తుంగతుర్తి, వెలుగు : ప్రాణాలైనా అర్పిస్తాం.. సూర్యాపేట – జనగాం హైవేపై ఏర్పాటు చేసే అండర్ పాస్ ను అడ్డుకుంటామని అండర్ పాస్ నిర్మాణ వ్యతిరేక కమిటీ సభ్యులు అన్నారు. ఆదివారం తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని వంగపల్లి నర్సయ్య ఫంక్షన్ హాల్ లో కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అండర్ పాస్ నిర్మించడంతో తిరుమలగిరిలోని తెలంగాణ చౌరస్తాలో చిన్న చిన్న వ్యాపారం చేసుకునే ఎంతో మంది జీవితాలు అంధకారం అవుతాయన్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రం ఇప్పుడిప్పుడే వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో తెలంగాణ చౌరస్తాలోని హైవే రోడ్డుపై అండర్ పాస్ ఏర్పాటు చేయడంతో పాత గ్రామానికి ఎక్స్ రోడ్డుకు అడ్డు గోడ కట్టినట్లుగా ఉంటుందని తెలిపారు.
Also Read :- ఊట్కూరులో గుడి నిర్మాణానికి సహకరిస్తా
సూర్యాపేట_జనగాం, వలిగొండ_తొర్రూర్ రోడ్డుకు ఇరువైపులా ఎంతోమంది చిరు వ్యాపారులు జీవనం సాగిస్తున్నారని చెప్పారు. అండర్ పాస్ వేయడంతో చిరు వ్యాపారుల జీవితాలు నాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల అభిప్రాయం మేరకు అండర్ పాస్ ను రద్దు చేయాలని కోరారు. సమావేశంలో అఖిలపక్ష నాయకులు సతీశ్ కుమార్, మూల రవీందర్ రెడ్డి, బత్తుల శ్రీను, గుండా భాస్కర్, గజ్జల శేఖర్, కడెం లింగయ్య, కొత్తగట్టు మల్లయ్య, ఎస్.కొండల్ రెడ్డి, కందుకూరి సోమన్న, రాంబాబు, భాస్కర్, మధు, నాని, కందుకూరి ప్రవీణ్, మల్లేశ్ పాల్గొన్నారు.