మూడ్రోజులుగా థాయ్​లాండ్​లోనే ప్యాసింజర్లు

న్యూఢిల్లీ: ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం థాయ్​లాండ్​లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. టెక్నికల్ సమస్యల కారణంగా ప్లేన్​ను అక్కడే నిలిపి ఉంచారు. దీంతో అందులో ప్రయాణిస్తున్న 100 మందికిపైగా ప్యాసింజర్లు మూడ్రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నవంబర్ 16న రాత్రి బయల్దేరాల్సిన ఈ విమానం 6 గంటల ఆలస్యంగా 17న ఉదయం టేకాఫ్ అయిందని ప్యాసింజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆపై కొద్ది గంటల్లోనే టెక్నికల్ సమస్యలంటూ ఎమర్జెన్సీగా థాయ్​లోని పుకెట్​లో దించేశారని పేర్కొన్నారు. 

సమస్యేంటో వాళ్లకు అర్థంకాక తాము ఇక్కడ 80 గంటలుగా ఎదురుచూస్తున్నామన్నారు. ‘‘16న రాత్రి 6 గంటలు ఆలస్యంగా విమానం రెడీ అయింది. ప్యాసింజర్లంతా కూర్చుని గంటయ్యాక ఏదో సమస్య అని చెప్పి దించేశారు. సాల్వ్ అయ్యాక టేకాఫ్ అయింది. రెండు గంటల్లోనే ఎమర్జెన్సీగా పుకెట్​లో ల్యాండ్ చేశారు. మూడ్రోజులుగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇక్కడ అవస్థలు పడుతున్నారు” అని ప్యాసింజర్లు సోషల్ మీడియాలో తెలిపారు. అయితే, వాళ్లందరికీ బస ఏర్పాటు చేశామని, కొందరిని ఇతర విమానాల్లో తరలించామని ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించాయి. ఇంకో 40 మందిని తరలించాల్సి ఉందన్నాయి. ప్యాసింజర్లకు టికెట్ డబ్బులు వాపస్ చేస్తామన్నాయి.