మ్యాజిక్​ నేర్పిస్తాం!..ఊరు పేరు తెలియదు.. సోషల్​ మీడియాలో వైరల్

మాయాబజార్​ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఘటోత్కచుడు మాయలు చేసే సీన్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నోరు తెరవగానే లడ్డూలు ఒక్కొక్కటిగా నోట్లోకి వెళ్తుంటాయి. వస్తువులను తాకకుండానే ఒకచోట నుంచి మరో చోటికి కదులుతాయి. అలాంటి విద్యలు ఇండియాలోనే కాదు.. అమెరికాలోనూ ఉన్నాయట. అమెరికాలో ఉంటున్న ఈ జంట చేసేది కూడా సరిగ్గా అలాంటి మాయాజాలమే. ఈ జంట అలాంటి మ్యాజిక్​ని ప్రదర్శించడమే కాదు. అందరికీ నేర్పిస్తామని కూడా చెప్తోంది. 

భౌతిక సంబంధం లేకుండా వస్తువులను కదిలించే పవర్​ని ‘టెలికినిసిస్’ అంటారు. అసలు టెలికినిసిస్​ సాధ్యం అవుతుందా? లేదా? అనేదానిమీదే ఎన్నో వాదనలు ఉన్నాయి. అలాంటి మ్యాజిక్స్​ పురాణాల్లో తప్ప నిజ జీవితంలో ఎక్కడా కనిపించవు. కానీ.. ఆ విద్య తమకు తెలుసని చెప్తున్నారు ఈ దంపతులు. అంతేకాదు.. ఆ స్కిల్​తో వాతావరణంలో కూడా మార్పులు తీసుకురావొచ్చు అంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తున్నారు. ‘బ్రీజ్​ ది క్రియేటివ్’​ అనే ఎక్స్​ అకౌంట్​లో వాళ్లు పోస్ట్​ చేసిన వీడియోల్లో.. చేతులతో తాకకుండానే సిల్వర్​ ఫాయిల్​ని కదిలించారు. అంతేకాదు.. గాలిని సృష్టించి దాంతో చెట్టు కొమ్మలు ఊగేటట్టు చేశారు. 

ఇదంతా చూసినవాళ్లు దీన్ని నమ్మాలా? వద్దా? అనే అయోమయంలో ఉన్నారు. పైగా వాళ్లు ఆ విద్యను కోర్సుల ద్వారా అందరికీ నేర్పిస్తాం అంటున్నారు. కాకపోతే.. అందుకోసం కొంత డబ్బు కట్టాలి. ప్రస్తుతం రకరకాల సబ్‌స్క్రిప్షన్స్​ అందుబాటులో ఉన్నాయి.  22.22 డాలర్ల(దాదాపు రూ. 1,800) నుంచి మొదలవుతాయి. ‘మ్యాజిక్​ మెడిటేషన్, సైకిక్​ ఎబిలిటీస్​’ లాంటి పేర్లతో కోర్సులు అందిస్తున్నారు. వాటిలో ప్రీమియం కోర్స్​ “స్కూల్ ఆఫ్ ఎయిర్‌బెండింగ్”కు నెలకు 111.11 డాలర్లు (సుమారు రూ. 9,000) వసూలు చేస్తున్నారు. 

ఊరు పేరు తెలియదు

సోషల్​ మీడియాలో వాళ్లు పెట్టిన పోస్ట్​లకు లైక్​లు, షేర్లు బాగానే వస్తున్నా.. వాళ్లను విమార్శించేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. అసలు సాధ్యం కాని మ్యాజిక్​లు నేర్పిస్తామని చెప్పి డబ్బులు లాగుతున్నారని ఆరోపిస్తున్నారు. ఎందుకంటే.. ప్రపంచంలో అలాంటి విద్యలను ఇప్పటివరకు ఎవరూ నిరూపించలేకపోయారు. అలాంటిది వీళ్లు ఏకంగా ఆన్​లైన్​ ఇనిస్టిట్యూట్​ పెట్టి నేర్పిస్తాం అంటున్నారు. ‘వాళ్లను నమ్మి కోర్స్​ల సబ్​స్క్రిప్షన్​ తీసుకుంటే.. మోసపోయినట్టే’ అంటున్నారు నెటిజన్లు.