ఆఫీసుల్లో ఐ ఫోన్లు మాత్రమే వాడండి.. ఆండ్రాయిడ్ వద్దు : మైక్రోసాఫ్ట్

ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకున్నది. చైనా దేశంలోని మైక్రోసాఫ్ట్ ఆఫీసుల్లో పని చేసే సిబ్బందికి సంచలన ఆదేశాలు ఇచ్చింది. అదేంటో తెలుసా.. ఆఫీసుల్లో ఎవరూ ఆండ్రాయిడ్ ఫోన్లు వాడొద్దు.. అందరూ ఐ ఫోన్లు మాత్రమే వాడండి.. పని కోసం ఉపయోగించే ఫోన్లు అన్నీ ఐ ఫోన్ల ద్వారానే చేయాలి అంటూ సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఉద్యోగులే కాదు.. ప్రపంచం షాక్ అయ్యింది. 

చైనాలోని అన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీసుల్లో పని చేసే ఉద్యోగులకు ఇలాంటి ఆదేశాలు రావటం వెనక కారణం లేకపోలేదు. చైనాలో గూగుల్, గూగుల్ ప్లే సేవలు లేవు. చైనా దేశం సొంత ప్లాట్ ఫాం ఉపయోగిస్తుంది. ఈ క్రమంలోనే ఆండ్రాయిస్ ఫోన్లు ఉపయోగించటం వల్ల డేటాకు ఏదైనా ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదనే ఉద్దేశంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికితోడు చైనాకి చెందిన షియోమి, హువాయ్ కంపెనీలు సొంత నెట్ వర్క్, సొంత బ్రౌజింగ్ ఫ్లాట్ ఫామ్స్ డెవలప్ చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ లాంటి సొంత ఆపరేటింగ్ ఫ్లాట్ ఫాం తయారీలో చైనా వేగంగా అడుగులు వేస్తుంది. 

ఇలాంటి పరిణామాల మధ్య మైక్రోసాఫ్ట్ ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ల వల్ల హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే భయంతోనే.. యాపిల్ ఐ ఫోన్ల ద్వారా లాగిన్ కావాలనే ఆదేశాలు ఇచ్చింది. ఎవరైనా ఆండ్రాయిస్ ఫోన్ల ద్వారా ఆఫీస్ వర్క్ కు లాగిన్ అవుతుంటే.. అలాంటి వారి కోసం ఐ ఫోన్ 15 వెర్షన్ ఫోన్లను కూడా అందుబాటులో ఉంచినట్లు సమాచారం. 

మైక్రోసాఫ్ట్ ఎదుర్కొంటున్న అనేక భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని చాలా మార్పులు చేస్తుందని.. అందులో భాగంగా చైనాలోని ఉద్యోగులకు ఇలాంటి ఆదేశాలు ఇచ్చినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏదిఏమైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ.. ఆండ్రాయిడ్ ఫోన్లు వాడొద్దు అని చెప్పటం ద్వారా.. ఇప్పుడు ఆండ్రాయిడ్ వెర్షన్ ఫోన్లు ఉపయోగిస్తున్న కస్టమర్లలో కొత్త అనుమానాలు రేకిత్తించింది.