ఖలిస్తానీలకు వ్యతిరేకంగా కెనడాలో ఒక్కటైన హిందువులు, సిక్కులు

  • ఖలిస్తానీలకు వ్యతిరేకంగా కెనడాలో ఒక్కటైన హిందువులు, సిక్కులు
  • ఆలయంపై దాడికి నిరసనగా భారీ ప్రదర్శన
  • సంఘీభావం తెలిపిన సిక్కులు, క్రిస్టియన్లు, యూదులు
  • హింసను పోలీసులు కావాలనే అడ్డుకోలేదని ఫైర్

టొరంటో: కెనడాలో హిందువులపై దాడులకు పాల్పడుతున్న ఖలిస్తానీలకు వ్యతిరేకంగా హిందువులు, సిక్కులు ఒక్కటయ్యారు. ఖలిస్తానీ దురాగతాలకు వ్యతిరేకంగా గళమెత్తారు. బ్రాంప్టన్​లో హిందూ సభ ఆలయంపై దాడికి నిరసనగా వేల సంఖ్యలో భారత సంతతి ప్రజలు సోమవారం భారీ ప్రదర్శన చేశారు. ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించారు. నార్త్  అమెరికాలో హిందువుల కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శనకు సిక్కులతో పాటు క్రిస్టియన్లు, యూదులు కూడా సంఘీభావం తెలిపారు. హిందూ సభ ఆలయంపై, ఆలయంలో హిందువులపై ఖలిస్తానీ సపోర్టర్లు దాడిచేస్తున్నా పీల్ పోలీసులు చూస్తూ ఊరుకున్నారని, హింసను ప్రోత్సహించారని ర్యాలీలో పాల్గొన్న హిందువులు, సిక్కులు తెలిపారు. పోలీసులు పక్షపాత ధోరణి చూపారని మండిపడ్డారు. గత కొద్దిరోజులుగా హిందువులపై జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో ట్రూడో సర్కారు ఘోరంగా విఫలమవుతోందని విమర్శించారు. సిక్కులు, ఖలిస్తానీలు వేరువేరని ఆందోళనకారులు తెలిపారు. హిందూ ఆలయంపై దాడి చేసింది ఖలిస్తానీలని, సిక్కులు కాదని చెప్పారు. నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ప్రముఖ కెనడియన్  జర్నలిస్టు డానియెల్  బార్డ మన్  మాట్లాడుతూ.. కెనడాలో ఇంత భారీ సంఖ్యలో హిందువులు రోడ్ల మీదకు రావడం ఇదే మొదటిసారి అని తెలిపారు. హిందూ సమాజంలో ఐక్యత వచ్చిందన్నారు. కెనడాలో హిందువులపై ఖలిస్తానీల అరాచకాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, వారు హద్దులు మీరుతున్నారని ఆయన చెప్పారు. ఆలయంపై దాడిని అడ్డుకోవడంలో పోలీసులు విఫలం అయ్యారని పేర్కొన్నారు.

ఖలిస్తానీ జెండా పట్టుకున్న పోలీసుపై సస్పెన్షన్

ఖలిస్తానీ మద్దతుదారులతో కలిసి బ్రాంప్టన్​లోని హిందూ దేవాలయంపై ఓ పోలీసు దాడి చేశాడు. వీడియోల ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేశారు.

ఖలిస్తానీలు, ట్రూడోకు వ్యతిరేకంగా..

ఖలిస్తానీలు, ట్రూడోకు వ్యతిరేకంగా హిందువులు, సిక్కులు తీర్మానం చేశారు. వాంకోవర్ లో ఖాల్సా దివాన్  సొసైటీ రాస్  స్ట్రీట్  గురుద్వారా సోమవారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి హిందువులు, సిక్కు సంఘాల నుంచి నేతలు, సభ్యులు హాజరయ్యారు. ఖలిస్తానీ గ్రూపులతో తాము ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. కెనడాలో 3 నుంచి 4 శాతం ఉన్న ఖలిస్తానీల నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరారు. ఖలిస్తానీలను అడ్డుకోకపోతే వారి భాషలోనే తాము మాట్లాడతామని ట్రూడో సర్కారును హెచ్చరించారు.