6 వేలకు పైగా పోస్టులతో మరో డీఎస్సీ : డిప్యూటీ సీఎం భట్టి

  • వారంలో ప్రస్తుత డీఎస్సీ ఫలితాలు : డిప్యూటీ సీఎం భట్టి
  • సర్కారు విద్యాసంస్థలకు ఫ్రీ కరెంట్ ఇస్తామని వెల్లడి
  • పదేండ్లు ప్రమోషన్లు, బదిలీలు లేక టీచర్లు ఇబ్బందులు పడ్డారు
  • మేం 30 వేల మందికి ప్రమోషన్లు, 45 వేల మందికి బదిలీలు చేపట్టాం
  • విద్యారంగంలో ఏ సమస్యలున్నా పరిష్కరించేందుకు సిద్ధమని ప్రకటన
  • ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల సంఖ్య పెంచాలి : మంత్రి  పొన్నం
  • రవీంద్రభారతిలో ఘనంగా గురుపూజోత్సవం

హైదరాబాద్, వెలుగు : త్వరలో ఆరు వేలకు పైగా పోస్టులతో మరో డీఎస్సీని వేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ‘‘రాష్ట్రంలో టీచర్ల కొరతతో స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందకపోవడంతో మేం అధికారంలోకి రాగానే 11,062 టీచర్  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం. వారంలో ఆ డీఎస్సీ ఫలితాలు కూడా ఇవ్వబోతున్నాం” అని వెల్లడించారు. టీచర్ పోస్టుల భర్తీకి మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసిందని తెలిపారు. గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలోని సర్కారు విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు వెల్లడించారు. 

దీనికి సంబంధించిన జీవో 20ని సభలో చదివి వినిపించారు. సర్కారు నిర్ణయంతో రాష్ట్రంలోని 27,862 ప్రభుత్వ విద్యాసంస్థలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ‘‘ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం విద్యకు బడ్జెట్లో పెద్దపీట వేసింది. విద్య తో పాటు గురువులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. గత పదేండ్ల పాలనలో టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టీచర్ల ఆకాంక్షలను అర్థం చేసుకొని, 30 వేల మందికి ప్రమోషన్లు, 45 వేల మందికి బదిలీలు చేపట్టాం” అని ఆయన వివరించారు. 

విద్యారంగం సమస్యలు పరిష్కరిస్తం

టీచర్లతో పాటు విద్యారంగానికి సంబంధించిన సమస్యలేవీ ఉన్న పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. సర్కారు బడుల్లో వసతుల కల్పన కోసం అమ్మ ఆదర్శ కమిటీలను వేసి, వాటి ద్వారా రూ.667 కోట్లతో పనులు చేయించామని వెల్లడించారు. ‘‘బడుల్లో స్వీపర్లు లేకపోవడంతో స్కూళ్లను క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఈ ఏడాది శానిటైజేషన్ వర్క్స్ కోసం రూ.136 కోట్లు ఇచ్చాం. యూనివర్సిటీలకు గత సర్కార్​జీతాలకు సరిపడా బడ్జెట్ కూడా ఇవ్వలేదు. 

కానీ, ప్రజాప్రభుత్వం రాగానే రూ. 300 కోట్లు వసతుల కోసం కేటాయించాం. 63 ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చాం. ఇటీవల కొత్తగా స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం” అని ఆయన వివరించారు. ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ నిర్మాణం కావడానికి టీచర్ల పాత్ర కీలకంగా ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2007లో సర్కారు బడుల్లో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లిష్ మీడియం బోధన కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీచర్ల ప్రోత్సహించారని ఆయన అన్నారు. 

ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల సంఖ్య పెంచాలి :  పొన్నం  

టీచర్లు హక్కులతో పాటు బాధ్యతలూ నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రైవేటు బడుల్లో పిల్లల సంఖ్యరోజు రోజుకూ పెరుగుతున్నదని, సర్కారు బడుల్లో తగ్గుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రకాల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సర్కారు బడుల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు టీచర్లు కృషి చేయాలని కోరారు. అవార్డులు పొందిన టీచర్లను  స్ఫూర్తిగా తీసుకొని ఇతర టీచర్లు ముందుకు పోవాలన్నారు. గత పదేండ్లుగా విద్యావ్యవస్థకు సరైన న్యాయం  జరగలేదని తెలిపారు. 

తాము అధికారంలోకి రాగానే టీచర్ల సంఘాలతో చర్చించి, ప్రమోషన్లు బదిలీలు చేపట్టామని చెప్పారు. ఎన్నికల కోడ్ వస్తే ఇబ్బంది అవుతుందని రూ.1,100 కోట్లతో 25 వేల బడుల్లో ఫెసిలిటీస్ కల్పించామన్నారు. ఇక నుంచి  ప్రభుత్వ స్కూళ్లలో ప్రభుత్వమే విద్యుత్ బిల్లులు చెల్లిస్తుందని చెప్పారు. రాష్ట్రం స్కూల్ ఎడ్యుకేషన్ లో వెనుకబడి ఉందని..  నాస్, ఆసర్ రిపోర్టులు అవే చెప్తున్నాయని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. టీచర్లంతా మరింత కృషి చేసి తెలంగాణను టాప్ 10లో ఉండేలా చూడాలని ఆయన కోరారు.