మనకంటూ  ఒక ఫ్రెండ్​ ఉండాలి 

నిజమైన స్నేహం అనేది ఒక మంచి గుణానికి గుర్తు. ఈ గుణం మనిషి జీవితానికి ఎంతో అవసరం. ఒక మనిషిలో ఎన్ని మంచి లక్షణాలున్నా... స్నేహితుడు లేకుండా ఆ మనిషి జీవితం పరిపూర్ణం కాదు’’ అన్నాడు గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్‌. నిజమే.. ఆస్తులు, అంతస్తులు ఎన్ని ఉన్నా, అంతెందుకు జీవితంలో కావలసిన వసతులు, సౌకర్యాలు అన్నీ ఉన్నా ఫ్రెండ్స్​ లేకుండా బతికేయాలని ఎవరూ అనుకోరు​. 

స్నేహం​ గురించి కొన్ని విషయాలను చాలా లోతుగా విశ్లేషించాడు అరిస్టాటిల్​. అలా స్నేహం గురించి అరిస్టాటిల్ చెప్పిన వాటిలో ముఖ్యంగా కొన్నింటి గురించి తెలుసుకోవాలి. వందల ఏండ్ల క్రితం ఆయన చెప్పిన విషయాలు ఇప్పటి స్పీడ్​ యుగానికి అతికినట్టు సరిపడతాయి.

అర్థం చేసుకోవాలి

ఏ రిలేషన్​లో అయినా ఒకరినొకరు అర్థం చేసుకుని మసలుకోవడం అనేది ముఖ్యం. ఫ్రెండ్​షిప్​ విషయానికి వచ్చేసరికి అది ఇంకా చాలా ముఖ్యం. మిగతా రిలేషన్స్​లో అంటే... అమ్మనాన్న, అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముల మధ్య ఉండే రిలేషన్​ వేరు. అదే స్నేహం విషయానికి వచ్చేసరికి ఇద్దరిలో ఒక్కరు ‘నాకు కావాలి’ అనుకుంటే ఏర్పడదు. ఇద్దరి మధ్య పరస్పర అంగీకారం ఉండాలి. 
స్నేహంలో ఒకరి మంచిని మరొకరు కోరుకోవాలి. మంచి ఆలోచనలతో ఉండాలి. ఈ విషయం గురించి అరిస్టాటిల్​ ఇలా చెప్పాడు– ‘‘ఇద్దరు ఫ్రెండ్స్​ కూడా ఒకరి మంచి మరొకరు కోరుకోవాలి. ఆ ఇద్దరి మధ్య ఉన్న స్నేహంలో సాధ్యాసాధ్యాల గురించి ఇద్దరికీ సరైన అవగాహన ఉండాలి.”

దీన్ని ఇప్పుడున్న పరిస్థితులతో పోల్చి చూడాలంటే పారాసోషల్ రిలేషన్​షిప్స్​​ గురించి చెప్పుకోవాలి. ఈ రిలేషన్​షిప్​లో ఒకవైపు నుంచి మాత్రమే స్నేహం ఉంటుంది. ఉదాహరణకి.. విరాట్​ కోహ్లీని తీసుకుంటే. విరాట్​ను ఇష్టపడేవాళ్లు ప్రపంచమంతా ఉంటారు. వాళ్లలో ఎక్కువమంది అతన్ని కలిసి, మాట్లాడి ఉండరు. కానీ అతడి సక్సెస్​లో అతన్ని ఇష్టపడేవాళ్లంతా ఎమోషనల్​గా భాగస్వాములు అవుతారు. విరాట్​ని అభిమానించే వాళ్లకు వార్తలు, సోషల్​ మీడియా ద్వారా అతని గురించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తుంటాయి. అలా అభిమానుల మనసుకు దగ్గరగా అనిపిస్తాడు విరాట్​. ఆ అభిమానుల్లో చాలామంది అతనికి తెలియరు.

ఇప్పుడున్న సోషల్​ మీడియా ప్రపంచంలో పారాసోషల్ రిలేషన్​షిప్స్​ను ఫ్రెండ్​షిప్స్​తో వేరు చేసి చూడలేం. ఎందుకంటే చాలామంది కంటెంట్​ క్రియేటర్స్​ వాళ్ల వ్యక్తిగత జీవితాల గురించి సోషల్​ మీడియాలో పంచుకుంటున్నారు. దాంతో వాళ్ల ఫాలోయర్స్​ ఆ సెలబ్రిటీలతో ఒకరకమైన బంధాన్ని ఏర్పరచుకుంటారు. అందుకే దీన్ని పూర్తిస్థాయి స్నేహంగా చూడలేం.

