శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) మధ్య సీట్ల పంపకాలపై ఒప్పందం కుదిరింది. జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఎన్సీ 51స్థానాల్లో, కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేస్తాయని జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ యూనిట్ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా సోమవారం వెల్లడించారు. మరో ఐదు స్థానాల్లో కాంగ్రెస్, ఎన్సీ మధ్య స్నేహపూర్వకమైన పోటీ ఉంటుందని తెలిపారు.
మిగతా రెండు స్థానాల్లో సీపీఐ, పాంథర్స్ పార్టీ అభ్యర్థులు పోటీచేస్తారని వివరించారు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీ మధ్య పొత్తు ఖరారైంది. ఈ క్రమంలోనే సీట్ల పంపకాలపై చర్చ సందర్భంగా ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. దీన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, సల్మాన్ ఖుర్షీద్ రంగంలోకి దిగారు. సోమవారం ఈ నేతలు ఒమర్ అబ్దుల్లాను కలిసి చర్చించారు. దీంతో రెండు పార్టీల మధ్య విభేదాలు తొలిగిపోయాయి. సీట్ల పంపకంపై క్లారిటీ వచ్చింది.