అన్నారం బ్యారేజ్​ వీక్​!..సీడబ్ల్యూపీఆర్ఎస్​ టెస్టుల్లో తేటతెల్లం

  • 21 గేట్ల వద్ద ప్యార్లల్​ సీస్మిక్​ వేవ్స్ టెస్ట్​లు
  • 16 గేట్ల వద్ద రాఫ్ట్​, సీకెంట్​ పైల్స్​ బలహీనమని నిర్ధారణ
  • ఐఎస్​ కోడ్స్​ సూచించిన ప్రమాణాలను అందుకోని నాణ్యత
  • ప్లెయిన్​ కాంక్రీట్, ఆర్​సీసీల క్వాలిటీ తీసికట్టుగా ఉందని వెల్లడి
  • గత ఆగస్టులో ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​కు రిపోర్ట్

హైదరాబాద్​, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్​లో భాగమైన అన్నారం బ్యారేజీ చాలా బలహీనంగా ఉన్నట్టు వెల్లడైంది. ఎంతో పటిష్టంగా నిర్మించాల్సిన బ్యారేజీని అత్యంత నాసిరకంగా నిర్మించినట్టు నిర్ధారణ అయింది. చాలా గేట్ల వద్ద రాఫ్ట్​, సీకెంట్​పైల్స్​(బ్యారేజీ పునాది)ను అత్యంత నాసిరకంగా నిర్మించినట్టు తేలింది. సెంట్రల్​ వాటర్​ అండ్​ పవర్​ రీసెర్చ్​ స్టేషన్​ (సీడబ్ల్యూపీఆర్ఎస్​) చేసిన స్టడీల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు బుంగలు పడడంతో నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) పలు జియో ఫిజికల్​, జియో టెక్నికల్​ ఇన్వెస్టిగేషన్స్​ చేయాలని సూచించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే పుణెకి చెందిన సీడబ్ల్యూపీఆర్​ఎస్​తో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద జియో ఫిజికల్​ టెస్టులు చేయించేందుకు అధికారులు నిర్ణయించారు.  అన్నారం బ్యారేజీ వద్ద జియో ఫిజికల్​ టెస్టులను చేయించారు. అందులో భాగంగా బ్యారేజీలోని 26 నుంచి 46వ నంబర్​ గేట్ల వరకు మొత్తం 21 గేట్ల వద్ద ప్యార్లల్​సీస్మిక్​ టెస్ట్​లను సీడబ్ల్యూపీఆర్ఎస్​ చేసింది. టెస్టులు చేసిన 21 గేట్లలో 16 గేట్ల వద్ద ప్లెయిన్​ కాంక్రీట్, ఆర్​సీసీ (ఇనుముతో పటిష్టపరిచిన కాంక్రీట్​)ని నాసిరకంగా తయారు చేసి రాఫ్ట్​లు, సీకెంట్​పైల్స్​ను నిర్మించినట్టు తేటతెల్లమైంది.

నిర్ధారించిన ప్రమాణాలకంటే ఆ 16 గేట్ల నాణ్యత తీసికట్టుగా ఉందని వెల్లడైంది. దానికి సంబంధించిన మధ్యంతర రిపోర్ట్​ను గత ఆగస్టులో ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​కు సీడబ్ల్యూపీఆర్ఎస్​ అందజేసింది. 35, 30, 32, 26,29, 34, 42, 27, 40, 44, 45, 46, 31, 38, 33, 43 గేట్ల వద్ద నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని, మిగతా గేట్ల వద్ద ఫర్వాలేదని రిపోర్ట్​లో పేర్కొన్నది.   

ఎంత ఎక్కువ వేగం ఉంటే అంత ఎక్కువ నాణ్యత

ప్యార్లల్​​సీస్మిక్​ టెస్టుల్లో ఐఎస్​ 516:2018 కోడ్స్​ ప్రకారం భూకంప తరంగాల వేగం ఎంత ఎక్కువుంటే ఆ నిర్మాణం అంత నాణ్యంగా ఉన్నట్టు సీడబ్ల్యూపీఆర్ఎస్​ చెబుతున్నది. వేగం తక్కువుంటే ఆ నిర్మాణం నాసిరకమైనదని స్పష్టం చేస్తున్నది. అన్నారం బ్యారేజీ విషయంలో టెస్టులు చేసిన 21 గేట్లలో నాలుగైదు గేట్లను మినహాయిస్తే మిగతా చోట్ల సీస్మిక్​ వేవ్స్​ వేగం చాలా తక్కువగా ఉన్నట్టు నిర్ధారణ అయింది. 16 గేట్ల వద్ద ఐఎస్​ 516:2018 కోడ్స్​కు అనుగుణంగా రిజల్ట్​ రాలేదని సీడబ్ల్యూపీఆర్ఎస్​ నివేదిక స్పష్టం చేసింది.

