సక్సెస్ : ఆ అమ్మల కథ విజేతను చేసింది

అమ్మ గొప్పదనం చెప్పేందుకు ఒక కథ, కవిత, పాట సరిపోదు. మరి అలాంటి అమ్మ గురించి ఎంత చెప్పినా.. తక్కువే. అయితే.. ఇప్పటికే అమ్మ గొప్పదనాన్ని తెలిపేలా కవులు ఎంతో వర్ణించారు. రచయితలు పాటలు, కథకులు భిన్న కోణాల్లో కథలు రాశారు. ఇలా అమ్మ గొప్పదనాన్ని ప్రపంచానికి కోటాను కోట్ల రీతుల్లో తెలియజేశారు. వాటిలో వేటికవి వాటి ప్రత్యేకత చాటుకున్నాయి. ఇప్పుడు అదే కోవలోకి ఒక అమ్మాయి చేరింది. పేరు సంజనా ఠాకూర్. ముంబయికి చెందిన 26 ఏండ్ల ఈ అమ్మాయి అమ్మ మీద తనకున్న ప్రేమను కలంలో నింపి, అక్షరాలుగా మలిచింది. తనదైన ఆలోచనలతో మనసును హత్తుకునేలా ఓ కథ రాసింది. ఆ కథతో ఎందరో మనసుల్ని గెలిచింది. అంతేనా ప్రపంచం గర్వించే కామన్వెల్త్​ షార్ట్​స్టోరీ ప్రైజ్ అందుకుంది.

స్కూల్లో చదువుకునే రోజుల్లో సంజన చేసే ఒక తుంటరి పని వల్ల టీచర్లకు బాగా కోపం వచ్చేదట. బాగా తిట్టాలనుకునేవారట. కానీ ఏమీ అనలేకపోయేవారట!  అదేంటది సంజన వాళ్లది బాగా  పలుకుబడి ఉన్న ఫ్యామిలీనా? అనుకుంటే పొరపాటు. సంజన బాగా చదివేది. అందుకే ఆమె చేసే తుంటరి పని గురించి ఏమీ అనలేకపోయేవాళ్లు ఆ టీచర్లు. ఇంతకీ ‘ఏంటా తుంటరి పని’ అంటే.. టీచర్లు క్లాస్ చెప్తోంటే.. క్లాస్ వినకుండా టేబుల్ కింద కూర్చుని కథల పుస్తకం చదువుకునేది సంజన. దాంతో టీచర్లు సంజన పేరెంట్స్​కి కంప్లయింట్​ ఎలా చేసేవాళ్లో తెలుసా?

‘‘మీ అమ్మాయి బాగా చదువుతుంది. హోమ్‌‌ వర్క్‌‌ చేస్తుంది. కాని క్లాస్‌‌ చెప్పేటప్పుడు మాత్రం టేబుల్‌‌ కింద కూర్చుని కథల పుస్తకం చదువుతుంది’’ అని చెప్పేవాళ్లు. టీచర్లు కొడతారనే భయం కూడా లేకుండా చిన్న వయసులో అలా ఎందుకు చేసేదంటే.. పుస్తకాలంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం ఉండడం వల్ల. అంతేకాదు.. వాళ్ల ఫ్యామిలీతో కలిసి ఫంక్షన్లకు, పార్టీలకు వెళ్లినా కథల పుస్తకం వెంటబెట్టుకునే వెళ్లేదట.

