తెలంగాణ కాడ మస్తు పైసలున్నయ్​.. మా వద్ద లేవ్

  • కృష్ణా జలాలపై మన ఎస్​వోసీ మీద ఏపీ వింత వాదన
  • నీళ్లతో సంబంధం లేని అంశాలు తెరపైకి
  • తలసరి ఆదాయం, రాష్ట్రంలోని గనుల ప్రస్తావన
  • తెలంగాణలో విలువైన ఖనిజాలున్నాయంటూ కామెంట్స్​
  • హైదరాబాద్​లాంటి రాజధాని తమకు లేదని వ్యాఖ్య
  • కేడబ్ల్యూడీటీ– 2లో తెలంగాణ ఎస్​వోసీకి ఏపీ కౌంటర్​ దాఖలు
  • 555 టీఎంసీలకు ఒప్పుకునేది లేదని ప్రకటన

హైదరాబాద్, వెలుగు : కృష్ణా జలాల పంపకాల విషయంలో ఏపీ వింత వాదనలు చేసింది. ఇరిగేషన్​తో సంబంధం లేని అంశాలను తెరపైకి తెచ్చింది. కృష్ణా జలాల వివాదాలపై కృష్ణా వాటర్​ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్–​ 2 (బ్రజేశ్​ కుమార్​ ట్రిబ్యునల్​)కు తెలంగాణ సమర్పించిన స్టేట్​మెంట్​ ఆఫ్​ కేస్​ (ఎస్​వోసీ)పై ఏపీ తాజాగా కౌంటర్​ దాఖలు చేసింది. అందులో ఇరిగేషన్​తో ఏ మాత్రం సంబంధం లేని మైనింగ్, తలసరి ఆదాయం, సింగరేణి కాలరీస్​, హైటెక్​ సిటీ వంటి విషయాలను ప్రస్తావించింది. ఏపీలోని కృష్ణా డెల్టాలో సారవంతమైన భూములున్నాయని, వాటిలో వరి తప్ప వేరే ఏవీ పండవని, అందుకే నీళ్లివ్వాలని పేర్కొంది.

అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత విలువైన ఖనిజ సంపద ఉన్నదని పేర్కొంది. ‘‘తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్​, ఖమ్మం, ఆదిలాబాద్​ జిల్లాల్లో బొగ్గు, సున్నపురాయి, బాక్సైట్​, మైకా వంటి విలువైన ఖనిజాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఖనిజసంపదలో 79 శాతం ఆయా జిల్లాల నుంచే వచ్చేది. పరిశ్రమల అవసరాలు, విద్యుదుత్పత్తి కోసం సింగరేణి బొగ్గును తవ్వుతున్నది.

తెలంగాణకు బయ్యారంలోని ఇనుప ఖనిజంతో లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. రంగారెడ్డిలో గ్రానైట్​, మహబూబ్​నగర్​లో కింబర్లైట్​పైప్​ (వజ్రాలు) వంటి నిక్షేపాలున్నాయి. అయితే, ఆ రాష్ట్రంలో పంటలు పండే భూములు తక్కువైనా.. ఇలాంటి విలువైన ఖనిజాలు మాత్రం అత్యధికంగా ఉన్నాయి. అక్కడ పరిశ్రమలూ ఎక్కువగా ఉన్నాయి. వాటితో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది. ప్రజలూ ఆర్థికంగా బలోపేతమవుతున్నారు’’ అని కౌంటర్​లో ఏపీ తెలిపింది. 

తెలంగాణ మిగులు రాష్ట్రమని కామెంట్

విభజన సమయంలో తెలంగాణ మిగులు రాష్ట్రమని కౌంటర్​లో ఏపీ పేర్కొన్నది. ఐటీ హబ్​గా పేరున్న హైదరాబాద్​ లాంటి రాజధాని తెలంగాణకు ఉన్నదని, ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని, తద్వారా యువతకు ఉపాధి లభిస్తున్నదని చెప్పింది. తమ రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేదని, అమరావతిలో నిర్మించుకుంటున్నామని తెలిపింది. ఏపీతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం కూడా చాలా ఎక్కువని పేర్కొన్నది. నిరుడు ఏపీ తలసరి ఆదాయం 2.19 లక్షలైతే.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.17 లక్షలుగా ఉందని తెలిపింది.

ఈ విషయంలో తెలంగాణతో ఏపీకి పోలికే లేదని చెప్పింది. అదే సమయంలో ఇరిగేషన్​కు నీటి వనరుల వినియోగం విషయంలోనూ ఏపీతో తెలంగాణకు పోలికే ఉండరాదని స్పష్టం చేసింది. తమది వ్యవసాయాధారిత రాష్ట్రమని, ఆ దిశగా వ్యవసాయ రంగ ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని కౌంటర్​లో ఏపీ పేర్కొనడం గమనార్హం. 

తెలంగాణ వాదన అర్థరహితమన్న ఏపీ

కృష్ణా నీళ్లలో ఎక్కువ భాగం కావాలన్న తెలంగాణ వాదన అర్థరహితమని, అన్యాయమని కౌంటర్​లో ఏపీ పేర్కొంది. కేడబ్ల్యూడీటీ 1,  2లు తీసుకు న్న నిర్ణయాలకు విరుద్ధమంది. పారిశ్రామికంగా, ఖనిజ సంపదపరంగా, ఆర్థికపరంగా తెలంగాణ అభివృద్ధి పథంలో ఉందని తెలిపింది. తెలంగాణను కేవలం ఇరిగేషన్​ విషయంలో ఏపీతో పోలిస్తే వెనుకబడి ఉందని మాట్లాడడం తప్పుదోవ పట్టించినట్టవుతుందని పేర్కొంది. నీటి వాటాలను కాపాడుకునే హక్కు తమకున్నదని వాదించింది. నీటి వాటాల విషయంలో తెలంగాణవి గొంతెమ్మ కోరికలని ఏపీ వాదించింది.

811 టీఎంసీల నికర జలాల్లో 555 టీఎంసీలు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అందుకు తాము ఒప్పుకోమంది. ‘‘65 శాతం లభ్యత ఆధారంగా అదనంగా 43 టీఎంసీలు ఇవ్వడానికి అంగీకరించం. యావరేజ్​ ఫ్లోస్​ కింద 145 టీఎంసీల్లో 120 టీఎంసీల వాటా ఇవ్వొద్దు. పోలవరం నుంచి కృష్ణాకు తరలించే 45 టీఎంసీల నీటిలో ఒక్క బొట్టు కూడా ఇచ్చేది లేదు. కృష్ణా బేసిన్​ అవతల తెలంగాణ నిర్మిస్తు న్న ప్రాజెక్టులను నియంత్రించాలి. 1976 తర్వాత బేసిన్​ అవతల నిర్మించిన ఏ ప్రాజెక్టుకూ కేటాయింపులు చేయొద్దు.

2,578 టీఎంసీల నీటి లభ్యత తర్వాత మిగులు జలాలను వాడుకు నే హక్కు తెలంగాణకు ఇవ్వాలన్న వాదనతో ఏకీభవించం. కృష్ణా నదిపై ఏపీ కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలన్న ఆ రాష్ట్ర వాదనను కొట్టివేయాలి’’ అని కౌంటర్​లో ఏపీ పేర్కొంది.