కబ్జాలు ఖతం కావాల్సిందే.. శభాష్​ హైడ్రా

సరస్సులు, జలాశయాలు, ఉద్యానవనాలు, ఇతర బహిరంగ స్థలాల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌రెడ్డి మాస్​రూలర్​గా అవతరించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సరస్సు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్ టీఎల్​), బఫర్ జోన్‌‌‌‌లు,  ఇతర ఆక్రమణలలో కొత్తగా నిర్మించిన, నిర్మాణంలో ఉన్న భవనాలను హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం జరుగుతోంది. ఆక్రమణదారులు, బిల్డర్లు, రాజకీయ నాయకులను సీఎం ఆదేశాలు షాక్‌‌‌‌కు గురి చేస్తున్నాయి. ముఖ్యమంత్రి మద్దతుతో కష్టతరమైన పనిని అధికారులు చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నారు. 

బిగ్​ బిల్డర్లు, ప్రభావవంతమైన వ్యక్తుల ఆక్రమణలను హైడ్రా లక్ష్యంగా చేసుకుంది. అక్రమంగా నిర్మించిన విల్లాలు, వాణిజ్య, ఇతర నిర్మాణాలను తొలగిస్తోంది.  గత కొన్ని రోజులుగా ఈ ప్రాంత ప్రజలు, ఇతరుల నుంచి హైడ్రా  విస్తృతంగా ప్రశంసలను అందుకుంటోంది.  తెలంగాణ రాజధాని హైదరా​బాద్​లో హైడ్రా సృష్టించిన సంచలనాన్ని రైట్​థింకింగ్ పీపుల్​ స్వాగతిస్తున్నారు. సీఎం రేవంత్​  ప్రజల నుంచి మాస్​గా ప్రశంసలు అందుకుంటున్నారు.

అడ్డుకునే నేతల అరెస్ట్​

సీనియర్​ ఐపీఎస్​ అధికారి రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా అధికారుల బృందం.. చింత చెరువు, గాజులరామారం, చందానగర్, నిజాంపేట్, బహదూర్‌‌‌‌పురా, గండిపేట తదితర సరస్సులలోని ఆక్రమణల కూల్చివేత పనులను ప్రారంభించారు. ఆక్రమణల కూల్చివేతల్లో రంగనాథ్​ కీలకపాత్ర పోషిస్తున్నారు. కొన్ని చోట్ల బిల్డర్లు, స్థానిక నాయకులు, ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వచ్చినా రంగనాథ్‌‌‌‌ పోలీసు రక్షణ తీసుకుని శరవేగంగా ఆపరేషన్‌‌‌‌ చేపట్టారు. ఈక్రమంలో హైదరాబాద్‌‌‌‌లోని జూబ్లీహిల్స్‌‌‌‌లో జీహెచ్‌‌‌‌ఎంసీ గోడ కూల్చివేతకు సహకరించనందుకు ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌పై కేసులు నమోదయ్యాయి.  అంతకుముందు, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సమీపంలోని శాస్త్రిపురంలోని  బం-రుక్న్-ఉద్-దౌలా హెరిటేజ్ సరస్సులో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రయత్నించినప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌‌‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఎర్ల చెరువులో విల్లాలపై ఫిర్యాదులు

చందానగర్ సర్కిల్‌‌‌‌లోని ఎర్ల చెరువులో విల్లాలు నిర్మాణాలు చేపట్టేందుకు జీహెచ్‌‌‌‌ఎంసీ భవన నిర్మాణ అనుమతులు, ఎన్‌‌‌‌ఓసి (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) రెండూ ఉన్నాయి.  దీనిపై సుమారు 100కు పైగా ఫిర్యాదులు అందుకున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, ఎఫ్‌‌‌‌టిఎల్, బఫర్ జోన్‌‌‌‌లలో అక్రమ కట్టడాలను కూల్చివేసే ముందు ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎ డేటా శాటిలైట్ చిత్రాలు, రెవెన్యూ రికార్డులు, గ్రౌండ్ రియాలిటీ, అందుబాటులో ఉన్న మొత్తం సమాచారాన్ని హైడ్రా ఉపయోగించుకుంటోంది. హైడ్రా ప్రత్యేకంగా జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ, హెచ్​ఎండబ్ల్యూఎస్​ఎస్​బీ, సిటీ ట్రాఫిక్ పోలీస్, ఇతర విభాగాల నుంచి బృందాలను నియమించింది. జీహెచ్​ఎంసీలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్​) పరిధిలో 400 సరస్సులు ఉన్నాయి.  నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్​ఆర్​ఎస్​సీ) డేటా ప్రకారం 1979-–2024 మధ్య (45 సంవత్సరాలు) హైదరాబాద్ నగరంతో పాటు  చుట్టుపక్కల ఉన్న నీటి వనరులలో 61 శాతం తగ్గిపోయాయి.

