నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో .. 2507 సీసీ కెమెరాలతో నిఘా

  • ఏడు నియోజకవర్గాల్లో పకడ్బందీ ఏర్పాట్లు  
  • సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
  • పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు కంట్రోల్ రూంల ఏర్పాటు 

నిజామాబాద్‌, వెలుగు: నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో దాదాపు 2507 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1808 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనుండగా.. సీసీ కెమెరాల నిఘా నీడలో భద్రత కల్పిస్తున్నారు.  నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ మొత్తంలో 506 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు గుర్తించారు. ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోనున్నారు. 

ఎప్పటికప్పుడు పర్యవేక్షణ 

నిజామాబాద్ జిల్లాలో సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ తీరును గమనించేందుకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేలా ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. ఈ ఓటింగ్ విధానం జరుగుతున్న తీరును పరిశీలిస్తూ ఏమైనా ఘర్షణలు జరిగితే వెంటనే పోలీసు సిబ్బందిని పోలింగ్ స్టేషన్ కు పంపిస్తారు.  ఎన్నికల రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో ప్రతి సీసీ కెమెరాను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. పార్లమెంటు పరిధిలో మొత్తం 17,04, 867 మంది ఓటర్లు ఉన్నారు.

 వీరందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని రకాల చర్యలు ఎన్నికల అధికారులు చేపట్టారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల్లో  సీసీ కెమెరాల నిఘాతో ఎన్నికలను సజావుగా నిర్వహించొచ్చనే ఆలోచనతో అధికారులు ఉన్నారు. ఇందుకోసం ఆర్మూర్ సెగ్మెంట్ లో 217 పోలింగ్ కేంద్రాలు ఉంటే 309 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బోధన్ లో 246 పోలింగ్ కేంద్రాలకు 345, నిజామాబాద్ గ్రామీణం 293 పోలింగ్ కేంద్రాలకు 395 సీసీ కెమెరాలను బిగించారు. 

బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, కోరుట్ల, జగిత్యాలలో కూడా పోలింగ్ కేంద్రాల కంటే సీసీ కెమెరాలే ఎక్కువగా ఉండేలా బిగించారు.  దీంతో ఎలాంటి సంఘటన జరిగినా నిమిషాల్లో  కంట్రోల్ రూం నుంచి వెంటనే ఆదేశాలు వచ్చేలా పకడ్బందీ గా ప్లాన్ చేసుకున్నారు.  దీంతో పోలింగ్ ను విజయవంతంగా కంప్లీట్ చేయాలని ప్లాన్ 
వేసుకున్నారు.