బుద్ధవనంలోఅభివృద్ధి ఏదీ?

  •     కాగితాలకే పరిమితమైన నిధుల‌‌‌‌ మంజూరు
  •     అన్యాక్రాంతమవుతున్న భూములు
  •     కొత్త సర్కారు దృష్టి సారించాలంటున్న స్థానికులు
  •     ఎన్టీపీసీ, సింగరేణి సహకారం కోరుతున్న టూరిస్టులు

పెద్దపల్లి, వెలుగు : తెలంగాణలోని పురాతన కట్టడాలను గుర్తించి వాటిని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని నాటి ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. ప్రధానంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట, వడ్కాపూర్ నడుమ ఉన్న బౌద్ధస్తూపం అభివృద్ధికి కావాల్సిన నిధులు ఇస్తామని వెల్లడించింది. కానీ, నిధుల మంజూరు కాగితాలకే పరిమితమైంది. ఇప్పటికీ బౌద్ధ స్తూపాల అభివృద్ధికి నయాపైసా సర్కారు విడుదల చేయలేదు.

ఈ నేపథ్యంలో అన్యాక్రాంతమవుతున్న బుద్ధవనం భూములను కాపాడి అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రస్తుత కాంగ్రెస్ సర్కారును ప్రజలు కోరుతున్నారు. జిల్లాలోని ఎన్టీపీసీ, సింగరేణి సంస్థల సహకారం కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు. 

ఎన్టీపీసీ, సింగరేణితో సాధ్యం!

ఉత్తర తెలంగాణలో ఉన్న ఎన్టీపీసీ, సింగరేణి సంస్థలు సర్కారుకు అన్ని విధాలుగా సహకరిస్తున్నాయి. ప్రభుత్వం ప్రోగ్రాంలను సక్సెస్ చేయడంలో వీటి పాత్ర కీలకం. ఈ క్రమంలో బుద్ధవనాలను హ్యాండోవర్ చేసుకొని డెవలప్ చేయాలని  స్థానికులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని బౌద్ధస్తూపం ఎంతో ప్రతిష్టాత్మకమైనది కావడంతో ఇక్కడకు విదేశీయులు కూడా వచ్చి వెళ్తున్నారు. కానీ పరిస్థితులను చూసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శివారు ప్రాంతంలో ఉండడంతో బుద్ధవనం వద్దకు వెళ్లాలంటే కిలోమీటర్ల మేర నడివాల్సి వస్తోంది.

వర్షాకాలం అక్కడకు వెళ్లడం చాలా కష్టమే. ధూళికట్ట బుద్ధవనం మొత్తం భూమి 9 ఎకరాలు, బౌద్ధస్తూపం 19 గుంటలు ఆర్కియాలజీ డిపార్టమెంట్ పరిధిలో ఉంది. ఈ భూమి చాలా వరకూ అన్యాక్రాంతమైనట్లు స్థానికులు చెబుతున్నారు. వెంటనే సర్కార్ జోక్యం చేసుకొని బుద్ధవనం చుట్టూ బౌండరీలు నిర్ణయించాలని కోరుతున్నారు.

2018లోనే  గ్రీన్ సిగ్నల్

ధూళికట్ట సమీపంలోని బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేయడానికి 2018లోనే ప్రపోజల్స్ రెడీ చేశారు. ఆనాటి ప్రజాప్రతినిధులు, అధికారులు  స్థానిక ప్రజలతో కలిసి పరిసరాలను పరిశీలించారు. అభివృద్ధికి రూ. 5 కోట్లు మంజూరు చేయించనున్నట్లు తెలిపారు. శిథిలావస్థలో ఉన్న బౌద్ద స్థపాన్ని వెంటనే మరమ్మతు చేయడానికి రూ. 50 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఆనాడు చేసిన నిధుల మంజూరు ప్రకటన ఇప్పటికీ అలాగే ఉంది.