చూడ్డానికి గ్రీన్ యాపిల్లా ఉన్న ఈ కూరగాయకు ‘టిండా, బేబీ గుమ్మడికాయ, యాపిల్ గార్డ్’ అంటూ చాలానే పేర్లున్నాయి. చికెన్, ఆలుగడ్డ, పనీర్.. వేటిని పెట్టి స్టఫింగ్ చేసినా టేస్ట్ అదిరిపోతుంది. గ్రేవీ కర్రీ చేసుకుంటే చపాతీ, అన్నంలోకి బాగుంటుంది. మరింకెందుకాలస్యం.. ఇప్పటివరకు ఈ బేబీ గుమ్మడికాయను ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి.
ఆలుగడ్డ మసాలా స్టఫింగ్
కావాల్సినవి :
బేబీ గుమ్మడికాయలు - తొమ్మిది
నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు
ఉల్లిగడ్డ - ఒకటి
అల్లం - చిన్న ముక్క
పచ్చిమిర్చి - రెండు
ధనియాల పొడి - రెండు టీస్పూన్లు
సోంఫు - మూడు టీస్పూన్లు
కారం, ఆమ్చూర్ పొడి, ఉప్పు - ఒక్కో టీస్పూన్
పసుపు, గరం మసాలా - ఒక్కోటి అర టీస్పూన్
ఆలుగడ్డలు ( ఉడికించి, మెదిపి) - రెండు
గ్రేవీ కోసం :
నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు
జీలకర్ర - ఒక టీస్పూన్
అల్లం (తురుము) - ఒక టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - రెండు, ఉల్లిగడ్డలు - మూడు
ధనియాల పొడి - రెండు టీస్పూన్లు
పసుపు - అర టీస్పూన్
కారం, గరం మసాలా- ఒక్కో టీస్పూన్
టొమాటో గుజ్జు - ఒక కప్పు
ఉప్పు - సరిపడా
కసూరీ మేతి - ఒక టేబుల్ స్పూన్
కొత్తిమీర - కొంచెం
తయారీ : బేబీ గుమ్మడి కాయల్ని కడిగి, తొక్కతీయాలి. పైన చిన్న రంధ్రం పెట్టి వాటి లోపలి కండ తీసేయాలి. పాన్లో నూనె వేడి చేయాలి. అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు, అల్లం తురుము వేగించాలి. తరువాత ధనియాల పొడి, సోంఫు వేయాలి. కారం, ఆమ్చూర్ పొడి, ఉప్పు, పసుపు, బేబీ గుమ్మడికాయ లోపలి కండ కూడా వేసి కలపాలి. మూతపెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి. తర్వాత అందులో ఆలుగడ్డ మిశ్రమం వేసి, ఈ స్టఫింగ్ని బేబీ గుమ్మడికాయలో కూరాలి.
గ్రేవీ తయారీ : మరో పాన్లో నూనె వేడి చేసి జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిర్చి వేగించాలి. తర్వాత ఉల్లిగడ్డల్ని పేస్ట్ చేసి అందులో వేయాలి. ఇది బాగా వేగాక, ధనియాల పొడి, పసుపు, కారం, టొమాటో గుజ్జు వేగించాలి. తర్వాత ఉప్పు కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. తర్వాత అందులో కసూరీ మేతి, కొత్తిమీర, గరం మసాలా కలపాలి. మిగిలిన ఆలుగడ్డ స్టఫింగ్ని కూడా వేసి, నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. తర్వాత అందులో స్టఫ్ చేసిన బేబీ గుమ్మడికాయల్ని పెట్టాలి. మూతపెట్టి ఇరవై నిమిషాలు ఉడికించాలి. ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుతుండాలి. టేస్ట్ అంటారా... తినాల్సిందే.
చికెన్ స్టఫ్డ్ టిండా
కావాల్సినవి :
బేబీ గుమ్మడికాయలు - పదిహేను
ఉల్లిగడ్డ (సన్నగా, నిలువుగా తరిగి) - ఒక కప్పు
టొమాటో తరుగు - అర కప్పు
చికెన్ ఖీమా - అర కిలో
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - ఆరు
పచ్చిమిర్చి - మూడు
నూనె - పావు కప్పు
కారం - రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు - సరిపడా
కొత్తిమీర - కొంచెం
పసుపు, మిరియాల పొడి - ఒక్కో టేబుల్ స్పూన్
తయారీ : ముందుగా చికెన్ ఖీమాని శుభ్రంగా కడగాలి. బేబీ గుమ్మడికాయలు కడిగి, తొక్క తీసి, పైన రంధ్రం చేయాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా దంచాలి. నూనె వేడి చేసి ఉల్లిగడ్డ తరుగు వేయాలి. అవి వేగాక చికెన్ ఖీమా వేసి బాగా ఉడికించాలి. తరువాత అందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మిశ్రమం వేయాలి. వాటితోపాటు టొమాటో తరుగు కూడా వేయాలి. కాసేపయ్యాక పసుపు, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి బాగా ఉడికించాలి. ఆ మిశ్రమంలో కొత్తిమీర కూడా కలపాలి. దీన్ని బేబీ గుమ్మడి కాయలోపల స్టఫింగ్ చేయాలి. మరో పాన్లో నూనె వేడి చేసి అందులో ఈ స్టఫ్డ్ బేబీ గుమ్మడికాయలు పెట్టాలి. మూతపెట్టి పది నిమిషాలు ఉడికించాలి. అంతే.. టేస్టీగా ఉండే చికెన్ స్టఫ్డ్ బేబీ గుమ్మడి కాయలు తినడానికి రెడీ.
