తెలంగాణకు రక్షణ కవచంగా మారిన సాయుధ పోరాటం

నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ఫ్యూడల్‌ ప్రభువుల అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా.. తెలంగాణ మాతృభాష కోసం, భూమికోసం, భుక్తి కోసం మట్టి మనుషులు చేసిన తిరుగుబాటు ధిక్కార స్వరమే  రైతాంగ సాయుధ పోరాటం.  ఏఐటీయూసీ తరఫున మగ్ధూం మొహియుద్దీన్‌,  ఆంధ్ర మహాసభ తరఫున రావి నారాయణరెడ్డి, తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ తరఫున బద్దం ఎల్లారెడ్డి త్రయం మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి 1947 సెప్టెంబర్‌ 11న పిలుపునివ్వడం జరిగింది. 

నిజాం ప్రభుత్వం పూర్తిగా బలహీనపడిపోయి పటేల్‌ సైన్యం ముందు లొంగిపోయి 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్​ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. సాయుధ పోరాటంలో  పాల్గొనకపోయినప్పటికీ  రామానంద స్వామి, జమలాపురం కేశవరావు,  బూర్గుల రామకృష్ణారావు లాంటి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు శాంతియుత మార్గంలో  తెలంగాణ విముక్తిని తద్వారా విలీనాన్ని కోరుకోవడం జరిగింది. ఆ విధంగా వేలాది మంది కమ్యూనిస్టుల  బలిదానాలతో అభ్యుదయ శక్తుల సహకారంతో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడం జరిగింది. ఇపుడు కమ్యూనిస్టుల త్యాగాలను గుర్తించి సెప్టెంబర్‌ 17న విలీన దినోత్సవాన్ని జరపడానికి పాలకులు ఎందుకు భయపడుతున్నారు? 

 
త్యాగాలతో కూడిన పోరాటానికి మతం రంగు పులిమి చరిత్రను వక్రీకరించడమంటే తెలంగాణ జాతి త్యాగాలను, పోరాటగాథలను చీకటిపొరల్లోకి నెట్టివేసి విషపూరిత మత విద్వేషాలను ఈ నాటి తరం మెదడులోకి ఎక్కించడమే. దీనిద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు జాతికి తీరని అపకారం చేస్తున్నారు.  హైదరాబాద్‌ సంస్థాన రాజు ముస్లిం అయినప్పటికీ జమీందార్లు, జాగిర్దార్లు, భూస్వాములు ఎక్కువ శాతం హిందువులే.  

ప్రజలపై, పేదవర్గాలపై విరుచుకుపడి డొడ్డి కొమరయ్యను బలితీసుకున్న 40వేల ఎకరాల భూస్వామి విసునూరి రాంచంద్రారెడ్డి హిందువే కదా.  ఆ దాడిలో మరణించిన దొడ్డి కొమరయ్య కూడా హిందువే కదా.. వేల ఎకరాలు కలిగిన హిందూ భూస్వాములు వందలాదిమంది ఉండేవారు. వీరు నిజాం నవాబుకు గులాంలుగా వ్యవహరించడమే గాక నిజాంను మించిన దౌర్జన్యాలతో అనేక మందిని ఊచకోత కోశారు. 

 ఖాసీం రజ్వీ నేతృత్వంలో రజాకార్ల అరాచకం

 ఖాసీంరజ్వీ అనే వ్యక్తి మజ్లీస్‌ పార్టీని స్థాపించి హైదరాబాద్​ను స్వతంత్ర ముస్లిం రాజ్యంగా ప్రకటన చేసి రజాకారుల సైన్యాన్ని ఏర్పాటు చేసి మానవ రాక్షసుడిలాగ హిందువులపైన దాడులకు పూనుకోవడం జరిగింది. వ్యతిరేకించిన ముస్లింలను కూడా నిర్దాక్షిణ్యంగా చంపించాడు.  ప్రఖ్యాత జర్నలిస్టు షోయబ్‌ఉల్లాఖాన్‌ను హైదరాబాద్ నడిబజార్‌లో రజాకార్లు క్రూరంగా చంపారు. ఈనాటి ఖమ్మం జిల్లా ఆనాటి వరంగల్‌ జిల్లాలో రజబ్‌ ఆలి లాంటి యోధులు నిజాం  రాచరికానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. 

