మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టిన బీజేపీ : జి.చెన్నయ్య

  • సీఎంకు దళితులపై ప్రేమ ఉంటే రిజర్వేషన్లు పెంచాలి 
  • ఎస్సీ వీవీపీఎస్ ఆధ్వర్యంలో నల్లగొండలో భారీ ర్యాలీ 

నల్గొండ అర్బన్, వెలుగు : మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్పీ వర్గీకరణను తెరపైకి తీసుకొచ్చిందని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి.చెన్నయ్య, కో చైర్మన్ బాలకిషన్ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బస్సు యాత్ర సోమవారం నల్గొండకు చేరింది. ఈ సందర్భంగా సమితి నల్గొండ జిల్లా చైర్మన్ లకుమాల మధుబాబు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అంతకుముందు భాస్కర్ టాకీస్ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి భారీ ర్యాలీ తీశారు. 

టీఎన్జీవోస్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మాల మహానాడు మహాసభలో జిజ చెన్నయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దళితులపై ప్రేమ ఉంటే 15 శాతం ఉన్న రిజర్వేషన్లను 30 శాతానికి పెంచాలని, 2014 నుంచి ఎస్సీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. మాలలు అభివృద్ధి చెందాలంటే అంతా ఒకే తాటి పైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మాలల సంఖ్య తక్కువగా ఉందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 30 లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు.  ఎస్సీ వర్గీకరణ తీర్పును సుప్రీంకోర్టు పున: పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఎస్సీ డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేకపోయారో, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పాలని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో అవసరమే లేదని, ఇక్కడ ఎక్కువగా లబ్ధి పొందింది మాదిగలేనని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రుల ఉపసంఘాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం పనిచేసిన మందకృష్ణ మాటలు విని మాలలకు అన్యాయం చేయాలని చూస్తే సీఎంపై తిరుగుబాటు చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో మాల నేతలు తాళ్లపల్లి రవి, చెరుకు రాంచందర్, మేక వెంకన్న, బూర్గుల వెంకటేశ్వర్లు, గోపాజు రమేశ్, మంచాల లింగస్వామి, జి. శీను, నల్లాల కనకరాజు,తల్లమళ్ల హస్సేన్, జిల్లా కో– కన్వీనర్లు చింతపల్లి బాలకృష్ణ, ఉద్యోగ, మహిళా నేతలు పాల్గొన్నారు.