 అంతలా సంజన కథల మీద ప్రేమ చూపించడానికి కారణం వాళ్ల అమ్మ.  చిన్నప్పట్నించీ ప్రతిరోజూ పుస్తకాల్లో కథలు చదివి వినిపించేది సంజన తల్లి. అలా కథల మీద బాగా ఇష్టం పెరిగిపోయింది. సంజన తాతయ్య కూడా కథలు చెప్తూ, రాయమని ప్రోత్సహించేవాడట. ఆ ప్రభావం కూడా ఆమెపై చాలా ఉందంటుంది సంజన. అయితే.. ఆ కథల పుస్తకాలు చదివే సంజన కథ అంతటితో ఆగిపోలేదు. కథలు చదవడం నుంచి రాయడం వరకు..మామూలుగానే పిల్లల్లో ఊహాశక్తి ఎక్కువ ఉంటుంది. కథలు చెప్తుంటే వాళ్లు దాన్ని తమ ఆలోచనల్లో ఊహించుకుంటుంటారు.

అదే సంజన లాంటి వాళ్లయితే బోలెడన్ని కథలు విన్న అనుభవంతో కథ రాయాలనుకుంటారు. సంజన కూడా అదే చేసింది.. చిన్నప్పుడే కథలు రాయడం మొదలుపెట్టింది. వెల్లెస్లీ కాలేజీ నుంచి ఇంగ్లిష్, ఆంత్రోపాలజీ డిగ్రీ చేసింది సంజన. ప్రస్తుతం టెక్సాస్​ యూనివర్సిటీలో ఎం.ఎఫ్​.ఎ. ఫిక్షన్​ చదువుతోంది. ‘కథల మీద ఉన్న మక్కువే నన్ను కథలు రాసేలా ప్రోత్సహించింది’ అంటుంది సంజన. ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘కామన్వెల్త్‌‌ షార్ట్‌‌ స్టోరీ ప్రైజ్‌‌’  కాంపిటీషన్​లో 2024 సంవత్సరానికి ఓవరాల్​ విన్నర్​గా నిలిచింది. ఈ పోటీల్లో ఐదుగురు రీజియనల్​ విన్నర్స్​ రాసిన కథలు ఆన్​లైన్ లిటరరీ మ్యాగజైన్​ గ్రాంటాలో ​ప్రచురిస్తారు.

ఫైనల్ విన్నర్

యువ రచయితలను ప్రోత్సహించేందుకు కామన్వెల్త్‌‌ ఫౌండేషన్‌‌ ఏటా కథల పోటీ నిర్వహిస్తుంటుంది. పద్దెనిమిదేండ్లు పైబడిన వాళ్లు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. ఇంగ్లిష్‌‌లో లేదా ఇంగ్లిష్‌‌లో అనువాదమైన స్థానికభాషల కథలను ఈ కాంపిటీషన్​కి పంపొచ్చు. పంపే కథ 2500 పదాల నుంచి 5000 పదాల వరకు ఉండాలి. ఆఫ్రికా, ఆసియా, కెనడా–యూరప్, పసిఫిక్‌‌ వంటి ఐదు రీజియన్లకు ఐదుగురు రీజనల్‌‌ విన్నర్స్‌‌ను ప్రకటిస్తారు.

వాళ్ల నుంచి ఫైనల్​ విన్నర్‌‌గా ఒకరిని ఎంపిక చేస్తారు. 2024కు ఆసియా రీజనల్‌‌ విన్నర్‌‌గా నిలిచిన సంజనా ఠాకూర్‌‌ ఓవరాల్‌‌ విన్నర్‌‌ కూడా అయింది. అందుకుగానూ 5.26 లక్షల (5000 పౌండ్లు) ప్రైజ్​మనీ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 7,359 మంది ఈ పోటీలో పాల్గొంటే సంజన మొదటి బహుమతి అందుకుంది. సంజనను విజేతగా నిలిపిన ఆ కథ వివరాల్లోకి వెళ్తే...

కథ పేరు ఐశ్వర్యరాయ్!

