చండీగఢ్: రాహుల్ గాంధీకి అసలు ఎంఎస్‌పీ ఫుల్ ఫాం తెలుసా అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. ఎంఎస్‌పీ పేరుతో రైతులకు మాయమాటలు చెప్పడం కాంగ్రెస్ మానుకోవాలని సూచించారు. హర్యానాలో అక్టోబర్ 5న జరిగే ఎన్నికలతో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం హర్యానాలోని రేవారీలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు. "ఎంఎస్‌పీ(కనీస మద్దతు ధర) గురించి మాట్లాడితే ఓట్లు పొందవచ్చని రాహుల్ బాబాకి కొన్ని ఎన్‌జీవోలు చెప్పాయి. అప్పటి నుంచి ఆయన ఎంఎస్‌పీపైనే మాట్లాడుతున్నారు.
రాహుల్ బాబా, మీకు అసలు ఎంఎస్‌పీ ఫుల్ ఫార్మ్ తెలుసా? ఖరీఫ్‌లో, రబీలో ఏఏ పంటలు వేస్తారో చెప్పండి. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం 24 పంటలకు ఎంఎస్‌పీ అమలు చేస్తున్నది. ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఎన్ని పంటలకు ఎంఎస్‌పీ అమలు చేస్తున్నారో హర్యానాలోని కాంగ్రెస్ నేతలు చెప్పగలరా? కర్నాటక, తెలంగాణల్లో ఎన్ని పంటలను ఎంఎస్‌పీకి కొంటున్నారు? కాంగ్రెస్ హయాంలో వరి క్వింటాల్ రూ.1,310కి కొనుగోలు చేశారు. మేం ఇప్పుడు రూ. 2,300 చెల్లించి కొంటున్నాం. హర్యానాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే దాన్ని రూ. 3,100 (క్వింటాల్)కు పెంచుతాం. గోధుమల ఎంఎస్‌పీ క్వింటాల్‌కు రూ.1,450 ఉండేది. అది బీజేపీ ప్రభుత్వ హయాంలో రూ.2,275కి పెరిగింది. ఆవాలు క్వింటాల్ రూ.3,050గా ఉంటే ఇప్పుడు రూ.5,650కి చేరుకుంది" అని అమిత్ షా వివరించారు.
రాహుల్ 3వ తరం వచ్చినా 370ని మళ్లీ తేలేరు
జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని చెబుతున్నారని..రాహుల్ గాంధీ ముడో తరం కూడా 370ని తిరిగి తీసుకురాలేరని అమిత్ షా వెల్లడించారు. ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపులో మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. ఎస్టీ,- ఎస్సీ, -ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని రాహుల్ విదేశాలకు వెళ్లి చెబుతున్నారని..అయితే అది సాధ్యం కాదని తెలిపారు. పార్లమెంటులో ఒక్క బీజేపీ ఎంపీ ఉన్నా..రిజర్వేషన్ల రద్దును అడ్డుకుంటారని చెప్పారు.
హర్యానాలో బీజేపీ అధికారంలోకి వస్తే రేవారిలో ఆవనూనె సహకార ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.రేవారిలో కొత్త మెడికల్ కాలేజీతో పాటు విశ్వకర్మ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. లాడో లక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,100, రూ.500కే గ్యాస్ సిలిండర్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత డయాలసిస్, పేదలకు 5 లక్షల ఇళ్లు ఇస్తామని అమిత్ షా పేర్కొన్నారు.