రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌‌ ఎదుట నిరసన

సిరిసిల్ల టౌన్, వెలుగు : ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ సోమవారం రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్‌‌ ఎదుట వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ తీర్పు సరికాదన్నారు. ఆర్టికల్ 341, 42 ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లలో మార్పు చేసేందుకు రాష్ట్రాలకు అధికారం లేదన్నారు. మార్పులు చేయాలంటే పార్లమెంట్‌‌లో బిల్లు పెట్టి ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందాలన్నారు. కేవలం రాజకీయ ఒత్తిళ్లతోనే ఈ తీర్పు వచ్చినట్లు తాము భావిస్తున్నామన్నారు. ఈ తీర్పును పున: సమీక్ష చేయాలని కోరారు. కార్యక్రమంలో పోరాట సమితి అధ్యక్షుడు రొడ్డ రాంచంద్రం, నీరాటి శ్రీనివాస్, మంగ్ కిరణ్, సత్యం  తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరణ తీర్పు బీజేపీ కుట్ర

గోదావరిఖని, వెలుగు : ఎస్సీ వర్గీకరణ తీర్పు బీజేపీ ప్రభుత్వ కుట్ర అని, వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 11, 12 తేదీల్లో ఢిల్లీ జంతర్​మంతర్​ వద్ద నిర్వహించనున్న ఆందోళనలో మాల, ఉపకులాలు వారు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలపాలని మాల మహానాడు ఆఫ్​ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్​ పసుల రాంమూర్తి పిలుపునిచ్చారు. సోమవారం గోదావరిఖనిలో ‘హలో మాల.. చలో ఢిల్లీ’ పోస్టర్‌‌‌‌ను ఆయన విడుదల చేశారు. జాతీయ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మగ్గిడి దీపక్ కుమార్​, రాష్ట్ర కార్యదర్శి గంట బబిత, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఆరే దేవకర్ణ, లీడర్లు ఎరుకల లక్ష్మణరావు, గాదం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.