ప్లెయిన్​ కాంక్రీట్​తో పోలిస్తే ఐరన్​తో పటిష్టపరిచిన ఆర్​సీసీలో సీస్మిక్​ వేగం 1.2 నుంచి 1.9 రెట్లు ఎక్కువగా ఉంటుందని, దానికి కారణం ఆర్​సీసీలోని ఇనుములో తరంగాలు చాలా వేగంగా వెళ్తాయని, ఆర్​సీసీలో ఎంత ఎక్కువ ఇనుమును వాడితే అంత ఎక్కువ వేగంతో ఆ తరంగాలు ప్రయాణిస్తాయని సీడబ్ల్యూపీఆర్ఎస్​ చెబుతున్నది. ఇసుకలో అయితే ఆ తరంగాల వేగం చాలా తక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, అన్నారం బ్యారేజీలో ఇటు ప్లెయిన్​ కాంక్రీట్​తోపాటు ఆర్​సీసీలోనూ ఐఎస్​కోడ్స్​ నిర్ధారించిన ప్రమాణాల మేరకు సీస్మిక్​ వేగం లేదని నివేదికలో సీడబ్ల్యూపీఆర్​ఎస్​ నిర్ధారించింది. 

సీస్మిక్​ ప్యార్లల్​ టెస్ట్ అంటే?​

టెస్టులో భాగంగా బ్యారేజీ ఎగువన ప్రతి గేటు (వరద ప్రవాహం వెళ్లే వెంట్) కు సరిగ్గా మధ్యలో 11 మీటర్ల వెడల్పు, 9 నుంచి 13 మీటర్ల లోతుతో బోర్​ హోల్స్​ తవ్వుతారు. ఈ బోర్​హోల్స్​లోకి సీస్మిక్​ వేవ్స్​ (భూకంప తరంగాలు)ను శోషించుకుని రికార్డ్​ చేసే చానల్​ హైడ్రోఫోన్స్​ను పంపిస్తారు. ఆ భూకంప తరంగాలు, వాటి వేగాన్ని లెక్కించేందుకు సీస్మోగ్రాఫ్​తో హైడ్రోఫోన్స్​ను అనుసంధానిస్తారు. బ్యారేజీ దిగువన (గేట్ల ముందు భాగంలో) ఒక్కో గేటు వద్ద రాఫ్ట్​ మీద ఒక్కో మీటర్​ దూరంతో 17 పాయింట్లను మార్క్​ చేసి ఒక్కో పాయింట్​ దగ్గర సుత్తితో కొడతారు.

అక్కడ భూకంప తరంగాలు ఏర్పడి కింద తవ్విన బోర్​హోల్స్​ లోపల ఉన్న హైడ్రోఫోన్స్​ వరకు చేరుతాయి. తరంగాల వేగాన్ని సీస్మోగ్రాఫ్​ రిసీవ్​ చేసుకుని లెక్కిస్తుంది.  అన్నారం బ్యారేజీ విషయంలో బోర్​హోల్స్​ను గేటును బట్టి 9.6 మీటర్ల నుంచి 13 మీటర్ల లోతు వరకు తవ్వారు.  ఒక్కో గేటు వద్ద 17 భూకంప తరంగాల చొప్పున టెస్టులు చేసిన మొత్తం 21 గేట్ల వద్ద 4,284 భూకంప తరంగాల వేగాన్ని నిపుణులు లెక్కించారు. 


ఐఎస్​516:2018 కోడ్స్​ సూచించిన ప్రమాణాలు ఇవి

ప్లెయిన్​ కాంక్రీట్​ వద్ద వేగం         ఆర్​సీసీలో వేగం      కాంక్రీట్​ నాణ్యతా గ్రేడింగ్​
(మీటర్​/సెకన్​)                               (మీటర్​/సెకన్​)

4,400కుపైన                                     5,500కుపైన                      ఎక్స్​లెంట్​
3,750 నుంచి 4,400                         4,680 నుంచి 5,500             గుడ్​
3,000 నుంచి 3,750                         3,750 నుంచి 4,680             నాసిరకం
3,000 కన్నా తక్కువ                     3,750 కన్నా తక్కువ        అత్యంత నాసిరకం