- మెగా డీఎస్పీ ప్రకటించిన ప్రభుత్వం
- ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1107 పోస్టులు
కామారెడ్డి, వెలుగు : తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీచర్ పోస్టులు పెరిగాయి. గత సర్కారు ప్రకటించిన డీఎస్సీని రద్దు చేసి కొత్తగా మెగా డీఎస్సీని ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న 1,107 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గత నోటిఫికేషన్ లో ప్రకటించిన దాని కంటే ప్రస్తుతం 400 వరకు పోస్టులు పెరిగాయి. దీంతో బీఈడీ, టీటీసీ, తదితర కోర్సులు చదివిన అభ్యర్థులకు మేలు జరగనుంది.
ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ
మెగా డీఎస్సీ నిర్వహించి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్‌రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయటంతో పాటు, ప్రతి ఊరిలో ప్రభుత్వ బడి ఉండాలని ఆదేశించారు. మూత పడిన స్కూల్స్‌ను తిరిగి తెరిపించాలని సంబంధిత ఆఫీసర్లకు సూచించారు. గత ప్రభుత్వం తక్కువ పోస్టులతో డీఎస్సీకి నోటిఫికేషన్ జారీ చేయగా.. ఇచ్చిన మాట ప్రకారం.. ప్రభుత్వం పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌ను గురువారం రిలీజ్ చేసింది.
పరిస్థితి ఇది
కామారెడ్డి జిల్లాలో 1,011 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. మొత్తం టీచర్ పోస్టులు 4,938 కాగా ప్రస్తుతం 4,082 మంది పని చేస్తున్నారు. వివిధ విభాగాల్లో 856 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత ప్రభుత్వం రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టింది. స్టూడెంట్స్ తక్కువగా ఉన్న చోట, జీరో ఎన్రోల్మెంట్ ఉన్న స్కూల్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను తగ్గించారు. గత ప్రభుత్వం2023 సెప్టెంబర్‌లో ఇచ్చిన నోటిఫికేషన్లో జిల్లాలో 200 పోస్టులను మాత్రమే ఇచ్చారు. ఖాళీల సంఖ్య ఎక్కువగా ఉన్న నోటిఫికేషన్లో తక్కువగా ఇచ్చారనే విమర్శలు వచ్చాయి.
ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం పోస్టులు పెంచింది. నిజామాబాద్ జిల్లాలో 1,196 గవర్నమెంట్స్ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో 5,919 పోస్టులకుగాను 4,951 మంది టీచర్లు ఉన్నారు. 969 ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 601 పోస్టులు భర్తీ కానున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో బీఈడీ చదివిన వాళ్లు 15 వేల మంది, డీఈడీ వాళ్లు 6 వేల వరకు ఉన్నారు.
వీరంతా కొన్నేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. పలువురు కోచింగ్ కూడా తీసుకుని సిద్ధంగా ఉన్నారు. గత ప్రభుత్వ హాయాంలో డీఎస్సీ పడుతుందనే ఆశతో వేలాది మంది నిరుద్యోగులు కోచింగ్ లకు వెళ్లినప్పటికీ నోటిఫికేషన్ రాక నిరుత్సాహానికి గురయ్యారు.
ప్రస్తుతం భర్తీ అయ్యే పోస్టులు
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 601 పోస్టులు ఉన్నాయి. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు 124, లాంగ్వేజీ పండిట్లు 23, పీఈటీ 9, ఎస్జీటీ 403, స్పెషల్ స్కూల్ అసిస్టెంట్లు 11, స్పెషల్ ఎస్జీటీలు 31 పోస్టులు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 506 పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు 121, లాంగ్వేజ్ పండితులు 15, పీఈటీ 5, ఎస్జీటీ 318 , స్పెషల్ స్కూల్ అసిస్టెంట్లు 11, స్పెషల్ ఎస్జీటీలు 36 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లు హిందీ పండిత్ 5, మరాఠి 3, తెలుగు 6, ఉర్దూ 1, బయాలాజీ 16, ఇంగ్లీష్ 13, మ్యాథ్స్ 17, సోషల్ 40 ఉన్నాయి.