జీఓ 111 రద్దు చేసిన బీఆర్​ఎస్​

ఉస్మాన్‌‌‌‌ సాగర్‌‌‌‌లోని బఫర్‌‌‌‌ జోన్‌‌‌‌లో గ్రీన్‌‌‌‌కో  గ్రూప్‌‌‌‌, ఒరో స్పోర్ట్స్‌‌‌‌ విలేజ్‌‌‌‌, పాలమూరు గ్రిల్‌‌‌‌ తదితర వందల కోట్ల విలువైన ప్రాజెక్టులు  ఒక్కసారిగా నేలకూలిన వీడియోలను చూసిన హైదరాబాదీలు ఒకింత ఉలిక్కిపడ్డారు. కాగా, నిజాం కాలం నాటి రెండు ప్రధాన తాగునీటి వనరులు, ఉస్మాన్ సాగర్ (గండిపేట్),  జీఓ 111 కింద వచ్చే హిమాయత్ సాగర్ పరిధిలో గత దశాబ్దం.. అంతకంటే ఎక్కువ కాలం నుంచే భారీ అక్రమ నిర్మాణాలు వెల్లువెత్తాయి. సరస్సుల కాలుష్య నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామని, మాస్టర్‌‌‌‌ప్లాన్‌‌‌‌ రూపొందిస్తామని మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌‌‌‌రావు కూడా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఒకప్పుడు హైదరాబాద్‌‌‌‌, సికింద్రాబాద్‌‌‌‌ జంట నగరాల తాగునీటి అవసరాలను తీర్చిన రెండు సరస్సులును...కృష్ణా, గోదావరి జలాలపై బ్యాంకింగ్‌‌‌‌ చేస్తున్నందున వాటిని వినియోగించుకోవడం లేదని, కాబట్టి జీవో 111 అవసరం లేదని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు పేర్కొంటున్నారు.  కాగా, సరస్సుల చుట్టూ భారీ నిర్మాణాలు  ప్రారంభమవగా. కొత్త వెంచర్లు, నగరాలు రాబోతున్నాయి. నీటి వనరులను ల్యాండ్‌‌‌‌షార్క్‌‌‌‌లు మింగేస్తున్నాయి.  

నీటివనరుల రక్షణకోసం జీవో 111

 హైదరాబాద్ నగరంతోపాటు పొరుగు జిల్లాల్లో సరస్సులు విపరీతంగా తగ్గిపోతున్నాయి. ఉస్మాన్ సాగర్,  హిమాయత్ సాగర్‌‌‌‌లకు నీటిని మళ్లించడానికి,  పరీవాహక ప్రాంతాలను రక్షించడానికి జీఓ నంబర్ 111 రూపొందింది. పరీవాహక ప్రాంతాలు బయో కన్జర్వేషన్ జోన్‌‌‌‌లుగా వర్గీకరించడమైంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ రెండింటికి 10 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి నిర్మాణాన్ని చేపట్టరాదని జీవో 111 స్పష్టంగా తెలియజేస్తోంది. 

