సుంకిశాల ఘటన వెనుక మేఘా నిర్లక్ష్యం!

  • నాగార్జునసాగర్​కు వరద మొదలైనా ప్రాజెక్టు పనులు ఆపని కాంట్రాక్ట్​ సంస్థ
  • 3.5 లక్షల ఇన్​ఫ్లో వచ్చిన రోజే మిడిల్ ​టన్నెల్​ గేట్ ​ఫిక్సింగ్ ​పనులు 
  • రిజర్వాయర్ వైపు భారీగా మట్టి తొలగింపుతో మొదలైన లీకేజీలు
  • ఫలితంగా కుప్పకూలిన రిటైనింగ్​ వాల్​
  • 2022 లోనూ ఇలాగే రిటైనింగ్​​ వాల్ ​కూలి మునిగిన కన్నెపల్లి పంప్​హౌస్​
  • నాడు మోటార్లు తుక్కుతుక్కై రూ. వెయ్యి కోట్లకు పైగా నష్టం
  • అప్పట్లోనూ ఘటనను కప్పిపుచ్చేందుకు కంపెనీ విఫలయత్నం
  • వరుస ప్రమాదాలకు కారణమైన ఏజెన్సీకే పనులు అప్పజెప్పిన గత సర్కార్​

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్​ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్​ పక్కన నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు కుప్పకూలడం వెనుక కాంట్రాక్ట్ సంస్థ మేఘా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. సాగర్​ నుంచి సర్జ్​పూల్​లోకి నీటిని పంపేందుకు ఏర్పాటుచేసిన మూడు టన్నెళ్లలో ఒక టన్నెల్​ గేట్​ కొట్టుకుపోగా, ఆ వాటర్​ ప్రెజర్​కు తట్టుకోలేక  దాదాపు ఏడు అడుగుల మందం, 170 అడుగుల ఎత్తులోని కాంక్రీట్ గోడ (రిటైనింగ్​ వాల్) కూలిపోయింది. పనుల్లో నాణ్యత లోపమే ఈ ప్రమాదానికి కారణమని స్పష్టమవుతుండగా.. ఆగస్టు 2న జరిగిన ఈ ఘటనను కాంట్రాక్ట్​ సంస్థ కావాలనే కప్పిపుచ్చినట్లు తెలుస్తున్నది.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇదే మేఘా ఇంజినీరింగ్ ​కంపెనీ నిర్మించిన కన్నెపల్లి పంప్​హౌస్  2022 జులై 14న వచ్చిన గోదావరి వరదలకు నీట మునిగిన సంగతి తెలిసిందే. అప్పట్లోనూ ఇలాగే రిటైనింగ్ ​వాల్ ​కూలి మోటర్లపై పడడంతో సుమారు రూ. వెయ్యి కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. నాడూ ఘటనపై గోప్యత పాటించిన కాంట్రాక్ట్​ సంస్థ.. ఇప్పుడు కూడా అదే రూట్​ఎంచుకుంది.

ఇలా గత బీఆర్ఎస్​ హయాంలో మేఘా ఇంజినీరింగ్​ కంపెనీ చేపట్టిన నాసిరకం పనుల వల్ల పంప్​హౌస్​లతో పాటు పలు రిజర్వాయర్లు, కెనాల్స్ దెబ్బతిన్నప్పటికీ ఆ సంస్థపై నాటి సర్కార్​ కనీస చర్యలు తీసుకోలేదని, పైగా అదే కంపెనీకి మరిన్ని కీలక ప్రాజెక్టులను అప్పగిస్తూ వచ్చిందని  నీటిపారుదల రంగ నిపుణులు అంటున్నారు. 

సుంకిశాల సర్జ్​పూల్​  టన్నెళ్లకు గేట్లు బిగిస్తున్న టైంలోనే ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీ వరద రావడం ప్రారంభమైంది. శ్రీశైలం గేట్లు వదిలితే నాగార్జునసాగర్​లో నీటిమట్టం పెరుగుతుందన్న విషయం మేఘా ఇంజినీరింగ్​కంపెనీకి తెలిసినా రిటైనింగ్​ వాల్​ ఎత్తు పెంపు, టన్నెళ్ల​కు గేట్లు బిగించే పనులను ఆపలేదు. సైడ్ వాల్స్ , టై బీమ్స్​ కనెక్టివిటీని కాస్టింగ్ చేసే పనులు కూడా నడుస్తున్నాయి.

