ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్

రోమ్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై గురువారం(నవంబర్ 21, 2024) అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆయనతో పాటు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవో గల్లాంట్, హమాస్ మిలిటరీ కమాండర్ మహ్మద్ డీఫ్పై ఇంటర్నేషల్ క్రిమినల్ కోర్ట్(ICC) అరెస్ట్ వారెంట్స్ జారీ చేసింది.

యుద్ధ నేరాలు, గాజాలో యుద్ధం పేరుతో అమానవీయంగా నేరాలకు పాల్పడినందుకు, అక్టోబర్ 2023లో పాలస్తీనా ప్రాంతంలో ఇజ్రాయెల్ తీవ్ర నేరాలకు పాల్పడినందుకు సదరు వ్యక్తులకు అరెస్ట్ వారెంట్లు జారీ చేసినట్లు అంతర్జాతీయ న్యాయస్థానం వెల్లడించింది. అంతర్జాతీయ న్యాయ స్థానం అధికార పరిధిని ఇజ్రాయెల్ ఛాలెంజ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ప్రీ-ట్రయల్ ఛాంబర్ రిజెక్ట్ చేసింది. ఈ సందర్భంలోనే నెతన్యాహుపై, యోవో గల్లాంట్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

ఈ సందర్భంగా ఇంటర్నేషల్ క్రిమినల్ కోర్ట్ న్యాయమూర్తులు మాట్లాడుతూ.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరిగిన సమయంలో వెలుగుచూసిన యుద్ధ నేరాలకు, మానవత్వం మంటగలిసేలా జరిగిన అమానవీయ నేరాలకు నెతన్యాహు, యోవో గల్లాంట్, హమాస్ మిలిటరీ కమాండర్ మహ్మద్ డీఫ్ కారణమని వెల్లడించింది. ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ వ్యాఖ్యలను ఇజ్రాయెల్, హమాస్ ఖండించాయి. 2023 అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంపై హమాస్ మెరుపు దాడి చేసింది. ఈ ఘటనలో 1,200 మంది చనిపోయారు. ఇందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా గాజాపై దాడులు చేసింది.

గాజాపై ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడుల్లో భారీ జననష్టం జరిగింది. సుమారు 44 వేల మందికి పైగా గాజాలో ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం పేరుతో హమాస్, ఇజ్రాయెల్ చేసిన ఈ మారణహోమంపై ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హమాస్ లీడర్లు మానవత్వానికి పాతరేసి యుద్ధ నేరాలకు పాల్పడ్డారని, హత్యలు, కొందరిని బందీలుగా చేసుకుని అత్యాచారాలు, చిత్రహింసలకు పాల్పడ్డారని ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ మండిపడ్డారు. ఇజ్రాయెల్ కూడా ప్రతీకార చర్యల పేరుతో అమాయకులైన పౌరులను పొట్టనపెట్టుకుందని ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ కేసులోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవో గల్లాంట్, హమాస్ మిలిటరీ కమాండర్ మహ్మద్ డీఫ్పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.