గ్రేవీ కర్రీ
కావాల్సినవి :
బేబీ గుమ్మడి కాయ ముక్కలు - పావు కిలో
వెల్లుల్లి రెబ్బలు - పన్నెండు
కారం, ధనియాల పొడి - ఒక టీస్పూన్
పచ్చిమిర్చి - రెండు
పసుపు - అర టీస్పూన్
కొత్తిమీర - కొంచెం
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
టొమాటో గుజ్జు - ఒక కప్పు
ఆలుగడ్డ - ఒకటి
తయారీ : మిక్సీజార్లో వెల్లుల్లి రెబ్బలు, కారం, ధనియాల పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక ప్రెజర్ కుక్కర్లో నూనె వేడి చేసి అందులో గ్రైండ్ చేసిన మసాలా వేయాలి. టొమాటో గుజ్జు కూడా వేసి కలపాలి. తొక్క తీసి ముక్కలుగా కోసిన బేబీ గుమ్మడి కాయలు, ఆలుగడ్డ ముక్కలు వేసి కలపాలి. నీళ్లు పోసి, ఉప్పు వేసి మరోసారి కలపాలి. మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
మలై టిండా
కావాల్సినవి :
బేబీ గుమ్మడి కాయ ముక్కలు - ఒక కేజీ
టొమాటోలు - మూడు
పెరుగు - ఒక కప్పు
క్రీమ్ - రెండు టేబుల్ స్పూన్లు
కారం - అర టేబుల్ స్పూన్
ఉప్పు - సరిపడా
ధనియాల పొడి, కసూరీ మేతీ - ఒక టేబుల్ స్పూన్
పసుపు - అర టీస్పూన్
నూనె - మూడు టేబుల్ స్పూన్లు
జీలకర్ర - రెండు టీస్పూన్లు
బిర్యానీ ఆకులు - రెండు
ఉల్లిగడ్డ - ఒకటి
అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ - ఒక్కో టీస్పూన్
పచ్చిమిర్చి - ఐదు
కొత్తిమీర తరుగు - కొంచెం
మిరియాల పొడి - అర టీస్పూన్
తయారీ : ఒక గిన్నెలో పెరుగు, కారం, పసుపు, ధనియాల పొడి, క్రీమ్, ఉప్పు వేసి బాగా కలపాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి జీలకర్ర, బిర్యానీ ఆకులు వేసి వేగించాలి. తొక్కతీసి, ముక్కలు చేసిన బేబీ గుమ్మడికాయల్ని కూడా వేసి కలపాలి. సన్నగా, నిలువుగా తరిగిన ఉల్లిగడ్డ, అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలపాలి. తర్వాత టొమాటో గుజ్జు, పెరుగు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. అవన్నీ మరికాసేపు ఉడికాక, కొత్తిమీర తరుగు, మిరియాల పొడి, కసూరీ మేతీ చల్లాలి. మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి.
పనీర్ స్టఫ్డ్ టిండా
కావాల్సినవి :
బేబీ గుమ్మడి కాయలు - ఎనిమిది
పనీర్ తురుము - రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు - సరిపడా
కారం, ధనియాల పొడి, పసుపు - ఒక్కోటి అర టీస్పూన్
అల్లం - చిన్న ముక్క
పెరుగు - అర కప్పు
టొమాటోలు - రెండు
పచ్చిమిర్చి - నాలుగు
ఇంగువ - చిటికెడు
జీలకర్ర, పసుపు, కారం - అర టీస్పూన్
నూనె, ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూన్
కొత్తిమీర - కొంచెం
తయారీ : బేబీ గుమ్మడి కాయల్ని తొక్క తీసి, పైన రంధ్రం పెట్టి లోపలి గుజ్జు తీసేయాలి. ఆ గుజ్జును ఒక గిన్నెలో వేసి, దాంతోపాటు పనీర్ తురుము, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని బేబీ గుమ్మడి కాయల్లో కూరాలి. తర్వాత ప్రెజర్ కుక్కర్లో ఒక స్పూన్ నీళ్లు వేసి అందులో స్టఫ్డ్ బేబీ గుమ్మడి కాయల్ని ఉంచి, పైన మూత పెట్టి ఉడికించాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఇంగువ, పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. పచ్చిమిర్చి, టొమాటో, బేబీ గుమ్మడికాయ లోపలి గుజ్జు కూడా కలిపి మిక్సీ పట్టిన పేస్ట్ కూడా అందులో వేయాలి. పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. కొన్ని నీళ్లు పోసి, పనీర్ తురుము, కొత్తిమీర తరుగు వేయాలి. ఆ తర్వాత అందులో ఉడికించిన స్టఫ్డ్ బేబీ గుమ్మడి కాయలు పెట్టాలి.