేశారు. 

 

63,286 మంది రైతుల లోన్లు మాఫీ 


ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లాలో లక్షన్నర లోపు రుణాలున్న 63,286 మంది రైతుల అకౌంట్లలో 580.44 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి.  రాజన్న సిరిసిల్ల జిల్లాలో 11,915 రైతులకు చెందిన రూ.116 కోట్ల మాఫీ కాగా, పెద్దపల్లి జిల్లాలో 13,238 మంది రైతులకు రూ.122.44 కోట్లు, కరీంనగర్ జిల్లాలో 18,510 మందికి రూ.173.28 కోట్లు, జగిత్యాల జిల్లాలో 19,623 అకౌంట్లలో రూ.169 కోట్ల లోన్లు మాఫీ అయ్యాయి. మొదటి విడతలో ఇప్పటికే ఉమ్మడి జిల్లా లో 1,24,167 కుటుంబాలకు చెందిన 1,30,725 క్రాప్ లోన్ అకౌంట్ల లో రూ. 688.42 కోట్లు జమ అయ్యాయి. మొత్తంగా రెండు విడుతల్లో రూ.లక్షన్నర లోపు ఉమ్మడి జిల్లాలో 1,94,011 రైతుల అకౌంట్లలో రూ.1,268.86 కోట్ల లోన్లను సర్కార్ మాఫీ చేసింది.