ఈ మధ్యకాలంలో నేచర్‌తో కాస్త సమయం గడిపేవాళ్లు తక్కువ ఉండొచ్చు. కానీ, నేచర్ అంటే ఇష్టం ఉండని వాళ్లు మాత్రం ఉండరు. అందుకే ప్రకృతి ప్రేమికులే కాదు.. ప్రతి ఒక్కరూ నేచర్‌ని కాపాడాలి.
‘‘పర్యావరణంలో జరిగే మార్పులు నాశనానికి దారితీయకుండా అడ్డుకోవాలి. ఇది మన అందరి బాధ్యత. అయినా కొంతమందే దీన్ని ఆచరిస్తుంటారు. కానీ, పర్యావరణ పరిరక్షణను ఆదమరిస్తే భవిష్యత్తులో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంతో నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేలుకోండి... పర్యావరణాన్ని రక్షించండి” అని స్వీట్, క్యూట్ వార్నింగ్ ఇస్తున్నాయి అనూకి క్యారెక్టర్స్.
అనూకి.. అంటే ఒకటి కాదు రెండు పాత్రలు. అందులో ఒకటి అమ్మాయి, మరొకటి అబ్బాయి. గ్రీన్‌ల్యాండ్, కెనడా, అమెరికాల్లోని ఆర్కిటిక్ ప్రాంతాల్లో నివసించే స్వదేశీ ప్రజల సమూహం (ఇన్యూట్స్) నుంచి ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్స్ ఇవి. పర్యావరణంలో జరిగే మార్పులు, వాటి వల్ల వచ్చే సమస్యలని తెలియజెప్పడానికే ఈ పాత్రలు క్రియేట్ చేశారు. పర్యావరణ మార్పుల కారణంగా మంచు కరిగిపోతుండడంతో భూమిని జాగ్రత్తగా చూసుకోవాలనే సంకల్పంతో వరల్డ్ మొత్తం ట్రావెల్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తుంటాయి.
గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఛేంజ్ వల్ల మొదట ఇబ్బందులు పడేది అక్కడి ప్రజలే. కాబట్టి ఆ విషయాన్ని ప్రపంచానికి చెప్పడానికి ఈ క్యారెక్టర్స్ ఎంటర్టైన్ చేస్తూ చెప్తాయి. ఎలాగంటే.. తెల్లని మంచుగడ్డను పోలినట్టు ఉండే రెండు క్యారెక్టర్స్ పాటలు పాడుతూ, డాన్స్ చేస్తూ మెసేజ్ ఇస్తాయి. అలాగే ఫ్రెండ్షిప్ గురించి స్టోరీలు కూడా చెప్తాయి. తద్వారా ఎన్విరాన్మెంట్ సమస్యలపై ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నిస్తాయి. అనూకి.. డిఫరెంట్ వెర్షన్లలో వస్తుంది. వాటి లోపల అమర్చిన లైటింగ్ వల్ల రాత్రిపూట మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
ఇంతకీ వీటిని క్రియేట్ చేసిన ఆర్టిస్ట్‌లు ఎవరంటే.. మొయెట్ బేటిల్, డేవిడ్ పాసెగాండ్ అనే ఫ్రెంచ్ డిజైనర్లు. వీళ్లిద్దరూ 2000లో ఇంటరాక్టివ్ డిజైన్ కంపెనీ ‘అనూకి’ని స్థాపించారు. మొయెట్, గ్రాఫిక్ డిజైనర్, డేవిడ్ యానిమేటర్ స్కిల్ ఉన్న డిజిటల్ హ్యాండీమాన్. వీళ్లు ఎకోల్ సుపీరియర్ డి డిజైన్ ఇండస్ట్రీ నుంచి డిగ్రీ పొందారు.
–వెలుగు, లైఫ్–