అందమైన ప్రేమకథ
టైటిల్ : లంబసింగి
కాస్ట్ : భరత్ రాజ్, దివి, వంశీరాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్ధన్, అనురాధ, మాధవి
డైరెక్షన్ : నవీన్ గాంధీ
లాంగ్వేజ్ : తెలుగు
ప్లాట్ ఫాం : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
వీరబాబు (భరత్ రాజ్)కి కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. తొలి పోస్టింగ్ లంబసింగి అనే ఊళ్లో. అది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. హరిత (దివి) ఆ ఊరి హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంటుంది. లంబసింగికి వెళ్లిన మొదటి రోజే హరిత (దివి)ని చూసి ప్రేమలో పడతాడు. హరిత మాజీ నక్సలైట్ కోనప్ప కూతురు. కోనప్పతో పాటు చాలామంది నక్సలైట్స్ లొంగిపోయి అదే ఊళ్లో మామూలు జీవితం గడుపుతుంటారు. వాళ్లకు పోలీస్ డిపార్ట్మెంట్ నివాసాలు కల్పిస్తుంది. సంతకం పేరుతో రోజూ హరిత వాళ్లింటికి వెళ్లే వీరబాబు ఒకరోజు ఆమెకి లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఆమె రిజెక్ట్ చేయడంతో బాధపడతాడు. అదే టైంలో నక్సల్స్ దాడి జరుగుతుంది. అప్పుడు వస్తుంది ఒక ట్విస్ట్. దాంతో వీరబాబు షాక్ అవుతాడు. ఆ ట్విస్ట్ ఏంటి? హరిత వీరబాబు ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేసింది? చివరకు వాళ్ల ప్రేమకథ ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
భలే ఫ్యామిలీ
టైటిల్ : యే మేరీ ఫ్యామిలీ 3
కాస్ట్ : రాజేశ్ కుమార్, జూహి పర్మర్, హేతల్, అంగద్ రాజ్, వీణా మెహతా
డైరెక్షన్ : రహీబ్ సిద్ధిఖి
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ మినీ టీవీ
లాంగ్వేజ్ : హిందీ
ఈ స్టోరీ1995 నాటిది. ఆ రోజుల్లో మనదేశంలో రెండు మూడు తరాలకు సంబంధించిన వాళ్లంతా కలిసి ఒకే ఫ్యామిలీగా ఉండేవాళ్లు. అలాంటిదే అవస్తి కుటుంబం కూడా. నీరజ (జూహి పర్మర్), సంజయ్ (రాజేశ్ కుమార్)లకు ఇద్దరు పిల్లలు. రిషి (అంగద్ రాజ్), రితిక (హేతల్). అవస్తి కుటుంబానికి చెందిన సంతోషం, బాధ వంటి విషయాలన్నీ ఈ సిరీస్‌లో కనిపిస్తాయి. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు వాళ్లు ఎలా ఉంటారు? బర్త్‌డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారు? పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది? రిషి, రితికల గిల్లికజ్జాలు.. వంటి ఎన్నో విశేషాలతో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఈ సమ్మర్ హాలీడేస్‌కి ఇంటిల్లిపాదీ కలిసి కూర్చుని సేదతీరాలంటే ఈ సిరీస్ బెస్ట్ ఆప్షన్. ఇందులో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరి నటన నేచురల్‌గా ఉంటుంది. వాళ్ల ఫ్యామిలీని చూస్తుంటే మన ఫ్యామిలీస్ రిలేట్ అవుతాయి.
కాపీ కొట్టే బ్యాచ్
టైటిల్ : ఫర్రే
కాస్ట్ : అలీజా అగ్నిహోత్రి, ప్రసన్న బిష్ట్, సాహిల్ మెహతా, జూహి బబ్బర్, రోనిత్ రాయ్
డైరెక్షన్ : సౌమేంద్ర పధి
ప్లాట్ ఫాం : జీ5
లాంగ్వేజ్ : హిందీ
డబ్బున్న స్టూడెంట్స్ కొందరు చదువుకోవడానికి బద్ధకిస్తారు. వాళ్ల తల్లిదండ్రులని సంతోష పెట్టడానికి ఒక ముఖ్యమైన ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. కానీ, అది వాళ్ల వల్ల అయ్యే పని కాదు. అందుకోసం పేద విద్యార్థులను వాడుకోవాలి అనుకుంటారు. అనాథాశ్రమంలో పెరిగిన నియతి (అలీజా అగ్నిహోత్రి) కాపీ ఎలా చేయాలి అని రకరకాల ప్లాన్లు వేస్తుంటుంది. అయితే ఆ ప్లాన్లు కొన్నిసార్లు మాత్రమే సక్సెస్ అవుతాయి. అలాగే కాపీ కొట్టేటప్పుడు ఇన్విజిలేటర్ పట్టుకుంటాడేమోననే భయం కూడా కనిపిస్తుంటుంది. విదేశాలకు వెళ్లి ఎగ్జామ్ రాయాల్సిన సిచ్యుయేషన్ వస్తుంది. ఇవ్వాళ రేపు కొందరు యువత తాము అనుకున్నది సాధించేందుకు దారి తప్పి ఎలాంటి మార్గాలు ఎన్నుకుంటున్నారు అనేది చూపించారు. అయితే క్లైమాక్స్ మాత్రం సింపుల్‌గా తేల్చేశాడు డైరెక్టర్.