టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ వ్యవహారాల పై ఎంక్వైరీ షురూ!

  • సీసీఎల్ఏ ఆదేశాలతో స్పందించిన కలెక్టర్
  • ఆడిట్ ఆఫీసర్​గా డీసీవో సంజీవరెడ్డి 
  • 17 అంశాలపై రిపోర్టు  

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ వ్యవహారా లపై ఎంక్వయిరీ షురువైంది. సొసైటీలో జరుగుతున్న అక్రమాలపై బాధితులు టి.పోచయ్యతో పాటు మరికొందరు ఇటీవల సీసీఎల్ఏకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సీసీఎల్ఏ జిల్లా కలెక్టర్​ను నివేదిక కోరినట్టు సమాచారం. ఈ మేరకు కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్(డీసీవో) సంజీవరెడ్డిని ఆడిట్​నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్టు తెలిసింది. 

ఇదీ ఫిర్యాదు..

టీఎన్జీవో హౌసింగ్ సొసైటీకి నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 42 సర్వేనంబర్​లో 32 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. 2010లో సుమారు 350 మంది సభ్యులకు లక్కీ డ్రా ద్వారా ప్లాట్లు కేటాయించారు. అయితే ఈ భూమిని గతంలోనే ప్రభుత్వం తమకు అసైన్డ్ చేసిందని నస్పూర్​కు చెందిన పలువురు వివిధ కోర్టుల్లో కేసులు వేశారు. కొన్ని కేసులు క్లియర్ కావడం, కొంతమంది కాంప్రమైజ్ కావడంతో ఆ భూమిని సొసైటీ స్వాధీనం చేసుకొని సభ్యులకు ప్లాట్లు ఇచ్చింది. ఇంకా ఐదున్నర ఎకరాలపై కోర్టులో కేసు నడుస్తోంది.

ఫస్ట్ ఫేస్​లో ఇప్పటికే ఇండ్లు కట్టుకోగా, సెకండ్ ఫేస్​లో ఇష్టారీతిన ప్లాట్లు కేటాయిస్తున్నారని, 2010 లిస్టు ప్రకారం సీరియల్ నంబర్లు పాటించడం లేదని బాధితులు ఫిర్యాదు చేశారు. రూల్స్​కు విరుద్ధంగా రీడిజైన్, రీ అలైన్​మెంట్ చేసి ప్లాట్లు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. ఇల్లు కట్టుకోవడానికి బిల్డర్​తో అగ్రిమెంట్ చేసుకొని, రూ.5 లక్షలు చెల్లిస్తేనే ప్లాట్ ఇస్తున్నారని, డెవలప్​మెంట్ చార్జీలు, ఎన్వోసీల పేరిట రూ.1.30 లక్షలు వసూలు చేస్తున్నారని, ఫైనల్ పట్టా సర్టిఫికెట్లు లేకున్నా మున్సిపాలిటీ నుంచి ఇల్లీగల్​గా పర్మిషన్లు తెచ్చుకొని ఇండ్లు కట్టుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  

17 అంశాలపై రిపోర్టు

దాదాపు 17 అంశాలపై సీసీఎల్ఏ జిల్లా కలెక్టర్​ను రిపోర్టు అడిగిట్టు తెలిసింది.‘తెలంగాణ నాన్ గెజిటెట్ ఆఫీసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ’ రిజిస్ట్రేషన్ జెన్యూన్​గా జరిగిందా? సొసైటీ పవర్స్, ఫంక్షన్స్ ఏమిటి? కమిటీ కాలపపరిమితి ఎన్నేండ్లు? ఏ విధానంలో కొత్త మెంబర్స్ ఎన్​రోల్​మెంట్, తొలగింపు జరుగుతోంది? ప్రభుత్వం కేటాయించిన భూమిని ఏ పద్ధతిలో ప్లాట్లు చేశారు? ఏ ప్రమాణాల ప్రకారం మెంబర్స్​కు కేటాయిం చారు? ప్లాట్ నంబర్లు ఎందుకు మార్చుతున్నారు? సభ్యుల దగ్గర ఏవైనా ఫీజులు, చార్జీలు వసూలు చేస్తున్నారా? ఆ పైసలు వేటికి ఖర్చు చేశారు? బ్యాలెన్స్ ఎంతుంది? 1994 నుంచి ఇప్పటివరకు ఎన్నిసార్లు లబ్ధిదారుల లిస్టు మార్చారు? పదేపదే ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇప్పటివరకు ఎన్ని ఫేస్​లలో ఎంతమందికి ప్లాట్లు ఇచ్చారు? అందులో ఎవరైనా అనర్హులు ఉన్నారా? ఎంతమంది వారి ప్లాట్లను అమ్ముకున్నారు? వీటికి సంబంధించిన రికార్డులను టైమ్​ టు టైమ్​ఎవరు మెయింటెన్ చేస్తున్నారు? ప్లాట్లలో లబ్ధిదారులే ఇండ్లు కట్టుకుంటున్నారా? థర్డ్ పార్టీ ఇన్వాల్వ్​మెంట్ ఉందా? తదితర అంశాలపై నివేదిక కోరినట్టు సమాచారం. 

రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

 తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ మ్యాక్స్ చట్టాల కింద రిజిస్ట్రేషన్ జరిగింది. సంబంధిత రూల్స్ ఉల్లంఘించినట్లయితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. కలెక్టర్ ఆదేశాల మేరకు 17 అంశాలపై అడిట్ నిర్వహించి రిపోర్టు సమర్పిస్తా.  
- సంజీవరెడ్డి, జిల్లా కో ఆపరేటివ్ ఆఫీసర్