 ముస్లిం విద్యావేత్తలు అనేకులు పోరాడారు

డాక్టర్‌ రాజ్‌బహుదూర్‌ గౌర్‌తో కలిసి మఖ్టూం మహీనుద్దీన్‌,  ప్రొ. అల్లంకుంద్‌ మీరీ,  జవ్వాది రజ్వీ,(సాలార్​జంగ్​ మ్యూజియం ఆనాటి లైబ్రేరియన్‌) ప్రొ. ఖయ్యూంఖాన్‌ లాంటి అనేకమంది ముస్లిం విద్యావేత్తలు నిజాం రాచరికపాలనకు వ్యతిరేకంగా కామ్రేడ్స్​ అసోసియేషన్​ను ఏర్పాటు చేశారు.  మహ్మద్‌ రఫీ ఉస్మానియా యూనివర్శిటీలో నిజాంకు వ్యతిరేకంగా జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. నిజాం వ్యతిరేకపోరాటంలో అగ్రగామిగానున్న అల్లా ఉద్దీన్‌ని నిజాం మూకలు చంపివేయడం జరిగింది. ఇలా ఎంతోమంది ముస్లింలు నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. చిత్రహింసలకు, హత్యలకు గురైనారు. 

తెలంగాణ సాయుధ పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర ఏమిటి?

అణచివేసే ఫ్యూడల్‌ ప్రభువులు హిందూవైనా, ముస్లిమైనా వారి వర్గస్వభావమొక్కటే. ఇటువంటి మహోజ్వల పోరాట చరిత్రకు మతం రంగు పులమడానికి ఆనాటి పోరాటంలో ఇసుమంత పాత్ర లేని ఆర్‌ఎస్‌ఎస్‌, ఈనాటి బీజేపీగానీ తమ మత ఉన్మాదంతో ఓట్ల రాజకీయాల నేపథ్యంలో చరిత్రను వక్రీకరిస్తున్నారు. 

హిందువులు, ముస్లింలు కలిసి పోరాడారు

ఆర్‌ఎస్‌ఎస్‌  సంఘ్‌పరివార్‌లు1925 నుంచి 1947 వరకు ఏనాడూ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనలేదు. అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు కనీస పాత్ర కూడా లేదు. రజాకార్ల దాడుల్లో  హిందూ పురుషులను ముస్లిం మహిళలు, అలాగే ముస్లిం పురుషులను హిందూ మహిళలు తమ కొంగుచాటున దాచిపెట్టి కన్నతల్లులు బిడ్డలను కాపాడుకున్నట్లుగా కాపాడిన ఘటనలు సాయుధ పోరాటంలో ఉన్నాయి. అన్నదమ్ముల్లా  కలిసి అన్ని మతాల వారు జరిపిన వీరోచిత పోరాటానికి మతం రంగు పులిమే ఎవరైనా దేశ భక్తులు ఎలా అవుతారు? 

విప్లవ మాత  తెలంగాణ

మహత్తర తెలంగాణ సాయుధ పోరాటం హైదరాబాద్‌ సంస్థానంలో స్వాతంత్ర్యోద్యమాన్ని కీలక మలుపు తిప్పింది. ప్రాణాలు అర్పణ చేసిన 4000 మంది కమ్యూనిస్టులు తమ రక్తంతో తెలంగాణ నేలను ఎర్ర నేలగా మార్చి త్యాగాల అక్షరాలతో చరిత్రలో లిఖించబడ్డారు.  ఆ తరంలో దాశరథి, మఖ్దూం మోహినుద్దీన్‌, సుద్దాల హనుమంతు లాంటి మహాకవులకు, ఈతరంలో గద్దర్‌ లాంటి ప్రజా కళాకారులకు,  వేలాది మంది వీరులకు జన్మనిచ్చిన ఉద్యమమిది.   

