జూన్ 4న కౌంటింగ్ .. ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం

  • గంటకు తొలి రౌండ్​
  • 9 గంటల్లో పూర్తి రిజల్ట్​
  • కౌంటింగ్​కు 112 టేబుళ్లు

యాదాద్రి, వెలుగు : భువనగిరి -లోక్​సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. 39 మంది అభ్యర్థులు పోటీ చేసిన ఈ స్థానంలో ఈనెల 13న పోలింగ్​జరిగిన సంగతి తెలిసిందే. ఆరు జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించిన భువనగిరి లోక్​సభ నియోజకవర్గంలోని 2141 పోలింగ్​స్టేషన్లు ఉన్నాయి. వీటిలోని 18,08,585 ఓట్లకు 13,88,680 ఓట్లు (76.78 శాతం ) పోలింగ్​అయ్యాయి. ఈ నియోజకవర్గానికి చెందిన కౌంటింగ్​యాదాద్రి జిల్లా భువనగిరిలో జరుగనుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆఫీసర్లు కంప్లీట్ చేస్తున్నారు.

జూన్​4న ఉదయం 5.30 గంటలకు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్​ రూం తెరుస్తారు. ఎన్నికల కమిషన్​ఆదేశాల మేరకు ఉదయం 8 గంటలకు పోస్టల్​బ్యాలెట్​తోపాటు ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. కౌంటింగ్​మొదలైన గంటకు తొలి రౌండ్​ ఫలితం​వెలువడనుంది. ఆ తర్వాత అరగంటకు రౌండ్​చొప్పున మొత్తంగా 9 గంటల్లో రిజల్ట్​వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

కౌంటింగ్​కు 112 టేబుల్స్.. 

ఏడు అసెంబ్లీల్లో పోలైన ఓట్లను కౌంటింగ్​చేయడానికి మొత్తం 112  టేబుల్స్​ఏర్పాటు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 20 టేబుల్స్​ఏర్పాటు చేస్తుండగా మునుగోడు, తుంగతుర్తిలో 18 టేబుల్స్​చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. నకిరేకల్, ఆలేరు, భువనగిరి, జనగామ నియోజకవర్గాలకు సంబంధించి 14 టేబుల్స్​చొప్పున ఏర్పాటు చేస్తున్నారు.

ఓట్ల లెక్కింపు కోసం టేబుల్​కు ముగ్గురు చొప్పున 336 మంది స్టాఫ్​తోపాటు అదనంగా మరో 72 మందిని ఎంపిక చేశారు. నియోజకవర్గంలో పోస్టల్​బ్యాలెట్​లో 13,792 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుల్స్, సర్వీస్​ ఓట్ల కోసం 7 టేబుల్స్​ సిద్ధం చేస్తున్నారు. 21 టేబుల్స్​ కోసం ఒక్కోదానికి నలుగురు స్టాఫ్​ చొప్పున 84 మంది స్టాఫ్​ను ఎంపిక చేశారు. 

అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం

కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పోలింగ్​స్టాఫ్​కు రెండుమార్లు ట్రైనింగ్ ఇచ్చాం. పోస్టల్​బ్యాలెట్ కోసం ఈసారి ప్రత్యేక హాల్ ఏర్పాటు చేశాం. సమయం వృథా కాకుండా ఈవీఎంలతోపాటు పోస్టల్​బ్యాలెట్ కౌంటింగ్​కొనసాగుతుంది. 

-హనుమంతు జెండగే, ఎన్నికల అధికారి