నల్గొండ జిల్లా పెద్దవూర మండలం తుమ్మ చెట్టుకు దగ్గరలో అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీ కొన్నాయి. దీంతో బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పెద్దవూర పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. గాయాలైన వారిని అంబులెన్స్ లో సాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసీ బస్సులో 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో మరో ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలం నుండి బస్సు, టిప్పర్ ను క్రేన్ సాయంతో తొలగిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. బస్సు, టిప్పర్ మధ్యలో బెల్టు వేస్తున్న క్రమంలో టిప్పర్ వెనుకాల లోడర్ కూడా ఉండటంతో దాని హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో ఉన్నట్టుండి అది టిప్పర్ ను ఢీ కొట్టింది. దీంతో క్రేన్ డ్రైవర్.. బస్సు, టిప్పర్ మధ్యలో ఇరుకున్నాడు. గాయాలపాలైన క్రేన్ డ్రైవర్ ను కూడా సాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయాడు. మృతుడు బీహార్ కు చెందిన చౌరసియ విజయ్ కుమార్ అని నిర్ధారించారు పోలీసులు. పెద్దవూర మండలం సుంకిశాలలో మేఘా సంస్థ చేపట్టిన హైదరాబాద్ కు తాగునీటి ప్రాజెక్ట్ లో పని చేసే క్రేన్ డ్రైవర్ గా గుర్తించారు.