చిరుధాన్యాలతో వృద్ధాప్యంలో మతిమరుపు తగ్గుముఖం

ఆధునిక కాలంలో ఆరోగ్యం విషయంలో శ్రద్ధ లేకుండా పోతోంది. దొరికింది తిని  పొట్ట  నింపుకుని ఆ తర్వాత వచ్చే  అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు నానాటికీ పెరుగుతున్నారు. తీరికలేని జీవితం ఉరుకుల పరుగులమయంగా ఉంటోంది. పురుగు మందు అవశేషాలు లేని ఉత్పత్తులు కనిపించే చోటు కోసం  కాగడా పెట్టి  వెతకాల్సి వస్తోంది. తినే తిండి గురించి కూడా పట్టుమని పది నిమిషాలు ఆలోచించలేని పరిస్థితుల్లో ఉన్నాం. అందుకే ఇన్ని అనారోగ్య లక్షణాలు చుట్టుముడుతున్నాయి. ఆస్పత్రుల చుట్టూ తిరిగి విలువైన కాలాన్ని వృథా చేసుకుంటున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి.  


దేశంలో  అధికశాతం  ఊబకాయంతో  బాధపడుతున్న వేళ ఆహారంలో  కార్బోహైడ్రేట్లను తగ్గించాలని డైటీషియన్లు చెబుతున్నారు. ఆహారంలో చిరుధాన్యాలను చేర్చడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందటమే కాకుండా  రోగ కారకాలు సైతం తొలగిపోతాయని చెబుతూ ఉంటారు.  ప్రపంచంలో  సజ్జల తర్వాత ఎక్కువగా సాగు అవుతూ ప్రజలు అత్యధికంగా తినే చిరుధాన్యాల్లో  కొర్రలది  రెండో స్థానంగా ఉంది.  వృద్ధాప్యంలో అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల తీవ్రతను తగ్గించే గుణం కొర్రలకు ఉంది. అలాగే ఎముకల  బలానికి  కొర్రలు లేదా అండుకొర్రల ఆహారం ఎంతో మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాస్తవం చెప్పుకోవాలంటే  ప్రకృతి ప్రసాదించిన చిరు ధాన్యాలు ఆరోగ్యానికి సిరి ధాన్యాలు. 

Also Read : కొరలతో రోగ నిరోధక శక్తి, నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావం