ఎప్‌సెట్ కౌన్సెలింగ్ వాయిదా.. రివైజ్డ్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్  కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ కోసం ఈనెల 27 నుంచి నిర్వహించతలపెట్టిన ఎప్​సెట్  కౌన్సెలింగ్  వాయిదా పడింది. వచ్చే నెల 4 నుంచి అడ్మిషన్  కౌన్సెలింగ్ నిర్వహిస్తామని విద్యా శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఎప్​సెట్ రివైజ్డ్  అడ్మిషన్  షెడ్యూల్ ను విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం విడుదల చేశారు. ఇంజినీరింగ్  కాలేజీలకు ఈనెల30న  ఏఐసీటీఈ అఫిలియేషన్లు ఇచ్చేందుకు సమయం ఉండడంతో పాత షెడ్యూల్​ను మార్చామని ఆయన పేర్కొన్నారు. 

గతంలో మాదిరిగానే ఈసారి కూడా మూడు విడతల్లో ఎప్​సెట్  అడ్మిషన్  కౌన్సెలింగ్  ఉంటుందని చెప్పారు. ఫస్ట్  ఫేజ్  అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా జులై 4 నుంచి 12 వరకు ఆన్​లైన్  రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్  వెరిఫికేషన్  కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఉంటుంది. జులై 6 నుంచి13 వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్  చేస్తారు. జులై 8 నుంచి 15 వరకూ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ, 19న ఫస్ట్  ఫేజ్  సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు జులై 23 వరకూ ట్యూషన్  ఫీజు చెల్లించి, ఆన్​లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్  చేయాల్సి ఉంటుంది. 

సెకండ్  ఫేజ్ లో ఆన్​లైన్  రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జులై 26న, సర్టిఫికెట్ల వెరిఫికేషన్  27న ఉంటుంది. అదే నెల 27, 28న వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహిస్తారు. జులై 31 లేదా అంతకన్నా ముందే స్టూడెంట్లకు సీట్లు కేటాయిస్తారు. ఫైనల్  ఫేజ్  అడ్మిషన్ల  ప్రక్రియ ఆగస్టు 8 నుంచి 17 దాకా నిర్వహిస్తారు. ఇంటర్నల్  స్లైడింగ్ ప్రక్రియను కన్వీనర్  ద్వారానే భర్తీ చేయనున్నారు. ఆగస్టు  9, 10న ఆప్షన్ల  ప్రక్రియ, 13న లేదా అంతకంటే ముందే సీట్ల కేటాయింపు ఉంటుంది. 15లోగా వెబ్ సైట్ లో విద్యార్థులు సెల్ఫ్  రిపోర్టింగ్  చేయాల్సి ఉంటుంది.  ఇక ఆగస్టు 28న  స్పాట్‌‌ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. మరిన్ని వివరాల కోసం https://tgeapcet.nic.in  వెబ్ సైట్ ను పరిశీలించాలని అధికారులు సూచించారు.