మరోవైపు రిజర్వాయర్  వైపున ఉన్న మట్టిని భారీగా తొలగించినట్లు తెలిసింది. జులై 29, 30, 31 తేదీల్లో మిడిల్ టన్నెల్ కోసం గేట్ ఫిక్సింగ్ పనులు చేపట్టారు. సరిగ్గా జులై 29న శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి సాగర్​కు నీటి విడుదల ప్రారంభించారు. క్రమంగా అన్ని గేట్లు ఎత్తడంతో నాగార్జునసాగర్ కు ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది.  దాదాపు 3.5 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో రావడంతో అకస్మాత్తుగా బ్యాక్ క్లోజ్ వేవ్ యాక్షన్ పెరిగి నీళ్లు టన్నెల్​లోకి వచ్చాయి. దీంతో టన్నెల్ గేటు ఒక్కసారిగా ధ్వంసమై.. సర్జ్​పూల్​లోని రిటైనింగ్​వాల్​కూలిపోయిందని సైట్​ ఇంజినీర్లు చెప్తున్నారు.

సర్జ్​పూల్​ రిటైనింగ్​వాల్స్ మొత్తం ఏడు అడుగుల మందమున్న బలమైన కాంక్రీట్​ నిర్మాణాలు. అలాంటి నిర్మాణం కుప్పకూలడం అంటే పనుల్లో క్వాలిటీ అంతంతే అన్న విషయం అర్థమవుతున్నదని సీనియర్ ఇంజినీర్లు అంటున్నారు. మరోవైపు ఆగస్టు 2న  ప్రమాదం జరిగితే వారం రోజుల పాటు ఈవిషయం బయటకు పొక్కకుండా గోప్యత పాటించిన కాంట్రాక్ట్​ సంస్థ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా గోడను మళ్లీ నిర్మించాలన్న ఆలోచనే ఇందుకు కారణమై ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   

రూ.1,500 కోట్ల పనులపై నీలినీడలు

సుంకిశాల పనులను 2021లో రూ.2,200 కోట్లకు మేఘా సంస్థ కాంట్రాక్టు దక్కించుకోగా.. ఇప్పటి వరకు రూ.1,500 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రస్తుత సీపేజ్​లను బట్టి  చూస్తే ఈ ప్రాజెక్టు భవిష్యత్​ఏమిటనేది అంతుచిక్కడం లేదు. కాగా, మోటార్లను బిగించకముందే రిటైనింగ్​వాల్​కుప్పకూలిన ఘటనపై ఇంజనీరింగ్​ ఉన్నతాధికారులతో  విచారణ కమిటీ వేసినట్టు గురువారం వాటర్​బోర్డు  ప్రకటించింది.  విచారణ కమిటీ సభ్యులుగా బోర్డు ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ ప్రవీణ్​కుమార్​, ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్​ను నియమించారు.

కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాంట్రాక్ట్​ సంస్థపై తగిన చర్యలు తీసుకుంటామని వాటర్​బోర్డు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ప్రస్తుత ప్రమాదం వల్ల రూ.25 కోట్ల మేర నష్టం జరిగిందని,  ఆ మొత్తాన్ని ఏజెన్సీ నుంచి రికవరీ చేసి రిటైనింగ్​వాల్, గేట్​ పునర్నిర్మాణ పనులను కాంట్రాక్ట్​ సంస్థతో చేయిస్తామని అంటున్నారు. కాగా, 2022 జులైలో కన్నెపల్లి పంప్​హౌస్​లో రిటైనింగ్​ వాల్  కూలి వెయ్యి కోట్ల నష్టం జరిగింది.

