మరో మహమ్మారి ముంచుకొస్తున్నది

  •  ప్రపంచ దేశాలన్నీ ఎదుర్కోక తప్పదు
  • హెచ్చరించిన బ్రిటన్ సైంటిస్ట్ సర్ పాట్రిక్ వాలెన్స్ 
  • అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి
  • వ్యాక్సిన్లు, మెడికల్ ఎక్విప్​మెంట్లు రెడీ చేస్కోండి.. సమన్వయంతో ముందుకెళ్తేనే ఎదుర్కోగలం
  • డబ్ల్యూహెచ్​వో చొరవ తీసుకోవాలని సూచన

న్యూఢిల్లీ: కరోనా తరహాలో మరో మహమ్మారి ముంచుకొస్తున్నదని బ్రిటన్‌‌‌‌ ప్రభుత్వ మాజీ ప్రధాన సలహాదారు, సైంటిస్ట్ సర్‌‌‌‌ పాట్రిక్‌‌‌‌ వాలెన్స్‌‌‌‌ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ప్రతి ఒక్కరు దీన్ని ఎదుర్కోక తప్పదని అన్నారు. మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని అందరూ.. అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు. మహమ్మారిని ఎదుర్కొనే దానికే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. 

హే ఫెస్టివల్​కు హాజరైన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రపంచ దేశాలన్నీ భవిష్యత్తులో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మహమ్మారులను ముందుగానే గుర్తించేందుకు నిఘా వ్యవస్థ ఎంతో అవసరం. దాన్ని ప్రపంచ దేశాలన్నీ ఏర్పాటు చేసుకోవాలి. ర్యాపిడ్ రెస్పాన్స్ అనేది ఎంతో కీలకమని 2021లో జరిగిన జీ7 లీడర్ల భేటీలోనే నేను చెప్పాను.

 కానీ, 2023 నాటికి నా సూచనలను అన్ని దేశాలు మరిచిపోయాయి. కరోనా టైమ్​లోనే ప్రపంచ దేశాలకు భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయి. అదేతరహా సంక్షోభం మళ్లీ ఎదుర్కోవాల్సి ఉంటది. దీని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అప్పటి ఇబ్బందులు మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాలి’’అని పాట్రిక్ వాలెన్స్ సూచించారు. కాగా, కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇప్పటికీ వణికిస్తోంది. మొన్నటి దాకా వైరస్ వ్యాప్తిలేని దేశాల్లో ఇటీవల కేసులు పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

సైనికుల మాదిరి సిద్ధం కావాలి

మహమ్మారిని ధీటుగా ఎదుర్కొనేందుకు డయాగ్నోస్టిక్ సిస్టమ్, వ్యాక్సిన్​తో పాటు ట్రీట్​మెంట్​కు అవసరమైన ఎక్విప్​మెంట్​లు అన్ని సిద్ధంగా ఉంచుకోవాలని వాలెన్స్ సూచించారు. ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా, సమన్వయంతో ముందుకెళ్తేనే మహమ్మారిని నిరోధించగలమని చెప్పారు. మెడికల్ ఎమర్జెన్సీకి అవసరమైన ఎక్విప్​మెంట్​ అందరి దగ్గర ఉంటే..  లాక్‌‌‌‌డౌన్‌‌‌‌, సోషల్‌‌‌‌ డిస్టెన్స్‌‌‌‌ వంటి కఠిన చర్యల అవసరం ఉండదని సూచించారు. 

‘‘ఏదైనా ఆపద వస్తే సైనికులను ఎలా సన్నద్ధం చేసుకుంటామో.. రాబోయే మహమ్మారిని ఎదుర్కొనేందుకు కూడా అదే తరహాలో సంసిద్ధం కావాల్సిన అవసరం ఉంది. 2021, జీ7 లీడర్ల భేటీ సమయంలో నేను ఇచ్చిన సలహాలు పాటించాలి. యుద్ధానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో.. సంక్షోభం కట్టడి చర్యలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మహమ్మారిని ధీటుగా ఎదుర్కోవడంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్​వో) కూడా కీలక పాత్ర వహించాలి’’అని పాట్రిక్ సూచించారు.