చోరీ చేసిన టూ వీలర్లు కొన్న .. ఆర్మూర్​ మున్సిపల్​ వైస్​ చైర్మన్​ అరెస్ట్​

  • మెట్​పల్లి సబ్​ డివిజన్​ పరిధిలో 21 బైకులు చోరీ చేసిన దొంగ
  • రూ.5 వేలకో టూ వీలర్​ను కొనుగోలు చేసిన షేక్​ మున్నా
  • మరో 14 మంది స్క్రాప్​వ్యాపారులపైనా కేసు నమోదు  

మెట్ పల్లి, వెలుగు: దొంగ బండ్లు కొన్న కేసులో ఆర్మూర్​ మున్సిపల్​ వైస్​ చైర్మన్​, బీఆర్​ఎస్​ లీడర్​ షేక్​ మున్నాను పోలీసులు అరెస్ట్​ చేశారు. తర్వాత స్టేషన్​ బెయిల్​పై విడుదల చేశారు. అలాగే ఈ కేసులో బైక్​లు చోరీ చేస్తున్న ప్రధాన నిందితుడితో పాటు మరో 14 మంది స్క్రాప్​ వ్యాపారులను కూ ఆ పోలీసులు పట్టుకున్నారు. మెట్ పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర రావు కథనం ప్రకారం..జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం సత్తెక్కపల్లికి చెందిన షేక్ ఇస్మాయిల్ (32) ఆటో డ్రైవర్. ఆటో నడపడంతో వచ్చే డబ్బు కుటుంబపోషణ, మద్యం, జల్సాలకు సరిపోకపోవడంతో బైక్​చోరీలు చేయడం మొదలుపెట్టాడు.

మెట్ పల్లి, మల్లాపూర్,  ఇబ్రహీంపట్నం, కోరుట్లలో ఇండ్లు, హాస్పిటల్స్, బస్టాండ్, బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్, బార్ల వద్ద పార్క్ చేసిన బైకులను దొంగతనం చేసేవాడు. ఇలా కొన్ని నెలల్లో 21 బైకులను ఎత్తుకెళ్లాడు.   వీటిని కోరుట్ల, నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి, ఆర్మూర్, మోర్తాడ్, పెర్కిట్, కరీంనగర్ జిల్లా గంగాధరల్లో స్క్రాప్ బిజినెస్ చేసే వారికి అమ్మేవాడు. ఒక్కో వాహనాన్ని రూ.ఐదు వేలకకే ఇచ్చేవాడు. బైక్​ చోరీలు పెరగడంతో మెట్ పల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలో ఎనిమిది, కోరుట్ల పీఎస్​ పరిధిలో 9, మల్లాపూర్​లో 2 , ఇబ్రహీంపట్నంలో 2 కేసులు నమోదయ్యాయి.

దీంతో సీఐ నవీన్, ఎస్సై చిరంజీవి  బండ్ల దొంగపై ప్రత్యేక నిఘా పెట్టారు. గురువారం పాత బస్టాండ్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా  అనుమానాస్పదంగా బైక్​పై వెళ్తున్న ఇస్మాయిల్ కనిపించాడు. పట్టుకుని విచారించగా 21 బైకులు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. వాటిని పలువురు స్క్రాప్​ వ్యాపారులకు రూ.5 వేల చొప్పున అమ్మినట్టు చెప్పాడు.

పోలీసుల విచారణలో దొంగ బైకులు కొన్న వ్యక్తుల్లో ఆర్మూర్​ మున్సిపల్​ వైస్​ చైర్మన్​ షేక్​ మున్నా కూడా ఉన్నాడని తెలుసుకున్నారు. అతడిని అరెస్ట్​ చేసి స్టేషన్​ బెయిల్​పై వదిలిపెట్టారు. ప్రధాన నిందితుడి నుంచి రూ.ఆరు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దొంగ బండ్లు కొన్న మరో 14 మంది స్క్రాప్​ వ్యాపారులను కూడా అరెస్ట్​ చేశారు. నిందితుడిని పట్టుకున్న సీఐ నవీన్, ఎస్సై చిరంజీవి, ఏఎస్సై అన్వర్ బేగ్, హెడ్ కానిస్టేబుల్ అశోక్, సిబ్బంది కిరణ్, సంతోష్ లను డీఎస్పీ అభినందించారు.

పెర్కిట్​లో స్క్రాప్​ దుకాణం నిర్వహిస్తున్న మున్సిపల్ వైస్ చైర్మన్​మెట్ పల్లి సబ్ డివిజన్ పరిధిలో ఇస్మాయిల్ ​చోరీ చేస్తున్న బైకులను స్వయానా బీఆర్ఎస్​కు చెందిన ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా కొనుగోలు చేశారు.  ఆయనకు నిజామాబాద్​ జిల్లా పెర్కిట్​లో స్క్రాప్ దుకాణం నిర్వహిస్తున్నారు. కాగా, ఇస్మాయిల్ ​అమ్మిన ఒక్కో బైక్​ను ఆయన రూ.5 వేలకు కొన్నారు.