వ్యాక్సిన్ తీసుకున్న పది లక్షలమందిలో ఒకరికో, ఇద్దరికో సమస్య వస్తుంది. ఇప్పుడు అందరూ మాట్లాడుకునే వ్యాక్సినే కాదు ఏ వ్యాక్సిన్ తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. రేబిస్, ఇన్ఫ్లుయెంజా వంటి వ్యాక్సిన్లు తీసుకున్నప్పుడు .0001 శాతం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మెడిసిన్ తయారుచేయకుండా ఉండరు కదా! ఎందుకంటే అప్పుడున్న అత్యవసర పరిస్థితిని బట్టి మెడిసిన్ వెంటనే అందుబాటులోకి రావాలనే ఆలోచనే ఉంటుంది.
ఎప్పుడైనా వ్యాక్సిన్ రిలీజ్ చేసేటప్పుడు ఎమర్జెన్సీ ఆథరైజేషన్ అనేది ఉంటుంది. కొవిడ్ లాంటివి అకస్మాత్తుగా వచ్చినప్పుడు చాలా తక్కువ టైం ఉంటుంది. వేరే ఆప్షన్ ఉండదు. ప్రాణాలను కాపాడాలంటే వ్యాక్సిన్ తయారుచేయాల్సిందే. దాంతో ఎమర్జెన్సీ ఆథరైజేషన్‌కి డబ్ల్యూహెచ్ఒ(ప్రపంచ ఆరోగ్య సంస్థ) పర్మిషన్ ఇస్తుంది. అలానే కొవిడ్ వ్యాక్సిన్ తయారీ మొదలైంది.
అంతేకాకుండా అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఏ వ్యాక్సిన్ రిలీజ్ చేసేటప్పుడు అయినా దాని వల్ల జరిగే లాభనష్టాలను కూడా డాక్యుమెంట్లో స్పష్టంగా రాస్తారు. అలానే కోవిషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో కూడా ‘టీటీఎస్ అనేది చాలా రేర్’ అని రాశారు. కొవిడ్ వ్యాక్సిన్స్ మాత్రమే కాదు.. ఉదాహరణకు జ్వరానికి వేసుకునే డ్రగ్స్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల లివర్ ఎఫెక్ట్ అవుతుందని రాస్తారు. కానీ అలాంటివి ఎవరూ పట్టించుకోలేదు. కొవిడ్ వైరస్ కోసం వచ్చిన ఈ వ్యాక్సిన్‌ని మాత్రమే హైలైట్ చేసి నిన్నమొన్నటి వరకు వైరస్ భయంతో ఉన్న ప్రజల్ని ఇంకా భయపెట్టడం సరికాదు.
మొదట్లోనే తెలుస్తాయి
కోవిషీల్డ్ వల్లే హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వస్తున్నాయని అంటున్నారు. కానీ, ఏ సైడ్ ఎఫెక్ట్ అయినా మొదటి డోస్ తీసుకున్న నెల నుంచి మూడు నెలల్లోపే వస్తుంది. అది కూడా వ్యాక్సిన్ వల్ల రావడం చాలా రేర్. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వాటిలో టీటీఎస్ సిండ్రోమ్ చాలా డేంజర్. దీని బారిన పడి విపరీతమైన తలనొప్పి, కడుపునొప్పి, శ్వాసలో ఇబ్బంది, మూర్ఛ వంటివి వస్తే వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్లాలి. ఇప్పటికే చాలామంది రెండు, మూడు డోస్‌లు తీసుకున్నారు. దాదాపు అందరూ సేఫ్‌గానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ‘ఏమో అయిపోతుంద’ని భయపడాల్సిన అవసరం లేదు.
వ్యాక్సిన్ మరణాలతో పోలిస్తే కొవిడ్ మరణాలు చాలా ఎక్కువ. అందుకని ఫైనల్‌గా చెప్పేదేంటంటే.. ఇప్పుడు వ్యాక్సిన్ గురించి వస్తున్న వార్తలను చూసి ఎవరూ భయపడొద్దు. కొవిడ్ వ్యాక్సిన్లు తీసుకుని రెండుమూడేండ్లు అయింది. అందుకని అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. కొత్త లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే చెక్ చేయించుకోవాలి. ప్రతి ఏటా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. అలా చేయించుకుంటేనే ఎప్పుడు? ఏమైనా? తేడా ఉంటే వెంటనే తెలుసుకోవచ్చు. సరైన టైంకి ట్రీట్మెంట్ చేయగలం.