జీఓ 111 రద్దు నిలిపివేత

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రేవంత్ రెడ్డి వివాదాస్పద  జీఓ111 రద్దును నిలిపివేశారు. కాగా,  కె చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్​ ప్రభుత్వం గత సంవత్సరం జీఓను రద్దు చేసింది.  ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రభుత్వ ఉత్తర్వు 63.. భూ వినియోగాన్ని పరిరక్షణ జోన్ నుంచి నివాస, వాణిజ్య లేదా మల్టీపర్పస్​గా మార్చడానికి అనుమతించే మార్గదర్శకాలను రూపొందించడం గురించి తెలుపుతోంది. జీవో 111  ఏదో ఒకరోజు రద్దు అవుతుందన్న ఆశతో చాలామంది ఆ ఏరియాలో భూములు కొనుగోలు చేశారు. జీవో 111లోని చదరపు గజం, ఎకరం భూమి ధర కూడా పరిమితుల కారణంగా తక్కువగా ఉండటంతో కొనుగోలు చేశారు. అయితే, హైడ్రా చీఫ్​ రంగనాథ్.. గండిపేట ప్రాంతంలోని అపార్ట్‌‌‌‌మెంట్లు, స్పోర్ట్స్ విలేజ్, ఫుడ్ కోర్టులు, వాణిజ్య సంస్థలతో సహా నిర్మాణంలో ఉన్న అనేక నిర్మాణాలను  తొలగించారు. భారీ కూల్చివేత యంత్రాలతో పనులు పూర్తి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కాగా, నిర్మాణాలకు పంచాయతీ కార్యదర్శి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, తనకు ఎలాంటి అధికారం లేకపోయినా అక్రమ కట్టడాల నిర్మాణానికి అనధికార అనుమతులు మంజూరు చేసినందుకు మాజీ సర్పంచ్‌‌‌‌పై క్రిమినల్ కేసు నమోదైంది. 

అధికారులపైనా చర్యలు

 ఎఫ్‌‌‌‌టీఎల్, బఫర్ జోన్, ఇతర నిషేధిత ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టిన రియల్టర్లు, బిల్డర్లు, వారికి సహకరిస్తున్న ఇతరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైడ్రా నిర్ణయించింది.  ప్రాపర్టీ కొనుగోలుదారులు డాక్యుమెంట్‌‌‌‌లను నిర్ధారించుకోవాలని, లీగల్​ ఓపీనియన్​ పొందాలని, బఫర్ జోన్‌‌‌‌గా ఉన్న సరస్సు సరిహద్దు నుంచి 30 మీటర్ల లోపల ఉన్న వాటిని తొలగించనున్నట్లు హైడ్రా యంత్రాంగం తెలిపింది. ఒకవైపు  అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నప్పటికీ,  అక్రమ నిర్మాణాలకు సహకరించిన అధికారులతో సహా అటువంటి చర్యలకు పాల్పడినవారిపై హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకోనుందో వేచి చూడాలి. ఏది ఏమైనా హైడ్రా పనితీరు రేవంత్​ ప్రభుత్వ పనితీరుకు ఒక గొప్ప టర్నింగ్​ పాయింట్ అని చెప్పకతప్పదు.

నీటి వనరులను రక్షించడానికి హైడ్రా

నగరంలోని 2,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సరస్సులు, నీటి వనరులు, నాలాలు, ప్రభుత్వ భూములను రక్షించడం హైడ్రా ప్రధాన బాధ్యత.  దీంతోపాటు  హోర్డింగ్‌‌‌‌లు, ఫ్లెక్సీ బ్యానర్‌‌‌‌ల నియంత్రణ, తాగునీటి పైపులైన్లు,  డ్రైనేజీ లైన్లు, విద్యుత్ పంపిణీ లైన్లకు సంబంధించిన అత్యవసర పరిస్థితుల్లో సమస్యలను పరిష్కరించడం,  ట్రాఫిక్ నియంత్రణ,  ఫ్లడ్​ మేనేజ్​మెంట్​ వంటి కీలక అంశాల్లో హైడ్రా చురుకుగా వ్యవహరిస్తోంది. ఈనేపథ్యంలో శాఖ పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది అవసరాలు, విధులు, నిధులు, బాధ్యతలను వివరిస్తూ ముసాయిదా ప్రతిపాదనను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారిని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఆదేశించారు.


.
- సీఆర్  గౌరీశంకర్
సీనియర్​ జర్నలిస్ట్