ప్రయాగ్రాజ్: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణలొచ్చిన క్రమంలో దేశవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాలు ప్రసాదం నాణ్యతపై దృష్టి సారించాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని కొన్ని దేవాలయాల్లో అయితే ఏకంగా భక్తులు సమర్పించే నైవేద్యాలపైనే నిషేధం విధించిన పరిస్థితి. భక్తులు స్వీట్లు, లడ్లు వంటి వాటికి బదులుగా పండ్లు, కొబ్బరికాయలు నైవేద్యంగా సమర్పించాలని ప్రయాగ్రాజ్లోని దేవాలయాలు భక్తులకు స్పష్టం చేశాయి.
ప్రయాగ్రాజ్లోని సంగంలోని ప్రముఖ దేవాలయాలైన శంకరీ దేవీ, బడే హనుమాన్, మన్కామేశ్వర్ ఆలయాల్లో భక్తులు సమర్పించే నైవేద్యాలపై ఆంక్షలు విధించారు. తిరుపతి లడ్డూపై వివాదం అనంతరం బయట నుంచి తీసుకొచ్చే ప్రసాదాలను నిషేధించామని మన్కామేశ్వర్ ఆలయ అర్చకులు మహంత్ శ్రీధరానంద్ బ్రహ్మచారి జీ మహరాజ్ తెలిపారు. భక్తులు లడ్డూలకు బదులుగా కొబ్బరికాయలను, పండ్లను, డ్రై ఫ్రూట్స్ను ప్రసాదాలుగా సమర్పించాలని సూచించారు. ఒక్క యూపీలో మాత్రమే కాదు పలు ప్రముఖ హిందూ దేవాలయాలు ప్రసాదం నాణ్యతపై ఫోకస్ పెట్టడం గమనార్హం.
ALSO READ | తిరుమల వివాదం : జగన్.. ఈ ఫారంపై సంతకం పెట్టి.. శ్రీవారిని దర్శించుకో : బీజేపీ
ఒడిశాలోని ప్రముఖ దేవాలయం పూరీ జగన్నాథుడి సన్నిధిలో కూడా ప్రసాదం నాణ్యతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నెయ్యి నాణ్యతను పరీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూరీ జగన్నాథుడి ఆలయానికి ఒడిశా మిల్క్ ఫెడరేషన్ నెయ్యిని సరఫరా చేస్తుంది. ఇక.. బద్రీ-కేదార్ ఆలయ కమిటీ కూడా ఉత్తరాఖండ్లోని ఆలయాల్లో పూజలు, విరాళాలు, నైవేద్యాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని నిర్ణయించింది. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలతో సహా ఉత్తరాఖండ్లోని 47 ఆలయాలు బద్రీ-కేదార్ ఆలయ కమిటీ పరిధిలోకి వస్తాయి. లైసెన్స్ లేకుండా ప్రసాదం పేరుతో ఆలయాల వెలుపల లడ్డూలను అమ్మితే కఠిన చర్యలను తీసుకుంటామని బద్రీ-కేదార్ ఆలయ కమిటీ సీఈవో హెచ్చరించారు.