 మూడు రకాల స్నేహం

స్నేహం అనేది యుటిలిటీ​, ప్లెజర్​​, క్యారెక్టర్​ బేస్డ్​ అని మూడు రకాలుగా ఉంటుంది. అయితే ఏ స్నేహం ఏ రకానికి చెందింది అనేది ఇద్దరి మధ్య ఏర్పడిన రిలేషన్​ మీద ఆధారపడి ఉంటుంది.యుటిలిటీ రిలేషన్​షిప్​ అంటే అవసరం కోసం చేసే స్నేహం. ఇదసలు స్నేహం ఎలా అవుతుందనే సందేహం వస్తుంది. కానీ ఈ స్నేహంలో ఉన్న ఇద్దరికీ తమ అవసరాలకోసం ఒకరికొకరు ఉన్నారనే విషయం తెలిసి, ఆ రిలేషన్​ను ఎక్స్​ప్లాయిట్​ చేయకపోతే దాన్ని స్నేహంగానే చూడొచ్చు. అయితే ఈ స్నేహం చివరివరకు సాగడం అసాధ్యం. ఇందులో ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకులు వస్తాయి. పెద్దవాళ్లు, యుక్తవయస్కులు, జీవితంలో పైకి వచ్చే దశలో ఉన్న యువతలో ఈ స్నేహం పుడుతుంది.

ప్లెజర్​ బేస్డ్​ అంటే ఆనందం కోసం చేసే స్నేహం. ఈ స్నేహంలో ఉండే వ్యక్తుల నమ్మకాలు, విలువలు వేరువేరుగా ఉంటాయి. కానీ, ఒకరికొకరు సాయం చేసుకుంటారు. వ్యక్తిగత విషయాల్లో తేడా వల్ల ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది వీలుపడదు. అయితే ఇక్కడ చెప్పుకున్న ఈ రెండు రకాల స్నేహాల్లో నిస్వార్థత లేదు. అందుకే ఈ స్నేహాలు అవసరాలు తీరేవరకే ఉంటాయి. ఇలాంటి స్నేహం చిన్నవయసులో ఎక్కువగా ఏర్పడుతుంది. అభిప్రాయాలు, ఉద్దేశాలు మారుతున్న కొద్దీ ఈ స్నేహంలో మార్పు వస్తుంది. అందుకని ఇలాంటి స్నేహాలు బలపడే, బ్రేక్‌ అయ్యే అవకాశాలూ రెండూ సమంగా ఉంటాయి. ఒకరకంగా చూస్తే ఈ రెండు రకాల స్నేహాలు పేకమేడల్లాంటివి. ఎప్పుడు నిలబడతాయో, ఎప్పుడు కూలిపోతాయో  ఊహించడం కష్టం. 

మూడోది క్యారెక్టర్​ బేస్డ్​ ఫ్రెండ్​షిప్. పైన చెప్పిన రెండింటికీ ఇది చాలా భిన్నం. ఈ స్నేహానికి ముగింపు ఉండదు. ఒకరి అవసరాలను మరొకరు తనవని అనుకునే విశాల హృదయం ఉంటుంది ఇద్దరికీ. పూర్తిగా మంచితనంపై ఆధారపడి ఏర్పడుతుంది కాబట్టి మంచితనం లేని చోట ఈ స్నేహం నిలబడదు. స్వార్థానికి తావు లేని ఈ స్నేహం ఏర్పడాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఇందు​లో ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి బాగా తెలియాలి. అందుకు ఒకరితో ఒకరు చాలా టైం స్పెండ్​ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టైం అనేది లిమిటెడ్​ సోర్స్! అందుకని చాలా వరకు స్నేహాలు అవసరం లేదా ఆనందం మీదనే ఏర్పడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. 

ఫ్రెండ్​షిప్​... ఫిట్​నెస్​ లాంటిది

 ఫ్రెండ్​షిప్​ అనేది ఫిట్​నెస్ లాంటిది. ఎక్సర్​సైజ్​ అనేది యాక్టివిటీతో ఎలాగైతే ముడిపడి ఉంటుందో అలానే ఫ్రెండ్​షిప్​ కూడా. ఫిట్​నెస్​లో క్రమం తప్పకుండా చేసే వ్యాయామాలు ఉంటాయి. అలాగే స్నేహితులు కలిసి పనులు చేయడం వల్ల ఆ స్నేహం దృఢంగా ఉంటుంది. అప్పటివరకు బాగా కలిసిమెలిసి ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్​ కొన్ని కారణాల వల్ల దూరంగా వెళ్లిపోయారనుకోండి. అలా వేరుగా ఉండడం వల్ల స్నేహంలో యాక్టివ్​ ఎక్సర్​సైజ్​ అనేది ఉండదు. అంతమాత్రాన ఫ్రెండ్​షిప్​ విడిపోతుందా? అంటే విడిపోదు. కానీ ఆ దూరం అలానే ఎక్కువకాలం కొనసాగితే మాత్రం ఫ్రెండ్లీ ఫీలింగ్​ అనేది మర్చిపోతారు” అన్నాడు అరిస్టాటిల్​. 

అయితే సోషల్​ మీడియా పోస్ట్​ నుంచి ఫేస్​టైం వరకు కమ్యూనికేషన్​ టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో మనుషులు ఎంతదూరంలో ఉన్నా ఫ్రెండ్​షిప్​ను మెయింటెయిన్​ చేయొచ్చు కదా! మరి అలాంటప్పుడు భౌతికంగా దూరంగా ఉన్నంత మాత్రాన ఫ్రెండ్​షిప్​కి ఎండ్​ కార్డ్​ పడదు అనిపిస్తుంది. ఒకరకంగా చూస్తే నిజమే. కానీ ఇదే విషయాన్ని ప్రాక్టికల్​గా చూద్దాం...  కొవిడ్​–19 ప్యాండెమిక్​ టైంలో మొదటి ఏడాది అంతా లాక్​డౌన్​లు ఉన్నాయి. అప్పుడు ఎవరి ఇండ్లల్లో వాళ్లు ఉండి బయటకు కదిలేందుకు వీల్లేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఫ్రెండ్​షిప్​ యాక్టివిటీలు జరగలేదు. హలో, హాయ్​ అంటూ సోషల్ మీడియా, ఫోన్ల ద్వారా టచ్​లో ఉన్నప్పటికీ స్నేహంలో క్వాలిటీ తగ్గిపోయిందనేది పరిశోధనల్లో రుజువైంది. అందుకే స్నేహం అనేది ఫ్రెండ్స్​ మధ్య జరిగే​ యాక్టివిటీల వల్లనే మెయింటెయిన్​ అవుతుందనే విషయాన్ని గట్టిగా నమ్మాలి. 

అరిస్టాటిల్​ స్నేహం​ గురించి చెప్పినప్పుడు ఇప్పుడున్నంతగా కమ్యూనికేషన్​ టెక్నాలజీ డెవలప్​ అవుతుందనే విషయం ఆయన ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఆయన చెప్పిందే నిజం అనేది కళ్లముందు కనిపిస్తోంది. మనసుకు దగ్గరైన స్నేహాలు లేకపోవడం వల్ల ఒంటరితనం అనుభవిస్తున్న వాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అలాంటి వాళ్లకోసం ఆన్​లైన్​ సపోర్ట్ గ్రూప్స్, పారాసోషల్​ రిలేషన్​షిప్స్​ అంటూ ఎన్నో వచ్చాయి. ఇలాంటివి ఎన్ని వచ్చినా ‘మనసారా దగ్గరకు తీసుకునే స్నేహం లేకపోతే మానసిక 
ఒంటరితనం తప్పదు’ అని చెప్పిన అరిస్టాటిల్​ మాటలు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ వాస్తవమే. అందుకే అవసరం, ఆనందం కోసం ఎన్ని స్నేహాలు ఉన్నా మనకోసం అంటూ ఒక ఫ్రెండ్ ఉండాలి.

కంటెంట్​ క్రియేటర్స్​ వాళ్ల వ్యక్తిగత జీవితాల గురించి సమాచారాన్ని లైవ్​లో పంచుకుంటుంటారు. దాంతో వాళ్లను ఫాలో అవుతున్న వాళ్లు ఆ వ్యక్తులతో అనుబంధాన్ని పెంచుకుంటారు. అలాగే తనని ఫాలో అవుతున్న ఫాలోయర్స్​కు మంచి జరగాలని సదరు సోషల్​ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్​ అనుకోవచ్చు. అలాగని ఇది స్నేహం కాదు.