వర్షాకాలంలో చీటికిమాటికి ఆనారోగ్యానికి గురవుతున్నారా.. ఐతే ఇది మీకోసమే..!

వర్షాకాలంలో జలుబు, జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయి. కొందరికైతే చినుకు పడితే చాలు తుమ్ములు మొదలవుతాయి. ఈ సమస్యలకు ప్రధాన కారణం శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడమే. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండాఉండాలంటే.. విటమిన్ సి ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటూ వారానికి ఐదు రోజులు వ్యాయామం చేయాలి. రోగనిరోధక శక్తిని పెంచి ఈ సీజన్ లో వచ్చే జలుబు, దగ్గు, జ్వరాలను అదుపులో ఉంచే యోగాసనాలివే..

సేతు బంధాసన:

 యోగా మ్యాట్ పై వెల్లికిలా పడుకోవాలి. తరువాత రెండు కాళ్లు మడిచి.. చేతులతో కాళ్లు పట్టుకోవాలి. అలాగే గడ్డాన్ని ఛాతి భాగానికి ఆనించాలి. రెండు కాళ్ల మధ్య కాస్త దూరం ఉంచి, శ్వాస తీసుకుంటూ.. నడుముని వీలైనంత పైకి లేపాలి. ఈ స్థితిలో ఐదు నుంచి పదిసార్లు. శ్వాస తీసుకుని నడుముని నెమ్మదిగా కిందకు దించాలి. ఇలా మూడు సార్లు చేయాలి. ఈ ఆసనం వేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు లాంటివి దరిచేరవు. అలాగే ఈ ఆసనం వల్ల ఒత్తిడి. నిద్రలేమి సమస్యలు కూడా దూరమవుతాయి. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

వీర భద్రాసనం:
ఈ ఆసనం చేయడానికి రెండు కాళ్ళ మధ్య మీటరు దూరం ఉంచి స్థిరంగా నిలబడాలి. రెండు చేతులను పక్కగా, భుజాలకు సమానంగా పైకి లేపాలి. ఇప్పుడు కుడి వైపుకుకుడి పాదాన్ని తొంభై డిగ్రీలు తిప్పి, శ్వాస వదులుతూ కుడి కాలును మోకాలి వరకు వంచాలి. తర్వాత తలను కుడి వైపు తిప్పి సూటిగా చూడాలి. ఇలా అర నిమిషం నుండి నిమిషం వరకు చేసి మునుపటి పొజిషన్ కి రావాలి. మరోవైపు ఇలానే చేయాలి. ఇలాచేయడం వల్ల కాళ్ళు, మోకాళ్ళు, భుజం కండరాలు బలపడతాయి. అలాగే కాళ్ళ కండరాలు పట్టుకోవడం, తిమ్మిర్లు రావడం కూడా తగ్గుతుంది.

ఉక్తాసనం:
ముందుగా నిటారుగా నిలబడి చేతులను నమస్కార ముద్రలో ఉంచాలి. మోకాళ్లని కొద్దిగా వంచి కుర్చీలో కూర్చున్నట్టుగా గాల్లో కూర్చోవాలి. అలాగే ఉండి నడుము, చేతులు కుడి పక్కకు ట్విస్ట్ చేయాలి. మెల్లిగా శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. మళ్లీ ఎడమవైపుకి శరీరాన్ని ట్విస్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

బాలాసనం:
ఈ ఆసనం కోసం మోకాళ్లని మడిచి పిరుదులు కాలి పాదాలపై ఆన్చాలి. ఫొటోలో చూపిన విధంగా శరీరాన్ని ముందుకు వంచి ఛాతీ మోకాళ్లకు అనేలా చూసుకోవాలి. తర్వాత నుదుటిని నేలకు ఆనించి చేతులను ముందుకు చాపాలి. ఈ పొజిషన్లో పదిసార్లు గాలి పీలుస్తూ వదలాలి. ఇలా చేయడం వల్ల అలసట, కడుపు ఉబ్బరం తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అలోమ, విలోమ ప్రాణాయామం:
వర్షాకాలంలో తప్పకుండా చేయాల్సిన ప్రాణాయామం ఇది. జలుబు, దగ్గుతో బాధపడే వాళ్లకి ఈ ఆసనం ఉపశమనాన్ని ఇస్తుంది. సుఖాసనంలో కూర్చొని వెన్నముకని నిటారుగా ఉంచాలి. ఎడమ వేలిని చిన్ ముద్రలో ఉంచాలి. అంటే బొటన వేలు, చూపుడు వేలుని కలిపి మిగిలిన వేళ్లని నిటారుగా పెట్టాలి. దాన్ని ఎడమ తొడ మీద ఉంచి... కుడి చేతి మధ్య వేలు, చూపుడు వేలుని మడిచి మిగిలిన వేళ్లను నిటారుగా ఉంచాలి. ముందుగా కుడి చేతి బొటన వేలుతో ముక్కు కుడి రంధ్రాన్ని మూసి ఎడమ రంధ్రంతో శ్వాస తీసుకోవాలి. ఇలా నాలుగు సెకన్లు ఉన్నాక బొటనివేలు తీసేసి కుడి ముక్కు నుంచి గాలిని బయటకు నెమ్మదిగా వదలాలి. తర్వాత కుడి ముక్కుతో శ్వాస తీసుకుని ఎడమ రంధ్రంతో గాలి వదలాలి. ఇలా ఐదు నుంచి పది నిమిషాల వరకు మార్చి మార్చి చేయాలి. ఈ ఆసనం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఆంజనేయాసనం:

ఈ ఆసనం కోసం యోగా మ్యాట్ పై మోకాళ్ళ మీద కూర్చోవాలి. ఈ పొజిషన్ లో కూర్చున్నప్పుడు బాడీ స్టిఫ్ గా ఉంచాలి. తర్వాత కుడి మోకాలిని పైకి లేపి ఎడమ మోకాలిని నేలకు ఆనించి సమాంతరంగా వెనక్కి చాపాలి. ఇప్పుడు తల భాగాన్ని నెమ్మదిగా వెనక్కి వంచి రెండు చేతులను ఫొటోలో చూపిన విధంగా పైకి లేపాలి. తరువాత మెల్లగా శ్వాస తీసుకుంటూ ఛాతిని పైకి లేపాలి. చేతులను కిందకు దించి నెమ్మదిగా శ్వాస వదిలి మునుపటి పొజిషన్ కి రావాలి.