‘‘అన్వి అనే అమ్మాయి ఒక వృద్ధాశ్రమానికి వెళ్లి ఒక తల్లిని దత్తత తీసుకోవాలి అనుకుంటుంది. కాని ఒక్కో అమ్మ ఒక్కో లక్షణంలో గొప్పగా కనిపిస్తుంది ఆమెకు. ఏ అమ్మ సౌందర్యమైనా అనుబంధంలోనే తెలుస్తుంది. అలా చూస్తే ప్రతి అమ్మా ఐశ్వర్యరాయ్‌‌ అంత అందమైనదే” అనేది ఆ కథ సారాంశం. బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ పేరును ఇన్​స్పిరేషన్​గా తీసుకుని కథకు ‘ఐశ్వర్యరాయ్’​ అని పేరు పెట్టింది. అందులోని ముఖ్యపాత్రతో పాటు 150 మంది తల్లుల పాత్రల్ని క్రియేట్ చేసింది. వాళ్లలో ఒక్కో తల్లి తన తల్లి అయితే ఎలా ఉంటుంది? అనేది ఊహించుకుంటుంది.

అలా ఒక ఊహలో తన తల్లి ఐశ్వర్యరాయ్​లా అందంగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటుంది. వ్యంగ్యంగా, చమత్కారంగా షార్ట్​ స్టోరీల్లా రాసింది. ఐశ్వర్యరాయ్​ కథ ‘గ్రాంటా’ అనే పత్రికలో కూడా పబ్లిష్​ అయింది. ప్రస్తుతం మనదేశంలో సిటీ కల్చర్​ ఇళ్లల్లో అమ్మకు చోటు లేకుండా చేస్తోంది. దాంతో ఆ తల్లి వృద్ధాశ్రమంలో తలదాచుకునే పరిస్థితి వస్తోంది. అందుకే అదే అంశాన్ని కలంతో ప్రశ్నించాలనుకుంది. ఆ ఆలోచనతో కథ రాయడం మొదలుపెట్టింది సంజన.

పదేండ్లు విదేశాల్లోనే..

కథల పోటీల్లో కామన్వెల్త్​ ప్రైజ్ గెలుచుకున్న మూడో భారతీయురాలు సంజన. 2012లో ఈ ప్రైజ్ ఇవ్వడం మొదలైంది. 2016లో పరాశర్ కులకర్ణి, 2020లో కార్తీక పాండేలు ఈ ప్రైజ్ గెలుచుకున్నారు. ‘‘ఈ ప్రైజ్ నాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. నా 26 ఏండ్ల జీవితంలో పదేండ్లు విదేశాల్లోనే ఉన్నా. పదిహేనేండ్ల వయసులో మా ఫ్యామిలీ దుబాయి​కి షిఫ్ట్​ అయింది. కొన్నాళ్ల తర్వాత పై చదువుల కోసం దుబాయి నుంచి అమెరికా వెళ్లా. అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశా. కొవిడ్​ కారణంగా తిరిగి సొంతూరు ముంబయికి వచ్చి, ఆ తరువాత మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లా.  ముంబయిలో పుట్టి పెరిగిన నేను నా చుట్టూ ఉన్న వ్యక్తులు, వాళ్ల ప్రవర్తన, జరిగే సంఘటనలను పరిశీలించేదాన్ని.

అలా సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి చక్కటి అవగాహన కలిగింది. అలాగే సమ్మర్, వింటర్ సెలవుల టైంలో ముంబయి వచ్చివెళ్లేదాన్ని. అయితే కొవిడ్ టైంలో వచ్చినప్పుడు లాక్​డౌన్​లో కూడా ఇక్కడి పరిస్థితులన్నీ గమనించా. గమనించిన పరిస్థితుల నుంచి పుట్టిన ఊహల్ని కథలుగా మలుస్తా. అలా పుట్టిన కథే ‘ఐశ్వర్యరాయ్’. నా కథల్లో ముంబయి లైఫ్​ స్టయిల్ కనిపిస్తుంది. అయితే నేను రాసిన కథ ఇండియన్స్​నే కాకుండా విదేశీయులను అట్రాక్ట్ చేయడం గొప్ప విషయం.   

అన్ని కథల్లోనూ అమ్మే!