కమ్యూనిస్టులపైనే ఎక్కుపెట్టిన పటేల్​ తుపాకులు

 నిజాం రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందించడానికి సాగుతున్న రైతాంగ పోరాటాన్ని నివారించడానికి భారత యూనియన్‌ సైన్యాలు1948 సెప్టెంబరు 16న హైదరాబాద్‌ చేరుకోవడం, సెప్టెంబర్‌ 17న విలీనం  చేస్తున్నట్లు నవాబు ప్రకటించడం జరిగింది. అయితే, అప్పటివరకు స్వాతంత్ర్యం కోసం ప్రజలను సమాయత్తపరిచి,  సంస్థాన విలీన ప్రక్రియను సులభతరం చేసిన కమ్యూనిస్టులపైనే నాటి కేంద్ర హోం మంత్రి సర్దార్‌  వల్లభాయ్‌ పటేల్‌ తుపాకులు ఎక్కుపెట్టించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మరణించిన 4000 మందిలో తెలంగాణ విలీనానికి ముందు అతికొద్దిమంది కమ్యూనిస్టులు చనిపోగా విలీనం తరువాత కాంగ్రెస్‌ నాయకత్వంలోని పటేల్‌ సైన్యం చేతుల్లో దాదాపు 3000 మందికి పైగా చంపబడ్డారు. కమ్యూనిస్టులు పేదలకు పంచిన 10 లక్షల ఎకరాల భూములను భూస్వాములకు తిరిగి అప్పజెప్పడానికి, కమ్యూనిస్టుల ఊచకోతకు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పూనుకున్నది. 

 విలీన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి

సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానంలో భాగంగా ఉండి, నేడు కర్నాటకలో భాగమైన కల్యాణ కర్నాటక,  మరఠ్వాడా ప్రాంతాలలో హైదరాబాద్‌ విలీన దినోత్సవాలను ప్రభుత్వాలే ఎప్పటి నుంచో  నిర్వహిస్తున్నాయి. తెలంగాణా విలీనాన్ని అధికారికంగా జరపడం లేదని సమైక్య రాష్ట్రంలోని ప్రభుత్వాలను దుమ్మెత్తిపోసిన అప్పటి  ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2021 సంవత్సరం నుంచి సమైక్యతా దినోత్సవం పేరుతో తెలంగాణ వీర చరిత్రను కనుమరుగయ్యేలా చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సెప్టెంబర్‌17ను  ‘ప్రజాపాలన దినోత్సవం’గా అన్ని నియోజకవర్గాలలో, ప్రభుత్వ కార్యాలయాల్లో జరుపుతామని ప్రకటించారు.  సాయుధ పోరాట విలీన, స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆ పేరుతో ధైర్యంగా ఎందుకు జరపలేక పోతున్నారో, అర్ధమనస్సుతో ఎందుకు జరుపుతున్నారో సమాధానం చెప్పాలి. 

సాయుధ పోరాటానికి మతం లేదు

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పేద, బడుగు, బలహీనవర్షాలు సమష్టిగా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఫ్యూడల్‌ ప్రభువుల అణచివేతలకు, దోపిడీలపై జరిపిన పోరాటం. ఈ పోరాటంలో హిందువులు, ముస్లింలు అన్నదమ్ముళ్లలా  పాల్గొన్నారు. ఈ పోరాటానికి మతం రంగు పులమడమంటే రానున్న తరాలకు తెలంగాణ వీర చరిత్రను అందకుండా చేసే కుట్ర ఇందులో దాగివున్నది. కానీ, ఈనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం బీజేపీ ఉచ్చులో పడకుండా  తెలంగాణ ప్రజల పోరాటాలకు, సాంస్కృతిక, సామాజిక ఉద్యమాలకు ప్రేరణ ఇచ్చిన ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట ఫలితమైన విలీన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి.  

- కూనంనేని సాంబశివరావు, 
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి