షేక్ హసీనా సీక్రెట్ జైలు ‘హౌస్ ఆఫ్ మిర్రర్స్’

  • ‘ఐనాఘర్’ పేరుతో సైన్యం ఆధ్వర్యంలో రహస్య జైళ్లు
  •     షేక్ హసీనా పదవీకాలంలో వందల మంది అదృశ్యం
  •     వ్యతిరేకించిన వారిని నిర్బంధించారని న్యూయార్క్ టైమ్స్ కథనం

న్యూయార్క్ : స్టూడెంట్ల ఉద్యమంతో పదవికి రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అమెరికన్ మీడియా సంచలన ఆరోపణలు చేసింది. పదవిలో ఉన్న కాలంలో తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని పెద్ద సంఖ్యలో అక్రమంగా నిర్బంధించారని ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం ప్రచురించింది.

ఈ అక్రమ నిర్బంధాలతో కొన్ని వందల మంది చనిపోయారని.. పెద్ద సంఖ్యలో ఆచూకీ లేకుండా పోయారని అందులో తెలిపింది. తనపై విమర్శలు చేసిన, వ్యతిరేకించిన వారిని నిర్బంధించేందుకు సైన్యం ఆధ్వర్యంలో ‘ఐనాఘర్’(మిర్రర్​ హౌస్​ లేదా అద్దాల ఇల్లు) నే రహస్య జైళ్లు నిర్మించి అందులో బంధించి హింసించారని తెలిపింది. 

తమకు తామే తప్ప ఇతరులెవరూ కనిపించకుండా అద్దాలతో నిర్మించిన ఈ రహస్య జైలు గదుల్లో చేతికి సంకెళ్లతో బంధించే వారని బాధితులు కొందరు తెలిపినట్టు పేర్కొంది. హసీనా అధికారం చేపట్టిన 2009 నుంచి వందల మందిని భద్రతా దళాలు అక్రమంగా అరెస్టు చేసినట్టు ఆరోపించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలకు చేసిన వారు కూడా చాలా మంది హత్యలకు గురయ్యారని చెప్పింది. సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తం చేసిన, విమర్శలు చేసిన ఎంతో మంది రహస్య జైళ్లలో బందీలయ్యారని వివరించింది.

‘ఐనా ఘర్’ అంటే ఏమిటి?

హసీనాను వ్యతిరేకించే వారిని నిర్భందించేందుకు బంగ్లాదేశ్ ఆర్మీ ఇంటెలిజెన్స్​ విభాగం అనేక రహస్య జైళ్లను నిర్మించిందని న్యూయార్క్​ టైమ్స్ తెలిపింది. ఈ అండర్‌‌‌‌ గ్రౌండ్ జైళ్లలో గదిలో బంధించిన వ్యక్తికి తన ప్రతిబింబం తప్ప మరో మనిషి కనిపించరు. ఒక మూలన టాయిలెట్.. చిన్న వెంటిలెటర్ తప్ప ఆ గదిలో ఇంకేమి ఉండదు. ఇందులో ఖైదీలను చేతులకు సంకెళ్లతో బంధించేవారు.

ఆర్మీ ఇంటెలిజెన్స్​ ఆధ్వర్యంలో నడిచే వీటిలో బంధీలను శారీరకంగా, మానసికంగా హింసించే వారు. నాలుగైదు నెలలకొకసారి వారికి జట్టు కత్తించేవారు. అయితే ఈ జైళ్లు ఎక్కడున్నాయనేది బాధితులు చెప్పలేకపోయారు. తాము ఉంటున్న గదిపైన ప్రతిరోజు ఉదయం చాలా మంది సైనిక కవాతు చేసినట్లు శబ్దాలు విన్నామని పేర్కొన్నారు.

2019 వరకు ఖతార్, వియత్నాంలో బంగ్లాదేశ్ రాయబారిగా పనిచేసిన మరూఫ్ జమాన్ 467 రోజులు మిర్రర్ హౌస్  జైలు జీవితం గడిపినట్టు చెప్పారు. ‘‘ఎనిమిదేండ్ల తర్వాత కళ్లకు గంతలు కట్టి, చేతికి సంకెళ్లు వేసి, రహస్య జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు” అని 2016లో నిర్బంధానికి గురైన బంగ్లాదేశ్ అడ్వకేట్ అహ్మద్ బిన్ క్వాసెమ్‌‌‌‌ అన్నారు. 

ఇన్నేండ్ల తర్వాత తాను స్వచ్ఛమైన గాలిని పీల్చుతున్నానని ఇటీవల విడుదలైన ఆయన మీడియాకు చెప్పారు. వారు తనను చంపేస్తారని అనుకున్నానని అయితే హసీనా పలాయనంతో విముక్తి లభించిందన్నారు. 24 గంటలు చేతులకు బేడీలు వేసి ఉంచేవారని తెలిపారు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఏమాత్రం తెలియనిచ్చే వారు కాదన్నారు.