ఆ మొత్తాన్ని కాంట్రాక్ట్​ సంస్థ నుంచి రికవరీ చేయిస్తామని అప్పట్లో బీఆర్​ఎస్​ ప్రభుత్వ పెద్దలు చెప్పారు. కానీ ఆ మొత్తాన్ని కాంట్రాక్ట్​ సంస్థే భరించిందా? లేదంటే సర్కారే భరించిందా? అనే విషయంలో  క్లారిటీ లేదు. మరోవైపు నాగార్జునసాగర్​లో నీటిమట్టం పూర్తిస్థాయిలో పెరగకముందే సుంకిశాల సర్జ్​పూల్​లో సీపేజ్​లు ప్రారంభం కావడాన్ని బట్టి ఈ ప్రాజెక్టు భవిష్యత్​ప్రశ్నార్థకంగా మారిందని సీనియర్​ ఇంజినీర్లు  చెప్తున్నారు.

సీపేజ్​ల గురించి హెచ్చరించినా..

సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిన సంఘటనకు వారం రోజుల ముందు నుంచే  రిటైనింగ్​ వాల్​ నుంచి సీపేజ్​లు వస్తున్న విషయాన్ని కొందరు వర్కర్స్​ గుర్తించి, కంపెనీ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. కానీ, నివారణ చర్యలు తీసుకోవడంలో అటు కాంట్రాక్ట్​సంస్థ, ఇటు వాటర్​బోర్డు ఆఫీసర్లు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు ఉన్నాయి. జులై 31 తర్వాత వాటర్​ లీకేజీలు పెరగడంతో భయపడ్డ వర్కర్లు, సైట్​ ఇంజినీర్లు సర్జ్​పూల్​ వైపు వెళ్లలేదని సమాచారం. సంఘటన జరిగిన రోజు కూడా అక్కడ వర్కర్లు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని, లేదంటే చాలా మంది జలసమాధి అయ్యేవారని కొందరు అధికారులు తెలిపారు.

డిజైన్​ మారింది..ప్లేసూ మారింది..! 

అప్పటి బీఆర్ఎస్​ సర్కారు కాళేశ్వరం మాదిరిగానే సుంకిశాల డిజైన్​ను కూడా మార్చిందని ఓ సీనియర్​ ఆఫీసర్  వెల్లడించారు. సుంకిశాల ప్రాజెక్టు కోసం ముందుగా టాటా కన్సల్టెన్సీ సంస్థ (టీసీఎస్​) డిజైన్​ ఇచ్చింది. దాని ప్రకారం మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.1,200 కోట్లుగా అంచనా వేశారు. తర్వాత  నాటి ప్రభుత్వం టీసీఎస్​ డిజైన్​తో పాటు లొకేషన్​ను కూడా మార్చిందని సీనియర్​ ఆఫీసర్​ చెప్పారు. పనులు వాయిదా పడుతున్న కొద్దీ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ. 2,200 కోట్లకు నాడు ప్రభుత్వం పెంచుతూ పోయింది.

దీన్ని అప్పట్లో ప్రతిపక్ష నేతలతో పాటు బీఆర్ఎస్​కే చెందిన గుత్తా సుఖేందర్​రెడ్డి లాంటి నల్గొండ జిల్లా నేతలు కూడా తీవ్రంగా తప్పుపట్టారు. వెయ్యి కోట్లతో పూర్తయ్యి, గ్రావిటీతో నీళ్లొచ్చే ఎస్​ఎల్​బీసీని పక్కనపెట్టి కేవలం కమీషన్ల  కోసమే సుంకిశాలను చేపట్టారన్న విమర్శలు వెల్లువెత్తాయి. కానీ.. వీటిని నాటి ప్రభుత్వ పెద్దలు ఖాతరు చేయలేదు. ప్రాజెక్టు డిజైన్, ప్లేస్​ మార్చడం, ఎన్నికల కోసం ఆగమాగం పనులు చేపట్టడం వల్లే ప్రాజెక్టుకు ఈ పరిస్థితి వచ్చిందని నీటిపారుదల రంగ నిపుణులు అంటున్నారు.