ఎం.ఎఫ్.​ఎ.లో మూడేండ్లుగా థీసిస్​ రాస్తున్నా. అయితే, మొదటి ఏడాది ఇన్నిన్ని పేజీలు థీసిస్ ఎలా రాస్తారు? అని చాలా చిరాకుగా అనిపించింది. రాసిన వాటిని మళ్లీ రివ్యూ చేసుకోవాలి. అలా చేసుకోవడం కుదరకపోతే ఆఖరి నిమిషంలో రాసిన థీసిస్​ని ఎవరికైనా ఇచ్చి ‘ఎలా ఉందో చెప్పమ’ని అడిగేంత టైం ఉండదు. అందుకే రాసిన వాటిని నా రూమ్మేట్స్​కి ఇచ్చి టైం దొరికినప్పుడు చదవమని అడిగేదాన్ని. వాళ్లు క్రియేటివ్ రంగం వైపు లేకపోయినా కూడా చాలా తెలివిగలవాళ్లు. నేను రాసింది చదివి వాళ్లు ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడ్డాయి.

అలా ఈ థీసిస్ కోసం.. ఇప్పటికే పదిహేను కథలు  రాశా. అందులో అన్ని కథల్లోనూ అమ్మా కూతుళ్లు కనిపిస్తారు. వాళ్ల భిన్న భావోద్వేగాలు చర్చకు వస్తాయి. ఈ కథను ప్రత్యేకించి పోటీ కోసం రాయలేదు. థీసిస్‌‌లో భాగంగా కథలు రాశా. వాటిని కాలేజీలో సబ్మిట్‌‌ చేశాక పుస్తకంగా తెస్తా. ఇండియన్​ రచయితల్లో అరుంధతి రాయ్‌‌ రైటింగ్​ స్టయిల్​ నాకు బాగా నచ్చుతుంది. నాక్కూడా గొప్ప రచయిత్రి కావాలనే కోరిక ఉంది” అని తన స్టోరీ రైటింగ్​ జర్నీ గురించి చెప్పింది సంజన.

అమ్మల్ని దత్తత తీసుకుంటే..?

“ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే.. అమెరికాలో ఉన్నప్పుడు ‘ఎ టాయ్స్ ఆర్​ అజ్’ (ఈ బొమ్మలు మన కోసం) అనే షాప్​కి వెళ్లా. అక్కడికి వెళ్లినప్పుడు ‘మామ్స్ ఆర్​ అజ్’ అనే పేరుతో స్టోర్​ పెడితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన తరువాత మారుతూ పోయింది. అలా...  పిల్లల్ని దత్తత తీసుకున్నట్టే అమ్మలను దత్తత తీసుకోవచ్చు కదా అనిపించింది. నిజానికి దత్తత తీసుకోవడం అనే ఆలోచన రావడం వెనక చాలా లోతైన కారణాలు ఉన్నాయి. పిల్లల్ని పెంచి పెద్దచేసి వాళ్లని ప్రయోజకుల్ని చేయాలి అనుకుంటారు.

కానీ అదే పెద్దవాళ్లు ఇంట్లో ఉంటే మాత్రం చాలా రకాలుగా ఆలోచిస్తారు. వయసు మీదపడిన ఆ తల్లులు పనిచేయలేకపోవచ్చు. అలాగే వాళ్లని చూడాలంటే ఖర్చులు గుర్తుకొస్తాయి. వాళ్ల ఆరోగ్య సమస్యలు చిరాకు అనుకుంటారు. అందుకే వాళ్లని ఇంట్లో తమ దగ్గర ఉంచుకోకుండా వృద్ధాశ్రమాల్లో చేరుస్తుంటారు చాలామంది పిల్లలు. అయితే, అలా వృద్ధాశ్రమాలు లేదా షెల్టర్​ హోమ్స్​లో ఉంచడం అనేది చాలా హీనంగా అనిపిస్తుంది నా వరకు.’’