కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేకి: అమిత్ షా

చండీగఢ్: కాంగ్రెస్ దళిత వ్యతిరేక పార్టీ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. దళిత నేతలైన కుమారి షెల్జా, అశోక్ తన్వర్​లను ఆ పార్టీ తీవ్రంగా అవమానించిందని తెలిపారు. 

అధికారాన్ని కోల్పోయేంత వరకు బీఆర్. అంబేద్కర్​కు ఆ పార్టీ భారతరత్న ఇవ్వలేదని చెప్పారు. హర్యానాలోని తోహనాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. “కాంగ్రెస్ దళిత వ్యతిరేక పార్టీ. దళిత నాయకులైన కుమారి షెల్జా, అశోక్ తన్వర్ లను ఆ పార్టీ అవమానించింది. 

రిజర్వేషన్లు అవసరంలేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అమెరికాలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను పూర్తిగా తొలగిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే రక్షించగలరు. 

మీకు రిజర్వేషన్లు కావాలా..? వద్దా..?. కాంగ్రెస్ అధికారం కోల్పోయేంత వరకు అంబేద్కర్​కు భారతరత్న ఇవ్వలేదు” అని అమిత్ షా తెలిపారు.  సిక్కులకు రాహుల్ క్షమాపణ చెప్పాలి.

భారత్​లోని సిక్కులకు తలపాగా ధరించే స్వేచ్ఛ లేదు.. దేశంలోని గురుద్వారాలను సందర్శించడానికి అనుమతిలేదన్న రాహుల్ వ్యాఖ్యలపై షా స్పందించారు. రాహుల్ గాంధీ  వెంటనే సిక్కులకు క్షమాపణలు చెప్పాలని కోరారు.