మహబూబ్​నగర్ ఉమ్మడి జిల్లాలో మరో వెయ్యి కోట్లు మాఫీ

  • రెండో విడత రుణమాఫీ డబ్బులు మంజూరు
  • ఇప్పటివరకు 2,85,067  మంది రైతులకు లబ్ధి
  • మరో 15 రోజుల్లో రూ.2 లక్షలలోపు లోన్​లు మాఫీ

రైతు రుణమాఫీలో భాగంగా రెండో విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మంజూరు చేసింది. తొలి విడతలో జులై 18న రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేయగా, రూ.లక్షన్నర రుణాలకు సంబంధించి రెండు రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బులను సర్కారు జమ చేయనుంది. ఈ మేరకు లబ్ధిదారుల జాబితాను ఆయా జిల్లాల కలెక్టర్లు విడుదల చేశారు. 

మహబూబ్​నగర్​, వెలుగు:  రెండో విడత రైతు రుణమాఫీకి మహబూబ్​నగర్, నారాయణపేట, నాగర్​కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో మొత్తం 1,04,113 మంది రైతులను సర్కారు అర్హులుగా గుర్తించింది. వివిధ బ్యాంకుల ద్వారా 2018 డిసెంబర్​ నుంచి 2023 డిసెంబరు వరకు వీరు తీసుకున్న రూ.లక్షన్నర రుణాలు మొత్తం రూ.1,023 కోట్లు ఉండగా, వీటిని సర్కారు మంగళవారం మాఫీ చేసింది.

 సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి ఈ నిధులను అసెంబ్లీ ప్రాంగణం నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆయా కలెక్టరేట్లలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, పలువురు రైతులకు మాఫీ చెక్కులను అందజేశారు. అలాగే, రైతు వేదికల వద్ద బ్యాంకు, అగ్రికల్చర్​ఆఫీసర్లు రైతులతో సమావేశమై మాఫీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు.


రెండు విడతలు కలిపి రూ.2 వేల కోట్లు మాఫీ


ఈ నెల 18న రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష లోపు లోన్​లను మాఫీ చేసింది. ఇందులో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,80,954 కుటుంబాలు లబ్ధి పొందగా, రుణాల మొత్తం రూ.1,072.22 కోట్లను సర్కారు మాఫీ చేసింది. తాజాగా రెండో విడతలో 1,04,113 మంది రైతులకు గాను రూ.1,023 కోట్లు మాఫీ చేసింది. రెండు విడతల్లో కలుపుకొని ఉమ్మడి జిల్లాలో 2,85,067 లబ్ధి చేకూరగా, వీరు తీసుకున్న రూ.2,095.22 కోట్ల రుణాలను ఇప్పటివరకు క్లియర్​చేసినట్టైంది. 

రుణమాఫీ అస్త్రంగా స్థానిక ఎన్నికలకు..!

రైతు రుణమాఫీని ప్రకటనను సీఎం రేవంత్​ రెడ్డి తన సొంత జిల్లా పాలమూరు నుంచే ప్రకటించారు. ఇటీవల జరిగిన లోక్​సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్​15న నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన ప్రచార సభలో సీఎం పంద్రాగస్టులోపు రూ.2 లక్షల లోపు రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారం లోక్​సభ ఎన్నికల కోడ్​ ముగిసిన వెంటనే రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. ఈ మేరకు బ్యాంకర్లు, అగ్రికల్చర్​ ఆఫీసర్లు, మంత్రులతో పలుమార్లు సమావేశమై మాఫీకి సంబంధించిన గైడ్​లైన్స్​ రూపొందించారు.

మూడు విడతల్లో రూ.2 లక్షలలోపు రుణాలు మాఫీ చేసేందుకు నిర్ణయించారు. హామీ ఇచ్చిన మూడు నెలల్లోనే రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేసేందుకు సీఎం సీరియస్​గా వర్క్​ చేశారు. ఈ నెల 18న మొదటి విడత కింద రూ.లక్ష లోపు, మంగళవారం రెండో విడత కింద రూ.1.50 లక్షల లోపు లోన్​లను మాఫీ చేయగా.. పంద్రాగస్టు వరకు రూ.2 లక్షల లోన్​లు మాఫీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. మరో పదిహేను రోజుల్లో ఈ ప్రక్రియను మొత్తం పూర్తి చేసి, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. రుణమాఫీ అస్త్రంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను క్లీన్​ స్వీప్​ చేసేలా ప్లాన్​ చేస్తోంది.