నాలుగు రంగుల్లో.. అంగన్వాడీ యూనిఫామ్స్

  • ఆరేండ్ల లోపు పిల్లలకు అందజేయనున్న  ప్రభుత్వం
  • ఈ ఏడాది నుంచే శ్రీకారం
  • ఇప్పటికే జిల్లాలకు చేరిన క్లాత్
  • మహిళా సంఘాలకు యూనిఫామ్స్ కుట్టు బాధ్యత 

నాలుగు వేర్వేరు రంగుల్లో అంగన్వాడీ పిల్లల యూనిఫామ్ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన క్లాత్ జిల్లాలకు చేరుకుంది. మహిళ సంఘాలు యూనిఫామ్స్​ను కుట్టి త్వరలో అందజేయనున్నారు.

సూర్యాపేట/యాదాద్రి, వెలుగు : అంగన్వాడీ కేంద్రాల్లోని ఆరేండ్లలోపు పిల్లలకు ఈ ఏడాది నుంచి యూనిఫామ్స్ అందించాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే విద్యతోపాటు పౌష్టికాహారం అందిస్తుండగా, తల్లిదండ్రులకు ఆర్థికంగా మరింత వెసులుబాటు అందించేలా యూనిఫామ్స్ ఇవ్వనున్నారు. తద్వారా ఎక్కువ మంది చిన్నారులు అంగన్వాడీల్లో చేరతారని ప్రభుత్వం భావిస్తోంది. 

నాలుగు వేర్వేరు రంగుల్లో యూనిఫామ్స్ రూపొందించి, ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున అందజేయనున్నారు. వీటి డిజైన్ నమూనాలను అన్ని జిల్లాలకు పంపించారు. ఒకే రకమైన యూనిఫామ్ పిల్లలకు అందజేస్తే.. వారిలో క్రమశిక్షణ ఏర్పడుతుందని, ఎలాంటి తారతమ్య బేధాలకు తావు లేకుండా, సమానత్వం పెంపొందే  అవకాశం కలుగుతుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచే ఇలా అలవాటు చేసేందుకే యూనిఫామ్ అందిస్తున్నట్లు పేర్కొంటున్నారు.

కుట్టు కూలీ రేట్లు ఇలా.. 

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇప్పటికే మహిళా శక్తి పేరుతో ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పిస్తోంది. ఇటీవల స్కూల్ యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పచెప్పడంతో.. గతంలో ఎన్నడూ లేని విధంగా స్కూల్స్ రీఓపెన్ రోజే విజయవంతంగా కుట్టి అందజేశారు. దీంతో అంగన్వాడీ యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను సైతం మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. స్కూల్ యూనిఫామ్స్ ఒక్కో జతకు ప్రభుత్వం రూ.75 చెల్లించగా, ఇప్పుడు అంగన్వాడీ యూనిఫామ్స్ కుట్టు కూలీ మగ పిల్లలకు రూ.80, ఆడపిల్లలకు యూనిఫామ్స్ కు రూ.60 చెల్లించనుంది.

 యూనిఫామ్స్ కట్టింగ్ కోసం ప్రత్యేకంగా మహిళా సంఘాలకు శిక్షణ అందించగా, వారికి కుట్టు మిషన్లను సైతం సర్కార్ అందిస్తోంది. ఇప్పటికే జిల్లాలకు యూనిఫామ్స్ క్లాత్ చేరగా, త్వరలో వాటిని మహిళా సంఘాలకు ఇవ్వనున్నారు.  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 18 ఐ‌‌‌‌సీడీఎస్ ప్రాజెక్టు కింద1,912 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 26,280 మంది చిన్నారులు (13,892 మంది బాయ్స్, 12,387 మంది గర్ల్స్) ఉన్నారు. 

జిల్లాకు యూనిఫామ్స్ క్లాత్

అంగన్వాడీ యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను ప్రభుత్వం మహిళా సంఘాలకు అప్పగించింది. జిల్లాకు యూనిఫామ్స్ క్లాత్ చేరాయి. త్వరలోనే కుట్టే పనిని ప్రారంభిస్తాం. 

మధుసూదన్ రాజు, డీ‌‌‌‌ఆర్‌‌‌‌డీ‌‌‌‌ఏ, పీడీ, సూర్యాపేట