బీఆర్ఎస్ కు మరో షాక్.. నిజామాబాద్ డీసీసీబీ హస్తగతం..

నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. డీసీసీబీ పీఠం హస్తగతం అయ్యింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. మొత్తం 20 మంది డైరెక్టర్లకు గాను భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా 17 మంది ఓట్ వేశారు. డైరెక్టర్ల చేత బల పరీక్ష నిరూపించుకోవడంలో విఫలం అయిన భాస్కర్ రెడ్డి చైర్మన్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే వైస్ చైర్మన్ రమేష్ రెడ్డికి ఇంఛార్జి చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు అధికారులు. 

భారీ బందోబస్తు నడుమ

బలపరీక్షలో నెగ్గడానికి చైర్మన్​ భాస్కర్​రెడ్డి డైరెక్టర్లను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించగా, ఆయనకు చిక్కకుండా మొత్తం 15 మంది ఒకేచోట క్యాంప్​లో ఉన్నారు. మొదట హైదరాబాద్​, తర్వాత గోవాకు మారారు. భాస్కర్​రెడ్డి పిటిషన్లను కొట్టేస్తూ కోర్టు తీర్పివ్వడంతో డైరెక్టర్ల టీం బుధవారం హైదరాబాద్​ చేరింది. మాజీ మంత్రి, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డిని ఆయన ఇంట్లో కలిసి నోకాన్ఫిడెన్స్​ మీటింగ్​లో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. ఉదయం 11 గంటలకు జరిగే మీటింగ్​కు అటెండయ్యేలా రాత్రే హైదరాబాద్​ నుంచి నిజామాబాద్​లోని ఒక హోటల్​కు చేరుకున్నారు. డైరెక్టర్ల సెక్యూరిటీ కోసం వారు ప్రయాణించే బస్సు నుంచి ఓటింగ్ కేంద్రం వరకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.